నక్క తరిమింది.. కోడికి తెలిసొచ్చింది!

ఒక రైతు కోడి, బాతును పెంచుకునేవాడు. బాతుది నెమ్మది స్వభావమైతే.. కోడికి ఆడంబరాలు, అహంకారం ఎక్కువ. చూడముచ్చటగా ఉండే బాతును చుట్టుపక్కలున్న పిల్లలు మెచ్చుకుంటుండేవారు.

Updated : 14 Dec 2022 05:59 IST

క రైతు కోడి, బాతును పెంచుకునేవాడు. బాతుది నెమ్మది స్వభావమైతే.. కోడికి ఆడంబరాలు, అహంకారం ఎక్కువ. చూడముచ్చటగా ఉండే బాతును చుట్టుపక్కలున్న పిల్లలు మెచ్చుకుంటుండేవారు. అది చూసిన కోడి అసూయ పడుతుండేది.

ఒకరోజు ‘బాతు బావా.. రోజూ ఒకేలా బతకడంలో ఆనందమేముంది? ఒకసారి అడవిని చుట్టి వద్దామా?’ అని అడిగింది కోడి. ‘అడవంటే జంతువులు ఉంటాయి. వాటితో మనలాంటి చిరు జీవులకు ప్రమాదం పొంచి ఉంటుంది’ అని భయంభయంగా అంది బాతు.

‘నువ్వు పిరికిదానివి. నాలాంటి రాజవంశీయులకు మాత్రం సాహసమే ఊపిరి..’ అని గొప్పగా చెప్పింది కోడి. ‘రాజవంశీయులంటున్నావు.. అడవిలో మృగరాజుకు, నీకు ఏదైనా బంధుత్వం ఉందా?’ అని అమాయకంగా అడిగింది బాతు. ‘అడవిలో మృగరాజు కన్నా నేనే ఎక్కువ’ అని దర్పంగా చెప్పుకొంది కోడి.

‘ఎందులో?’ అని కుతూహలంగా అడిగింది బాతు. ‘మా వంశానికి పుట్టుకతోనే కిరీటాన్ని తొడిగి.. దేవుడు భూలోకానికి పంపిస్తాడు’ అంటూ నెత్తిమీద ఉన్న తురాయిని చూపించిందది. అక్కడితో ఆగక ‘నన్ను రమ్మని మృగరాజు నిన్న కాకితో కబురు పంపింది. ఆ విందు ఆరగించి వెంటనే తిరిగి వచ్చేద్దాం పద’ అంటూ నమ్మబలికింది కోడి.

‘రాజవంశీయులకు ధైర్యసాహసాలు వెన్నతో పెట్టిన విద్య’ అని నమ్మిన బాతు, సరే అంది. మరుసటి రోజే ఆ రెండూ కలిసి యజమాని కళ్లు గప్పి అడవి బాట పట్టాయి. మార్గమధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ మైమరచిపోతూ ముందుకు వెళ్లసాగాయి.
ఇంతలో ఆహారం కోసం వెళ్లి.., తిరిగి వస్తున్న చిలుకమ్మ.. కోడి, బాతుల వైపు ఆశ్చర్యంగా చూసింది. ‘గ్రామాల్లో ఉండాల్సిన మీకు ఇక్కడ ఏం పని?’ అని అడిగింది. బడాయికి పోయిన కోడి.. ‘మృగరాజు పిలుపు మేరకు వస్తున్నాను’ అని బదులిచ్చింది. ‘మరి.. ఈ బాతు?’ అని ఆశ్చర్యంగా అడిగింది చిలుకమ్మ. ‘అది నా సేవకుడు’ అని చెప్పింది కోడి. దాని గొప్పల కోసం కోడి తనను తక్కువ చేస్తోందని గ్రహించింది బాతు. ఇక కోడితో తన ప్రయాణం ప్రాణాలకే ప్రమాదమని భావించింది.

‘కోతలు కోయకు.. మృగరాజు ఎక్కడ? నువ్వెక్కడ? నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని దాని ముఖాన్నే అనేసింది చిలుకమ్మ. ‘మేము రాజులం. సింహానికి జూలు, నాకు నెత్తి మీద తురాయి భగవంతుడిచ్చిన కిరీటాలు’ అంటూ గడుసుగా రుజువు చూపింది కోడి. ఆలోచనలో పడిన చిలుకమ్మ.. ‘అదిగో ఆ కొండల నడుమ గుహ ఉంది.. వెళ్లండి’ అంటూ దారి చూపింది.

అంతలో చీకటి పడటంతో ‘నేను విశ్రాంతి తీసుకోవాలి. తెల్లవారుజామునే వెళ్లి మృగరాజును కలుస్తాను. ఈ రాత్రికి నా హోదాకు తగిన నివాసం చూపిస్తే చాలు. నీ రుణం ఉంచుకోను. మృగరాజుకు చెప్పి మంచి కానుకలు ఇప్పిస్తాను’ అని డాంబికాన్ని ప్రదర్శించింది కోడి. 

‘నాకు కానుకలేమీ అవసరం లేదు. మీరు అడవికి వచ్చిన అతిథులు. అతిథులను గౌరవించడం మా పెద్దలు నేర్పిన సంప్రదాయం. మరి బాతు సంగతి?’ అని అడిగింది చిలుకమ్మ. ‘సేవకులకు ఏమి అవసరం లేదులే? నాకు రక్షణగా పక్కనే ఉన్న కొలనులో ఉంటుంది..’ అంటూ బాతును మరోసారి చులకన చేసింది కోడి.

విందు అని పిలిచి తనను అవమానించడంతో బాతు చిన్నబుచ్చుకుంది. తెల్లారగానే యజమాని దగ్గరకు వెళ్లడమే మంచిదని అనుకుంది. ఆ రాత్రికి జంతువుల నుంచి రక్షణ కోసం కొలనులోకి వెళ్లిపోయింది. తనతో కలిసి వచ్చిన బాతును కించపరచడంతో కోడి స్వభావమేంటో చిలుకకు అర్థమైంది. ‘రాజహంసలా ఉన్న బాతుకే నువ్వు సేవకురాలిలా కనిపిస్తున్నావు’ అంటూ చురక తగిలించడంతో కోడికి కోపం వచ్చింది. ‘నాతోనే పరాచికాలు ఆడుతున్నావా? మృగరాజుతో చెప్పి నిన్నేం చేస్తానో చూడు’ అంటూ చిలుకమ్మ వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగరేసింది.

‘రాజులు విచారణ చేయించకుండా శిక్షించరు. అందులోనూ మా మృగరాజు ధర్మప్రభువులు. నేనే గొప్ప.. నేను చెప్పిందే వినాలని అనుకోవడం తెలివి తక్కువతనం. నిన్ను నువ్వు కీర్తించుకోవడంలో అహంకారం దాగి ఉంటుందన్న సత్యం మా మృగరాజు ఇట్టే పసిగట్టేస్తారు’ అంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది చిలుకమ్మ.

కోడి ‘కొక్కొరోకో..’ అంటూ కోపంతో ఊగిపోయింది. అదే సమయంలో ఓ నక్క అక్కడికి వచ్చింది. కోడిని చూడగానే నోట్లో నీళ్లూరడంతో దానివెంట పడింది. అనుకోని ప్రమాదంతో కోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగిరి చెట్టెక్కుదామంటే.. కొమ్మలు చాలా ఎత్తులో ఉన్నాయి. ఇదంతా చెట్టుపైనున్న చిలుకమ్మ గమనిస్తూ.. ‘నక్క బావా.. ఈ కోడి ఎవరనుకున్నావు? మన మృగరాజు అతిథి. మృగరాజుకు ఈ విషయం తెలిస్తే నీకు శిక్ష ఖాయం’ అని హెచ్చరించింది చిలుకమ్మ.

‘ఈ ఎగరలేని పిట్ట మృగరాజు అతిథా?’ అంటూ బిగ్గరగా నవ్వింది నక్క. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగుపెడుతున్న కోడిని చూసింది బాతు. ‘కోడి బావా.. ఈ కొలనులోకి దూకి, నా శరీరం మీదకు ఎక్కి కూర్చో’ అని గట్టిగా అరిచి పిలిచింది.

కోడికి మరో దారిలేక.. కొలనులోకి దూకింది. ఈలోగా ఈదుకుంటూ దాని దగ్గరకు చేరుకుంది బాతు. రెక్కల సాయంతో కోడిని తన మీదకు ఎక్కించుకుందది. నక్కకు ఈత రాక ఒడ్డునే చాలాసేపు నిరీక్షించింది. ఆకలి వేయడంతో ఇక లాభం లేదనుకొని వెళ్లిపోయింది. దాంతో కోడి, బాతు ఊపిరి పీల్చుకున్నాయి. తర్వాత వచ్చిన దారినే యజమాని ఇంటి దారి పట్టాయి.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని