Published : 21 Jan 2023 00:02 IST

సూరయ్య - వీరయ్య!

సూరయ్య, వీరయ్యలవి పార్వతీపురంలో ఇరుగుపొరుగు ఇళ్లు. సూరయ్యది కష్టపడే మనస్తత్వమైతే, వీరయ్య విలాసవంతుడు. ఇద్దరికీ వారి తల్లిదండ్రుల నుంచి కొన్ని ఆస్తులు వచ్చాయి. గొర్రెల మంద సూరయ్యకు వస్తే, వీరయ్యకు మామిడి తోట వచ్చింది. సూరయ్య మందలోని గొర్రెలను కాపాడుకుంటూ రావడంతో.. కొద్దిరోజుల్లోనే వాటి సంఖ్య పెరిగింది. వాటిని కాసేందుకు కొంతమంది పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు. వీరయ్య మాత్రం ఏడాదికొకసారి తోటకెళ్లి, పండిన పంటను తెచ్చుకునేవాడు. మిగతా సమయంలో తోట బాగోగులు అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏ పనీ చేయకపోవడంతో క్రమక్రమంగా అప్పులు పెరిగాయి. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయన్న మాట వీరయ్య విషయంలో నిజమైంది. అప్పులు తీర్చే మార్గం తెలియక.. అతడిలో అసహనం పెరిగింది. అది కాస్త.. తన కళ్ల ముందే బాగా సంపాదిస్తున్న సూరయ్యపైన ద్వేషాన్ని పెంచింది. అసూయతో ఎలాగైనా అతడిని ఇబ్బందులు పాలు చేయాలనుకున్నాడు. తన మామిడి తోటలోని చెట్ల కొమ్మల్ని తానే నరికి, ఆ నేరం సూరయ్య పైకి నెట్టాలనుకున్నాడు.

అదే రోజు పార్వతీపురం జమిందారు దగ్గరకు వెళ్లాడు వీరయ్య. తన తోటలోని చెట్ల కొమ్మలను సూరయ్య నరికినట్లు ఫిర్యాదు చేశాడు. ‘నీ ఆరోపణ నిజమేనా?’ అడిగాడు జమిందారు. ‘మా పొరుగునే ఉండే సూరయ్య మేకలను, గొర్రెలను పెంచుతుంటాడు. వాటిని మేపేందుకు అడవికి వెళ్లలేక, అలా చేసి ఉంటాడు. అతని మీదే నా అనుమానం. నాకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోండి’ అని విన్నవించుకున్నాడు వీరయ్య. జమిందారుకు కూడా పెద్ద సంఖ్యలో గొర్రెలు ఉన్న సూరయ్య మీద కాస్త అనుమానం కలిగింది. వెంటనే అతడిని పిలిపించాడు. సూరయ్య రాగానే విచారణ చేయడం మొదలు పెట్టాడు. ‘నీ దగ్గర ఎన్ని గొర్రెలు, మేకలు ఉన్నాయి?’ అడిగాడు జమిందారు. ‘అయ్యా.. నా దగ్గర గొర్రెలు మాత్రమే ఉన్నాయి’ అని సమాధానం ఇచ్చాడు సూరయ్య. ‘ఎన్ని?’ అని జమిందారు అడగడంతో ‘మంద పెంచుతున్నప్పుడు వాటి సంఖ్య చెప్పొద్దని మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు. నా నోటితో ఆ సంఖ్య చెప్పలేను.. అలాగని మీలాంటి పెద్దల మాట జవదాటలేను. మందను మావాళ్లు మేతకు తీసుకెళ్లేటప్పుడు.. అంతా కలిపి తలలు లెక్కపెడితే తొంభై, కాళ్లు లెక్కిస్తే మూడొందల యాభై’ అని వివరించాడు సూరయ్య.

ఒక్క క్షణం ఆలోచించిన జమిందారు.. ‘నువ్వు తెలివైనవాడివే. మీ గొర్రెల మందకి పంచభూతాలు కాపుకాస్తున్నాయన్నమాట’ అని నవ్వాడు. పక్కనే ఉన్న దివాను జమిందారు వైపు ఆశ్చర్యంగా చూసి.. మనసులోనే లెక్కించడం మొదలు పెట్టసాగాడు. ‘నిజమే!’ అంటూ నవ్వేశాడు సూరయ్య. జమిందారు తెలివిని అభినందిస్తూ చప్పట్లు కొట్టాడు దివాను. ‘గొర్రెల సంఖ్య తెలిసింది. నీ పెంపుడు జీవుల మేత కోసం వీరయ్య మామిడి తోటలోని కొమ్మలను నరకడం ఎంతవరకు సమంజసం? నీ మీద వచ్చిన అభియోగానికి సమాధానం చెప్పు’ అన్నాడు జమిందారు. ‘అయ్యా! ఆ అభియోగం పూర్తిగా తప్పు. కొమ్మల చిగుళ్లను మేకలే ఇష్టంగా తింటాయి. గొర్రెలు మైదాన ప్రాంతంలో లేదా పొలం గట్లపై ఉండే పచ్చిక బయళ్లనే తింటాయి. పచ్చగడ్డి తినే గొర్రెలకు మామిడి చిగురుతో పని ఏముంది? మీరే ఆలోచించండి’ అంటూ వివరణ ఇచ్చాడు సూరయ్య. ఆ మాటలకు జమిందారు ఆలోచనలో పడ్డాడు. సూరయ్య మాటలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. ఆ ప్రాంతంలో గొర్రెల పెంపకం చేస్తున్న ఇంకొందరిని పిలిపించుకొని, వాటి ఆహారం విధానంపై ఆరా తీశాడు.

సూరయ్య చెప్పేది నిజమేనని తేలింది. ‘వీరయ్యా! సూరయ్యపై మోపిన అభియోగం తప్పని తేలింది. మరో ప్రయత్నంగా నా దగ్గర దొంగలను పట్టగలిగే కుక్కలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి నీకు న్యాయం జరిగేలా చూస్తాను’ అన్నాడు జమిందారు. ఆ మాటలతో వీరయ్యకు దిమ్మతిరిగినంత పనైంది. కుక్కలు వస్తే తన బండారం బయటపడుతుందేమోనన్న భయంతో తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు. ‘అయ్యా.. ఇక్కడితో ఈ విషయాన్ని విడిచిపెట్టండి. నేరం చేసిన వారిని క్షమించి వదిలేయండి’ అంటూ పెద్దరికం చూపబోయాడు వీరయ్య. ‘క్షమాగుణం ప్రదర్శించిన నీకు అభినందనలు. కానీ, విచారణకు పిలిపించిన సూరయ్య పరువుకు ఇప్పుడు నీవల్ల భంగం కలిగింది. అందుకు నష్ట పరిహారం కింద ఒక్కో గొర్రెకు వంద రూపాయలు చొప్పున.. మొత్తం ఎనిమిది వేల అయిదొందలు చెల్లించు’ అంటూ తాఖీదు ఇచ్చాడు జమిందారు. ‘గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండూ తగిలాయి’ అంటూ నిట్టూర్చాడు వీరయ్య. ‘అంటే.. సూరయ్య దగ్గర ఎనభై అయిదు గొర్రెలు ఉన్నాయన్నమాట’ అని దివాను అనడంతో, నిజమేనంటూ నవ్వేశాడు జమిందారు.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని