జిత్తులమారి తెలివి!

అడవిలోని ఒక గుహలోకి ఎక్కడి నుంచో వచ్చిన ఓ నక్క జంట ప్రవేశించింది. ఆ గుహ ఆడ నక్కకు ఎంతో నచ్చింది. నిజానికి అది ఒక పులి గుహ. అందులో ఉండే పులి తెల్లవారడానికి ముందే అక్కడి నుంచి వేటకు బయలుదేరి, తిరిగి సాయంత్రం గుహకు చేరుకుంటుంది.

Updated : 22 Jan 2023 00:35 IST

అడవిలోని ఒక గుహలోకి ఎక్కడి నుంచో వచ్చిన ఓ నక్క జంట ప్రవేశించింది. ఆ గుహ ఆడ నక్కకు ఎంతో నచ్చింది. నిజానికి అది ఒక పులి గుహ. అందులో ఉండే పులి తెల్లవారడానికి ముందే అక్కడి నుంచి వేటకు బయలుదేరి, తిరిగి సాయంత్రం గుహకు చేరుకుంటుంది. కానీ నక్క జంటకు ఈ విషయం తెలియదు. ఆడ నక్క ఎలాగైనా సరే ఆ గుహలోనే ఉండిపోవాలనుకుంది. కానీ మగ నక్కకు మాత్రం అది పులి గుహే అని అనుమానం వచ్చింది. ‘వేట కోసం వెళ్లిన పులి, సాయంత్రానికి తిరిగి రావచ్చు. అది మనల్ని చూసిందంటే ఇంక అంతే సంగతులు. ఇక్కడ ఉండటం మన ప్రాణాలకు అస్సలు మంచిది కాదు’ అని ఆడ నక్కతో అంది. అయితే ఆడ నక్క మాత్రం.. ‘అదంతా కుదరదు.. దాన్ని ఇక్కడికి రానివ్వకుండా చేసి మనం మాత్రం ఇక్కడే ఉండిపోదాం’ అంది. ‘నువ్వే ఏదో ఒక ఆలోచన చెప్పు’ అని అడిగింది మగ నక్క. ఆ మాటతో ఆడ నక్క ఆలోచనలో పడింది.

ఇంతలో సాయంత్రమైంది. పులి గుహ వైపు రావడాన్ని ఆడ నక్క చూసింది. అది వెంటనే మగ నక్కతో గొంతు పెంచి.. ‘మన పిల్లలు పులి మాంసం తినాలంటూ చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అదిగో పులి వస్తోంది.. దాన్నో దెబ్బ వేసి తీసుకురా’ అంది. అప్పటికే గుహ చేరువకు వచ్చిన పులికి ఆ మాటలు వినిపించడంతో అది భయపడింది. ‘ఏమిటీ.. నన్నే ఓ దెబ్బేసి తీసుకురమ్మనమని చెబుతోందంటే అదేదో నాకంటే బలమైన జంతువు అయిండొచ్చు’ అనుకుని పులి వెనక్కు పరిగెత్తింది. అలా కొద్ది దూరం వెళ్లాక, దారిలో ఒక తోడేలు ఎదురైంది. పరిగెత్తుకుంటూ వస్తున్న పులిని ఆపి.. ‘ఎందుకలా రొప్పుతూ వస్తున్నావు.. ఏమైంది?’ అని అడిగింది. పులి తను విన్న విషయం చెప్పింది.

‘ఏమిటీ.. నీ గుహలో నక్క జంట, వాటి పిల్లలే కదా ఉన్నాయి. ఆ మాత్రం దానికి ఎందుకు భయపడుతున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగింది తోడేలు. అయినా, పులి లోపల భయం మాత్రం పోలేదు. ‘గుహలో నక్క జంట, వాటి పిల్లలూ ఉన్నాయని నీకెలా తెలుసు?’ అని అడిగింది పులి. ‘నేను చెప్పేది నిజం.. మనిద్దరం కలిసి గుహలోకి పోదాం. నేను చెప్పేది నిజమని నీకు నిరూపిస్తా’ అంది తోడేలు. ఆ మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకున్న పులి సరేనంది. ‘కానీ, ఒక్క విషయం. నీ తోకను నా తోకకు కట్టుకో. మధ్యలో నువ్వు నన్ను విడిచిపెట్టి పారిపోతే ఎలా.. ఈ షరతుకు అంగీకరిస్తానంటేనే వస్తా’ అంది పులి. అందుకు తోడేలు ఒప్పుకొంది. పులి తన తోకను, తోడేలు తోకకు కట్టింది. రెండూ కలిసి గుహ వైపు బయలుదేరాయి. వాటిని గుహ లోపలి ఆడ నక్క దూరం నుంచే చూసింది. ఇప్పుడేం చేయాలా అని ఆలోచించింది.

ఆడ నక్క ఇప్పుడు మరింత పెద్దగా అరిచింది. ‘ఓ తోడేలూ.. నువ్వు నాకు రెండు పులులను తీసుకొస్తానని చెప్పి, ఒక్కదాన్నే తెస్తున్నావేంటి? నీకు తెలియదా.. నాకు ఒక పులి చాలదని..’ అంది ఆడ నక్క. ఆ మాటలు నిజమని నమ్మిన పులి, అక్కడి నుంచి పారిపోయింది. దాని తోకకు తోడేలు తోక కూడా కట్టి ఉండటంతో.. పులి వేగంతో పరిగెత్తలేక బోల్తాపడింది. ఎలాగోలా తన తోకను విడిపించుకుంది. పులి మాత్రం పరిగెడుతూనే ఉంది. అప్పుడు దానికి దారిలో ఓ కోతి ఎదురుపడింది. పులి పరిగెత్తుకుంటూ రావడం చూసిన కోతి, దాన్ని ఆపి విషయం తెలుసుకుంది. ‘నీ గుహలో ఉన్నది నక్కే.. దానికే భయపడుతున్నావా?’ అడిగింది కోతి. ఆ మాటలను పులి నమ్మకపోవడంతో.. ‘కావాలంటే నీతో వచ్చి, నా మాట నిజమని నిరూపిస్తాను’ అంది కోతి. దాంతో కోతిని తన వీపు మీద పెట్టుకుని బయలుదేరింది.

ఆ రెండూ కలిసి రావడం గమనించిన గుహ లోపలి ఆడ నక్క.. ‘కోతి మిత్రమా.. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. పులిని ఉదయాన్నే తీసుకొస్తానని చెప్పి ఇంత ఆలస్యంగా తీసుకురావడమేంటి? పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు..’ అని గట్టిగా అంది. ఆ మాటలు విన్న పులి.. ఈ జంతువులన్నీ కలిసే పథకం ప్రకారం తన ప్రాణాలకు ఎసరు పెట్టాయనుకుంటూ పరుగు అందుకుంది. ఆ తర్వాత పులి ఎవరి మాటలూ నమ్మలేదు. అక్కడికి దూరంలో మరో గుహను తన నివాసంగా మార్చుకుంది. తమ చతురతతో నక్క జంట, తమకిష్టమైన గుహలోనే దర్జాగా నివసించసాగాయి.

యామిజాల జగదీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని