Updated : 20 Jan 2023 05:48 IST

అసలు దొంగ!

కుంతలవనానికి రాజు జయచంద్రుడు. మృధుస్వభావి. ఇతరులను ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. కొంతకాలంగా రాజ్యంలో దొంగతనాలు అధికమయ్యాయి. విషయం తెలుసుకున్న మహారాజు ఆ సమస్యకు కారణం తెలుసుకునేందుకు మంత్రితోపాటు మారువేషంలో రాత్రిపూట రాజ్యంలో పర్యటించాలని అనుకున్నాడు. ‘ఈరోజు రాత్రి మన రాజ్య ఉత్తర ప్రాంతానికి వెళ్దాం. పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయించండి’ అని మంత్రితో అన్నాడు రాజు. ‘మహారాజా.. ఉత్తర ప్రాంతంలో రాత్రులు కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈసారికి పడమర వైపు వెళ్దాం’ అన్నాడు మంత్రి. మొదట ఆలోచించినా.. తర్వాత సరేనన్నాడు రాజు.

మారువేషాల్లో రాజు, మంత్రి పడమర దిక్కుకు చేరుకోగా.. అక్కడ ఓ చెట్టు కింద చీకటిలో కొంతమంది కూర్చుని మాట్లాడుకోసాగారు. ఆ మాటలను బట్టి వాళ్లు దొంగలని, రాజ్య ఉత్తర ప్రాంతంలోని ఒక ధనవంతుని ఇంట్లో దొంగతనానికి వెళ్లబోతున్నట్లు అర్థమైంది. ఇంతలో మంత్రి తుమ్మడంతో.. దొంగలు అప్రమత్తమై, ‘ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీ దగ్గర ఉన్న సొత్తును ఇచ్చేయండి. లేకపోతే మీ ప్రాణాలు పోతాయి’ అని హెచ్చరించారు. అప్పుడు మారువేషంలో ఉన్న మహారాజు ‘మాది ఈ రాజ్యం కాదు. పని మీద ఇక్కడికి వచ్చాం. చీకటి పడటంతో ఈ చెట్టు దగ్గర విశ్రమించాం. మా దగ్గర ఉన్న డబ్బు ఇస్తాం.. కానీ మీరు ఎవరు?, ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నారు? కష్టపడి ఏదైనా పని చేసుకోవచ్చు కదా?’ అన్నాడు. వెంటనే ఆముఠాలోని ఒక దొంగ ‘మా రాజ్యంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఇలా దొంగలుగా మారాం’ అన్నాడు. ‘ఆ విషయాన్ని మీ రాజు గారి దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా!’ అని అడిగాడు రాజు. ‘మా రాజు గారి దగ్గరకు వెళ్లాలంటే.. ముందు సేనాధిపతిని దాటాలి. తన బంధువులకు తప్ప సామాన్యులెవరికీ ఆస్థానంలో కొలువులు రాకుండా చూస్తాడు’ అని వివరించాడా వ్యక్తి.

‘సేనాపతి ఇంత పని చేస్తున్నాడా?’ అనుకొని వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును ఆ దొంగలకు ఇచ్చి, దగ్గర్లోని సత్రానికి చేరుకున్నారు. అక్కడా అందరూ సేనాధిపతి గురించి చెడుగా మాట్లాడసాగారు. అసలు విషయం తెలుసుకుందామని మహారాజు వెంటనే మంత్రితో కలిసి రాజ్యానికి చేరుకున్నాడు. రాజ్యంలో అందరి మీద నిఘా పెట్టాడు. కొంతమంది నమ్మకస్తులైన యువకులను పిలిపించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశాడు. వారం రోజుల తర్వాత ఆ యువకులు మళ్లీ వచ్చి.. రాజుతో చాలా సమయం చర్చించారు. వారి మాటలకు ఆశ్చర్యపోయిన రాజు.. వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి వచ్చిన అందరి సమక్షంలో రాజు ‘మన రాజ్యంలో ఉన్న కొందరి వ్యక్తుల స్వార్థం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతోంది. దాంతో వారి తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నా. దొంగతనాలతో ప్రజల్లో అలజడి సృష్టించి.. రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని పథకం పన్నారు’ అనగానే.. సభలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ‘ఆ పని ఎవరు చేసింది?’ అని అందరూ అనుకుంటుండగా.. మంత్రి నిలబడి, ‘ఇంకెవరు.. మన సేనాధిపతే ఇటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాడు. మొన్న నేను, రాజు గారు మారువేషాల్లో రాజ్యంలో తిరిగినప్పుడు ప్రజలే ఈ విషయాన్ని మాకు చెప్పారు’ అన్నాడు.

అక్కడ ఉన్న వారందరూ ‘వెంటనే సేనాధిపతిని బంధించాలి.. శిక్షించాలి’ అంటూ కేకలు వేయసాగారు. మహారాజు కోపంగా నిలబడటంతో.. సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. మహారాజు మాట్లాడుతూ ‘నేను ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొందరు యువకుల ద్వారా రాజ్యంలోని విషయాలను తెలుసుకున్నాను. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. అదేంటంటే.. మన రాజ్యంలో అలజడులకు కారణం సేనాధిపతి కాదు.. మన మహామంత్రే’ అని అనగానే అందరూ నోరెళ్లబెట్టారు. ‘మరి మీరు మొన్న మారువేషాల్లో వెళ్లినప్పుడు ప్రజలు సేనాధిపతే కారణమని చెప్పారన్నారు’ అని కొందరు ప్రశ్నించగా.. ‘అది కూడా మంత్రి కుట్రలో భాగమే.. నేను అనుకున్న దిక్కుకు కాకుండా మరో వైపు వెళ్దామన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రే ద్రోహి.. అతడిని బంధించండి’ అని సేనాధిపతిని ఆదేశించాడు రాజు. వెంటనే తన వద్ద ఉన్న కత్తితో రాజు మీద దాడికి ప్రయత్నించాడు మంత్రి. మెరుపు వేగంతో స్పందించిన భటులు.. మంత్రిని బంధించి చెరసాలలో వేశారు. తర్వాత రాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఒక విధంగా ఈ దొంగల వల్ల మంచే జరిగింది. రాజ ద్రోహుల గుట్టు బయటపడింది. ఏది ఏమైనా పెద్ద ప్రమాదం తప్పింది’ అన్నాడు. అప్పటి నుంచి రాజు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండసాగాడు.  

కళ్లేపల్లి ఏడుకొండలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు