కోతి సమయస్ఫూర్తి!

వృక్షనిధి అనే అడవికి ఏనుగు రాజుగా ఉండేది. ఆ వనంలో కేతనం అనే కోతి ఉండేది. అది ఏ పనైనా.. చాలా ఏకాగ్రతతో చేసేది. ఒకరోజు కోతులు ఉన్న చెట్ల వైపు గజరాజు విహారానికి వచ్చింది.

Published : 05 Mar 2023 00:02 IST

వృక్షనిధి అనే అడవికి ఏనుగు రాజుగా ఉండేది. ఆ వనంలో కేతనం అనే కోతి ఉండేది. అది ఏ పనైనా.. చాలా ఏకాగ్రతతో చేసేది. ఒకరోజు కోతులు ఉన్న చెట్ల వైపు గజరాజు విహారానికి వచ్చింది. రాజును చూసి కోతులు దగ్గరకు వచ్చి నమస్కరించాయి. ఒక పండును తన్మయత్వంతో తింటున్న కేతనం.. గజరాజు రాకను గమనించలేదు. కేతనం తనను పట్టించుకోని విషయాన్ని ఏనుగు గమనించింది. కోపంతో తన స్థావరానికి వెళ్లిపోయింది. అది గమనించిన ఒక కోతి.. కేతనంతో విషయం చెప్పి ‘గజరాజు నీకు ఏ శిక్ష విధిస్తుందో?’ అంది. అనుకున్నంతా అయ్యింది.. కాసేపటి తర్వాత.. ఎలుగుబంటి, కేతనం వద్దకు వచ్చి గజరాజు రమ్మంటోందనే కబురు చెప్పి వెళ్లిపోయింది.

కోతి పండ్లబుట్టతో గజరాజు వద్దకు వెళ్లింది. ‘రాజుపై గౌరవమర్యాదలు లేని నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. అంత లెక్కలేనితనం ఎందుకు?’ అని ఘీంకరించింది. ‘మహారాజా.. మీకోసం తియ్యటివి తీసుకురావాలని, రెండు చెట్ల నుంచి రెండు పండ్లు తెంపాను. వాటిలో ఏ చెట్టు పండు తియ్యగా ఉందో చూడాలని అనుకున్నాను. ఆ క్రమంలో మనసుపెట్టి ఏకాగ్రతతో పండును రుచి చూస్తున్న సమయంలో మీరు అటుగా వచ్చినట్లున్నారు. అది నేను గమనించలేకపోయాను’ అని చెప్పి వెంట తెచ్చిన పండ్లబుట్టను గజరాజు ముందు ఉంచింది కేతనం. తన కోసం పరీక్షించి మరీ తియ్యటి పండ్లను తీసుకొచ్చినందుకు సంతోషించింది ఏనుగు. తన మీద కేతనానికి ఉన్న అభిమానానికి పొంగిపోయింది.

ఒకసారి కేతనం కొలనులో నీళ్లు తాగుతుండగా.. ఏనుగు దాహం తీర్చుకోవడానికి వచ్చింది. గజరాజు రాకతో నీళ్లు తాగుతున్న జంతువులు గౌరవంగా దూరం జరిగాయి. కానీ, కేతనం మాత్రం గజరాజును గమనించకపోవడంతో నీళ్లు తాగుతూ అలాగే ఉండిపోయింది. ఏనుగు స్థావరానికి వెళ్లిపోయాక.. కేతనాన్ని తనవద్దకు తీసుకురమ్మని కుందేలును ఆదేశించింది. విషయం తెలుసుకున్న కేతనానికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను అడవి పక్కనే ఉన్న పల్లె నుంచి తెచ్చుకున్న కొబ్బరి ముక్కలను తీసుకొని గజరాజు వద్దకు వెళ్లింది. ఏనుగు కోపంగా.. ‘నీకు నేనంటే భయభక్తులు లేవు. నా రాకను గమనించి.. నీళ్లు తాగుతున్న జంతువులన్నీ దూరంగా జరిగాయి. నువ్వు మాత్రం నన్ను పట్టించుకోలేదు. కళ్లు నెత్తికెక్కాయా?’ అని ఆగ్రహించింది.

కేతనం వినయంగా.. ‘మహారాజా! మీకివ్వడానికి నేను పల్లె నుంచి కొబ్బరి ముక్కలను తెచ్చాను. నా మనసు పట్టుతప్పి, వాటిని ఎక్కడ తినేస్తానోనని.. కడుపు నిండుగా నీళ్లు తాగుతున్నాను. సరిగ్గా ఆ సమయంలో మీరు కొలను వద్దకు వచ్చారు. మనసంతా కడుపు నింపుకోవడంపైన ఉండటంతో మిమ్మల్ని గమనించలేకపోయాను. క్షమించండి’ అని తన చేతిలోని చిప్పలను ఏనుగుకిచ్చింది. తన కోసం కొబ్బరిని తినకుండా.. నీళ్లతో కడుపు నింపుకొన్న కోతి అభిమానానికి గజరాజు ఉక్కిరిబిక్కిరైంది. ఏమీ మాట్లాడకుండా కేతనాన్ని పంపించేసింది ఏనుగు. ఒకసారి కోతులు రకరకాల విన్యాసాలతో ఆడుకుంటుండగా గజరాజు విహారానికి అటుగా వచ్చింది. రాజు రాకను గమనించి, కోతులు ఎక్కడివక్కడే గౌరవంగా నిలబడిపోయాయి. కేతనం మాత్రం గజరాజును చూసుకోకుండా.. రకరకాల విన్యాసాలు చేస్తోంది. అది చూసి ఏనుగు కోపంతో ఘీంకరించింది. వెంటనే కేతనం ఎగరడం ఆపి రాజు దగ్గరకు వచ్చి.. ‘మహారాజా.. క్షమించండి.. రాబోయే మీ పుట్టినరోజు వేడుకల్లో ప్రదర్శించడానికి నాట్యం అభ్యాసం చేస్తూ మీ రాకను గమనించలేదు’ అని వివరణ ఇచ్చుకుంది. గజరాజు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది.\

‘సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే.. జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు’ అంటూ మిగతా కోతులన్నీ కేతనం తెలివితేటలను మెచ్చుకున్నాయి. ‘మనకు అడవిలో ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం. అందుకే, మనం ఏ పని చేస్తున్నా పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని సలహా ఇచ్చాయి పెద్దకోతులు.

డి.కె.చదువులబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు