Published : 08 Jan 2023 00:16 IST

ఊరంతా ఉరిమే ఉత్సాహం!

అనగనగా ఓ ఊరు.. అది అలాంటి ఇలాంటి పల్లె కాదు... ఊరంతా ఉరిమే ఉత్సాహంతో... ఉరకలేసే చిరు చిరుతలుండే ఊరు... ఇంతకీ ఎవరా చిరుతలు? ఎక్కడుంది ఆ ఊరు? అసలు ప్రత్యేకత ఏంటి? ఈ కథనం చదివేయండి నేస్తాలూ! ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మీకే సమాధానం దొరుకుతుంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గీజా అనే గ్రామం చూడడానికి అన్ని ఊళ్లలానే ఉంటుంది. కానీ ఇక్కడే ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఊరి పిల్లలు భలేగా బాస్కెట్‌బాల్‌ ఆడతారు. అదీ సాదాసీదాగా కాదు... చూసేవాళ్లు అవాక్కయ్యేలా, టక్కున ముక్కున వేలేసుకునేలా ఆడేస్తారు. గ్రామంలో ఉన్న పిల్లలందరూ దాదాపుగా బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్లే. ఈ ఊర్లో ప్రతి ఇంట్లోనూ కనీసం ఓ బాస్కెట్‌ బాల్‌ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.


ఇదంతా కోచ్‌ వల్లేనోచ్‌!

ఒక చిన్నగ్రామం ఓ క్రీడాగ్రామంగా మారడానికి కారణం ఓ కోచ్‌. ఆయన పేరు ప్రద్యుత్‌. ఆయన జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. ఆయన గీజా గ్రామంలో డ్రిబుల్‌ పేరిట అకాడమీ నడుపుతున్నారు. ఇందులో వందల సంఖ్యలో చిన్నారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.


అమెరికాలో ఉండగానే...

ప్రద్యుత్‌ అమెరికాలో బాస్కెట్‌బాల్‌ శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు మన దేశంలో ఓ అకాడమీని నెలకొల్పి, చిన్నారులకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. కానీ ఈ ఊళ్లో వాళ్లందరూ దాదాపు మధ్యతరగతికి చెందిన వాళ్లే. దీంతో ప్రద్యుత్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. పిల్లల తల్లిదండ్రులను ఎంతో బతిమాలితే కానీ వాళ్లు శిక్షణకు పంపడానికి ఒప్పుకోలేదు.


దాతల చేయూత....

అకాడమీ కేవలం అయిదుగురు పిల్లలతో ప్రారంభమైంది. బాస్కెట్‌ బాల్‌ ఆడేందుకు సరైన కోర్టు లేదు. కనీసం గోల్‌పోస్టులూ లేవు. ప్రద్యుత్‌ వెదురు కర్రలసాయంతో గోల్‌పోస్టులు తయారు చేసి, ఓ చిన్న స్థలంలో శిక్షణ ప్రారంభించారు. ఇలా క్రమంగా వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 150 మంది వరకు చిన్నారులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో 60 మంది బాలికలున్నారు. ఈ అకాడమీ కేవలం ఆటల్లోనే కాకుండా, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పైనా శిక్షణ ఇస్తోంది. ఎన్‌ఈఎమ్‌ అనే పాఠశాల వాళ్లు ముందుకొచ్చి తమ ఆటస్థలాన్ని ప్రద్యుత్‌ నెలకొల్పిన అకాడమీ కోసం ఇచ్చారు. దాతల సహాయ సహకారాలతో ఇందులో చక్కటి బాస్కెట్‌బాల్‌ కోర్టును ఏర్పాటు చేశారు. బాస్కెట్‌బాళ్లు, బూట్లు, క్రీడాదుస్తులు కూడా చాలావరకు దాతలే సమకూర్చారు. ఆర్థికంగా కూడా అండగా నిలుస్తున్నారు.


ఇతర గ్రామాల్లో కూడా...

కేవలం గీజా గ్రామంలోనే కాకుండా ఈ అకాడమీ వాళ్లు చుట్టుపక్కల ఊళ్లలోనూ బాస్కెట్‌బాల్‌ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల ఎక్కడ బాస్కెట్‌ బాల్‌ పోటీలు జరిగినా డ్రిబుల్‌ అకాడమీకి చెందిన జట్టే విజేతగా నిలుస్తోంది. భవిష్యత్తులో భారత బాస్కెట్‌బాల్‌ జట్టులో స్థానం సంపాదించాలని ఈ అకాడమీకి చెందిన చిన్నారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మేరకు శిక్షణలోనూ దూసుకుపోతున్నారు. మరి మనమూ ఈ చిరుతల్లాంటి చిన్నారులకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని