Updated : 05 Feb 2023 04:42 IST

నక్క జిత్తులు... చిలుక పలుకులు!

దుష్ట వనంలో నక్కలదే రాజ్యం. విస్తీర్ణంలో అదే అతి పెద్దది. నీటికి ఇబ్బంది ఉండదు. ఆహారానికి కరవు ఉండదు. కానీ ఈ రాజ్యంలో మరే జంతువు వచ్చినా, నక్కల ఎత్తులకు చిత్తు అవ్వాల్సిందే. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అక్కడ కరవు ఏర్పడింది. నక్కలకు ఆహారం దొరకక ఇబ్బంది పడసాగాయి. ఆహారం కోసం వాటి మధ్య పోటీ ఏర్పడింది. ఆ వనంలో జరుగుతున్న విషయాలు పక్కన ఉన్న సౌందర్య వనం వాళ్లకు తెలిశాయి.

దుష్ట వనంలో ఉన్న నక్కలు కచ్చితంగా తమ అడవిలోకి వస్తాయని చిలుక ఊహించింది. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. నక్కలు మన వనంలోకి అక్రమంగా ప్రవేశిస్తాయేమో’ అని చిలుక మిగతా జంతువులతో తన అనుమానాన్ని వెలిబుచ్చింది. కానీ ఏ జంతువు కూడా నమ్మలేదు.

చిలుక పలుకుల్లో నిజాలు ఉండవు అనుకుని, తేలిగ్గా తీసుకున్నాయి. కానీ చిలుక అనుమానించినట్లుగానే నక్కలు తమ తెలివి తేటలు ప్రదర్శించాయి. దుష్ట వనం నుంచి సౌందర్య వనంలోకి ప్రవేశించాయి. కొన్ని నక్కలు ఒక దారిలో గుంపులుగా ఉన్న జింకలను చూసి అరిచేవి. జింకలు భయపడి చెదిరిపోయి తలో దారిలో వేరు వేరుగా వెళ్లేవి. అప్పుడు నక్కలు వేటాడి జింకలను చంపేసేవి.

ఇలా ఒక దారిలో అరవడం మరో దారిలో జింకల్ని చంపడం చేసేవి. ఈ విధంగా నక్కలు తమ తెలివితేటలతో ఆహారం సంపాదించేవి. దీంతో ఆ సౌందర్య వనం ఉక్కిరి బిక్కిరైంది. జింకల సంఖ్య క్రమంగా తగ్గిపోసాగింది.

ఇక లాభం లేదని జంతువులన్నీ సమావేశమయ్యాయి. ‘చిలుక చెప్పింది నిజమే. మనమే అది కేవలం బడాయి కోసం చెప్పినట్లు భావించాం. ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నాం’ అంటూ హుటాహుటిన చిలుక దగ్గరకి చేరాయి. ‘చిలుక మాట లెక్క చేయలేదు. మాకూ శిక్ష పడింది’ అంటూ రోదించింది నెమలి.

నక్క తెలివి మాకు అస్సలు అర్థం కావడం లేదంటూ ఏడిచింది జింక. ‘మా భయాన్ని పోగొట్టి, ఆ నక్కల నుంచి విముక్తి ప్రసాదించండి’ అంటూ మొర పెట్టుకున్నాయి... మిగతా పక్షులు, జంతువులు. ‘నా ప్రియమైన నేస్తాలూ! ఆందోళన వద్దు నేనున్నాను కదా జరిగిందేదో జరిగింది. ఆ జిత్తులమారి నక్కలకు మన తెలివేంటో చూపిద్దాం’ అంటూ జంతువులన్నింటినీ సింహాల దగ్గరికి తీసుకు వెళ్లింది.

అసలే భయంగా ఉన్న ఈ జంతువులు మరింతగా భయపడ్డాయి. ‘‘మృగరాజా! నక్కల ఆటలో మేం ఓడిపోతున్నాం. మీరు మాత్రమే గెలవగలరు. నక్కలు ‘మమ్మల్ని ఓడించే జంతువులే లేవు..’ అని అన్ని జంతువులతో చెబుతున్నాయి. ‘సింహాలు దిగనంత వరకే మీ ఆటలు’ అని మేం గొప్పగా చెప్పుకొన్నాం. ‘సింహాలను కూడా ఓడించి ఈ వనాన్ని కూడా గెలుస్తాం’ అంటూ అవి అహంకారంగా మాట్లాడుతున్నాయి. అవి ఇలాగే మరి కొన్ని రోజులు అరాచకాలు కొనసాగిస్తే మీకు ఆహారం దొరకడమే కష్టం కావొచ్చు’ అంటూ చిలుక సింహాలతో చెప్పింది.

సింహాలకు కోపం వచ్చింది. అవన్నీ ఒక్కసారిగా గర్జించి, నక్కల పని పట్టడానికి నిశ్చయించుకున్నాయి. ఎప్పటిలానే నక్కలు అరవడం మొదలు పెట్టాయి. సింహాలన్నీ ఒక్కసారిగా అవి అరిచిన ప్రదేశానికి వెళ్లాయి. నక్కలను తరిమి తరిమి కొట్టాయి. నక్కలు మరో ప్రదేశంలో అరిచాయి. అక్కడ కూడా సింహాలు తమ పంజా రుచి చూపించాయి. సింహాల దెబ్బకు నక్కలు తోక ముడిచాయి. జంతువులకు నక్కల బాధలు తప్పాయి.
నల్లపాటి సురేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు