Published : 23 Jan 2023 00:17 IST

చిట్టి పావురం.. చిన్ని చిలుక!

డవి జీవుల సమావేశం మొదలైంది. రాజైన సింహం సింహాసనం మీద కూర్చుంది. పక్కనే మంత్రి కుందేలు కూడా ఉంది. దాని పేరు కర్ణిక. వాటికి ఎదురుగా ఏనుగు, జింక, కుందేలు, ఎలుగు బంటి వంటి జంతువులు.. చిలుక, పావురం, నెమలి వంటి పక్షులు ఉన్నాయి. ‘మీరు ఎన్నయినా చెప్పండి. దానం చేయడంలో మా చిట్టిని మించిన వారు లేరు’ అని పావురాన్ని పొగుడుతూ అంది కాకి.

‘కాదు.. దానం చేయడంలో మీ చిట్టి కన్నా మా చిన్ని గొప్పది’ అంటూ చిలుకకు మద్దతు తెలిపింది పిచ్చుక. అక్కడే ఉన్న ఇతర జంతువులన్నీ పక్షుల వాదనను విచిత్రంగా గమనించసాగాయి. ‘లేదు! మా చిట్టికి సాటి మరెవ్వరూ లేరు’ అంటూ కాకి మళ్లీ పావురాన్ని పొగిడింది. ‘కాదు! మా చిన్నికి పోటీ ఎవ్వరూ రాలేరు.. అది తెలుసుకోండి’ అని పిచ్చుక కూడా గట్టిగానే అంది.

చిట్టి అనే పావురం కాకి, పిచ్చుకల వాదనను వింటోంది. చిన్ని అనే చిలుక మాత్రం అనవసర రాద్ధాంతం ఎందుకంటూ పిచ్చుకను వారించసాగింది. ఆ వాదన సింహం వరకూ వెళ్లింది. ‘ష్‌.. ఎందుకు మీలో మీరే వాదించుకుంటున్నారు?’ పక్షులను చూస్తూ గట్టిగా అడిగింది సింహం.

‘దానం చేయడం గురించి వాదులాడుకుంటున్నారు మృగరాజా..’ అంటూ మొదట్నుంచి అంతా గమనిస్తున్న జింక అంది. అప్పుడు సింహం వాళ్లతో.. ‘మీ అసందర్భ వాదనలు కట్టిపెట్టండి. ఈ సమావేశం జరిపేది మీ వాదనల కోసం కాదు’ అంది. ‘మరెందుకు మృగరాజా?’ అని అమాయకంగా అడిగింది ఏనుగు.

కొన్ని రోజుల క్రితం మంత్రి కర్ణిక.. అడవి నియమాలను అతిక్రమించింది. క్రమశిక్షణ విషయంలో నాకు ఎటువంటి బేధాలు లేవు. రాజు ఆదేశాలను ధిక్కరించినందుకు కర్ణిక ఈ అడవిని వదిలి వెళ్లిపోవాలి’ అంటూ తేల్చేసింది సింహం. ఆ మాటలకు రాజు వైపు దీనంగా చూసింది కర్ణిక.

‘అయిదు రోజులు సమయమిస్తున్నా. ఈలోగా మరో ప్రాంతానికి వెళ్లిపోవాలి. ఈ అయిదు రోజుల్లో కర్ణిక ఎవరితోనూ మాట్లాడకూడదు. తన ఆహారాన్ని తాను సంపాదించుకోకూడదు. కానీ, కర్ణికతో మనం మాట్లాడవచ్చు. ఆరో రోజున అది ఇంకా అడవిలో కనిపిస్తే నాకు ఆహారం కాక తప్పదు. సమావేశం ముగిసింది!’ అని మృగరాజు చెప్పగానే అన్ని జీవులూ వాటి నివాసానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి.

ఈలోగా చిట్టి వచ్చి.. ‘కర్ణికా.. బాధపడకు. ఈ అయిదు రోజులూ నేను నీకు ఆహారం పెడతాను’ అంది. కోతి వచ్చి ‘నేను అయిదు రోజుల్లో మరో చోటు చూస్తా’ అని భరోసా ఇచ్చింది. చిన్ని వచ్చి.. ‘బాధ పడినా కూడా చేసిన తప్పు తప్పే. శిక్ష తప్పదు మరి.. అయినా, ఈ అయిదు రోజులు నీ కడుపు నింపే బాధ్యత నాది కర్ణికా’ అంటూ ఊరడించింది.

సింహం ఆదేశాల ప్రకారం మాట్లాడితే నేరం కాబట్టి.. వాటివైపు కృతజ్ఞతగా చూసింది కర్ణిక. మొదటి రోజు చిట్టి వద్దకు వెళ్లింది కర్ణిక. అది పెట్టిన ఆహారం తింది. రెండో రోజు చిన్ని వద్దకు వెళ్లి.. తృప్తిగా కడుపు నింపుకొంది. అయిదో రోజున కోతి చెప్పిన ప్రదేశానికి బయలుదేరింది. చిట్టి, చిన్నిలు దానికి వీడ్కోలు పలికాయి. ఆరో రోజు మృగరాజు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి అడవి జీవులన్నీ హాజరయ్యాయి. సింహాసనం మీద కూర్చున్న సింహం పక్కన నిల్చున్న కర్ణికను చూసి చిట్టి, చిన్ని, కోతితో సహా జీవులన్నీ ఆశ్చర్యపోయాయి.

అది గమనించిన మృగరాజు.. ‘అడవి నుంచి బహిష్కరించిన కర్ణిక మళ్లీ ఎలా వచ్చిందోనని ఆశ్చర్యపోతున్నారా?’ అడిగింది. అవునన్నట్లు జీవులన్నీ తలూపాయి. ‘మొన్న జరిగిన సమావేశంలో చిట్టి, చిన్నిల వాదన నా వరకూ వచ్చింది. ఎవరిది అసలైన దానగుణమో తెలుసుకోవాలని కర్ణికతో కలిసి నేను ఆడిన నాటకం ఇది. ఈ అయిదు రోజుల్లో చిట్టి, చిన్నిలను దగ్గరుండి గమనించిన మన కర్ణిక సరైన తీర్పు ఇస్తుంది’ అంటూ కుందేలు వైపు చూసింది సింహం.

‘చిత్తం మృగరాజా!’ అంటూ.. ‘చిట్టి, చిన్ని ఇద్దరికీ సాయం చేసే గుణం ఉంది. అయితే చిట్టి చేసేది దానం కాదు. చిన్నికి మాత్రమే దాత అనిపించుకునే అర్హత ఉంది’ అని తేల్చింది కర్ణిక. ‘అదెలా?’ అని చిట్టి, కాకి కలసి కర్ణికను అడిగాయి. ‘చిట్టి.. తాను తినే ఆహారం మిగిలితేనే మిగతా వారికి పెడుతుంది. కానీ, చిన్ని అలా కాదు. అతిథికి తాను తినే ఆహారంలో కొంత భాగం ముందే తీసి పక్కన పెడుతుంది. మిగతాది మాత్రమే తాను తింటుంది. అతిథి కోసం కేటాయించి పెట్టడమే నిజమైన దానం అనిపించుకుంటుంది. చిట్టి, చిన్నితో దానం చేయడంలో పోటీ పడిందే కానీ అందులోని అసలైన పరమార్థాన్ని తెలుసుకోలేదు. ఇప్పటికైనా చిట్టి గ్రహిస్తే మంచిది!’ అని వివరించింది కర్ణిక. ఆ మాటలకు సింహంతో సహా అన్ని జీవులూ చిన్నిని అభినందిస్తూ చప్పట్లు కొట్టాయి. చిన్ని చేసేదే నిజమైన దానమని గ్రహించిన చిట్టి.. చిన్నికి మనసారా అభినందనలు తెలియజేసింది.

కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని