Published : 28 Jan 2023 00:14 IST

నక్కలో మార్పు!

న పిల్ల సుబుద్ధి బయటకు వెళ్లి చాలాసేపయింది. ఇంకా ఇంటికి రాకపోవడంతో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగింది తల్లి నక్క. ఇంతలో అప్పుడే సుబుద్ధి.. ‘అమ్మా..’ అంటూ తన వైపు రావడం గమనించింది. దాన్ని చూడగానే తల్లికి ప్రాణం లేచివచ్చింది. ‘సుబుద్ధీ.. ఇంతసేపూ ఎక్కడున్నావు? నువ్వు రాలేదని కంగారు పడుతున్నాను తెలుసా!’ అంటూ బిడ్డ వైపు ఆప్యాయంగా చూసింది తల్లి నక్క. ‘అమ్మా.. తెలివితేటలకు మన జాతి పెట్టింది పేరనీ, జిత్తులమారి అని మనకు మరో పేరు ఉందనీ, మనపై ఎత్తులు వేసి ఎవరూ గెలవలేరని నువ్వెప్పుడూ అంటుంటావు కదా.. మనం మోసం చేయడమే తప్ప ఎవరి చేతుల్లోనూ మోసపోమని కూడా చెబుతుంటావు.. ఇక బెంగ దేనికమ్మా?’ అంటూ తన తెలివితేటలను ప్రదర్శించింది సుబుద్ధి. ‘సుబుద్ధీ.. తాడిని తన్నే వారుంటే, వారి తలను తన్నేవారుంటారని తెలుసుకో.. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అందుకే జాగ్రత్త అవసరమని చెబుతున్నాను. ఇంతకూ ఎవరింటికి వెళ్లి వస్తున్నావు?’ అడిగింది తల్లి నక్క.

‘మనింటికి కొంచెం దూరంలో కర్ణిక అనే కుందేలు ఇల్లు నీకు తెలుసు కదా..’ తల్లి నక్కను చూస్తూ అడిగింది సుబుద్ధి. ‘తెలియకేం.. ఆ కర్ణిక పిల్ల చిట్టిని చంపింది నేనే కదా!’ అంటూ గొప్పలు పోయింది తల్లి. ‘అవును.. ఆ చిట్టికి బుజ్జి అనే చెల్లి ఉంది. దానికి మాయమాటలు చెప్పి నా దారిలోకి తెచ్చుకోవడానికి స్నేహం చేస్తున్నట్లు నటిస్తున్నాను. బుజ్జి నన్ను నమ్ముతోంది. నా బుట్టలో పడుతోంది.. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది!’ అంది సుబుద్ధి. ఆ మాటలు విన్న తల్లి నక్క.. ‘భలేగా చెప్పావు. జిత్తులమారి అనిపించుకున్నావు. బుజ్జిని ఇక్కడకు తీసుకువస్తే నీ సరదాతోపాటు నా ఆకలి కూడా తీరుతుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా’ అంది. ‘ఈ సుబుద్ధి ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. ఇక ఆ బుజ్జి సంగతి మర్చిపోమ్మా’ అని బిడ్డ భరోసాగా చెప్పడంతో తల్లి నక్క తృప్తి పడింది.

తెల్లవారుతుండగానే తల్లి నక్క అడుగుల చప్పుడు వినబడటంతో చటుక్కున లేచి చూసింది సుబుద్ధి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తల్లిని అనుసరిస్తూ పరుగందుకుంది. తల్లి పక్కకు చేరి ‘అమ్మా.. ఉదయమే ఎక్కడకు బయలుదేరావు.. ఎవరి కోసం?’ అని అడిగింది ఆత్రంగా. ‘బుజ్జి కోసం.. ఈ రోజు ఎలాగైనా బుజ్జిని పట్టుకోవాల్సిందే..’ కసిగా అంది. ‘అంత కంగారెందుకు? నేనే మనింటికి తీసుకువస్తానని చెప్పాను కదా..’ అని ఆశ్చర్యంగా అడిగింది సుబుద్ధి. ‘నిన్న నీ మాటలు విన్నాక, నేను బాగా ఆలోచించాను. మనకి ఓర్పు తక్కువ. ఎక్కువ కాలం నటించలేం. నువ్వు రోజూ బుజ్జి వద్దకు వెళ్తున్నావంటే నిజంగానే స్నేహం చేస్తున్నావనిపిస్తోంది. అందుకే నా దారికి అడ్డురాకు.. తప్పుకో..’ అని గంభీరంగా అంది తల్లి. ఇక మాటలతో లాభం లేదనుకున్న సుబుద్ధి.. తల్లి కంటే వేగంగా పరుగు పెట్టింది. బుజ్జిని తన వీపు మీద ఎక్కించుకుంది. ‘సుబుద్ధీ.. పెద్ద వాళ్లకు, వారి మాటలకు అడ్డురాకూడదు. మర్యాదగా బుజ్జిని నాకు అప్పగించు’ అని గట్టిగా హెచ్చరించింది తల్లి.

పాపం బుజ్జి కుందేలు.. తల్లి నక్క వైపు భయం భయంగా చూడసాగింది. ‘అమ్మా.. నీకు అడ్డురావడం నాకు ఇష్టం లేదు. కానీ, నేను చెప్పే విషయం విన్న తర్వాత నిర్ణయం తీసుకో..’ అంటూ వేడుకుంది సుబుద్ధి. ‘ఏమిటది?’ అని తల్లి నక్క అడిగింది. ‘అమ్మా.. గుర్తుందా? నాకు ఒక అక్క ఉండేది. మేమిద్దరం రోజూ ఎంచక్కా ఆడుకునేవాళ్లం. ఎప్పుడూ ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. కానీ, మృగరాజు ఆటవిడుపుగా వచ్చి.. ఆకలి లేకపోయినా, తన సరదా కోసం అక్కను పొట్టన పెట్టుకుంది.

ఆ రోజు అక్క కోసం నువ్వూ, నేనూ ఎంతగా ఏడ్చామో మర్చిపోయావా?’ అని ఏడుస్తూ అడిగింది పిల్ల. ‘ఆ బాధను ఇప్పుడెందుకు గుర్తు చేయడం? బాధలను మర్చిపోవాలి. ఆనందాలను గుర్తుంచుకోవాలి. అదే జీవితం అంటే..’ అంది తల్లి నక్క. ‘బాధలను మర్చిపోవడం మంచిదే.. కానీ, తెలిసి కూడా అదే బాధను మరో జీవికి కలిగించడం ఏమైనా భావ్యమా?’ అడిగింది పిల్ల.

‘నేనేం చేశాను?’ ప్రశ్నించింది తల్లి. ‘సరదా కోసం మృగరాజు చేసినట్టే నువ్వూ చేశావు. ఆటవిడుపుగా బుజ్జి అక్క చిట్టిని చంపావు. ఆకలి తీర్చుకునేందుకు వేటాడటం ప్రకృతి ధర్మం. కానీ, ఆటవిడుపు కోసం అల్ప జీవులను చంపడం నేరం. చిట్టి పోయిన బెంగతో కర్ణిక కూడా కొంతకాలానికి చనిపోయింది. పాపం బుజ్జి అనాథగా మిగిలింది. చూశావా! నీ ఆటవిడుపు ఆ కుటుంబాన్ని దుఃఖాన పడేసింది. ఆ బాధ బుజ్జి పడకూడడదనే దాంతో స్నేహం చేశాను. ఇప్పుడు చెప్పమ్మా.. నేను చేసింది తప్పా! తప్పైతే బుజ్జిని కూడా వేటాడు. నేను అడ్డురాను!’ అని వాపోయింది సుబుద్ధి. ఆ మాటలు తల్లి నక్కను ఆలోచనలో పడేశాయి. ‘సుబుద్ధీ.. నీ మాటల వల్ల నాలో మార్పు మొదలైంది. ఇకనుంచి ఆటవిడుపుగా వేటాడను. అంతే కాదు ఒంటరైన బుజ్జిని కూడా మనతోపాటే ఉంచుకుందాం. నా పొరపాటును ఆ రకంగా సరిదిద్దుకుంటా.. సరేనా!’ అంటూ సుబుద్ధి వైపు చూసింది తల్లి నక్క. ‘మా మంచి అమ్మ..’ అంటూ ‘బుజ్జీ! ఇకనుంచి నువ్వూ నాతోనే..!’ అని ఆనందంగా అంది సుబుద్ధి. ఆ మాటలతో బుజ్జి కుందేలు సంతోషిస్తూ చప్పట్లు కొట్టింది.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు