ఏనుగు సాయం... మారిన వానరం!

ఒక అడవిలో ఓ ఏనుగు, కోతి స్నేహంగా ఉండేవి. ఆ వనంలోని జంతువులన్నీ ఏనుగును గౌరవించేవి. ఏనుగు నడుచుకుంటూ వస్తుంటే, పక్కకు జరిగి నమస్కరించి దారి ఇస్తుండేవి.

Updated : 07 Mar 2023 00:33 IST

క అడవిలో ఓ ఏనుగు, కోతి స్నేహంగా ఉండేవి. ఆ వనంలోని జంతువులన్నీ ఏనుగును గౌరవించేవి. ఏనుగు నడుచుకుంటూ వస్తుంటే, పక్కకు జరిగి నమస్కరించి దారి ఇస్తుండేవి. ఏనుగు కూడా అన్ని జంతువులు, పక్షులను పలకరిస్తూ ఉండేది. మృగరాజు సింహం కూడా ఏనుగును పలుమార్లు తన గుహకు పిలిపించుకొని, సలహాలు తీసుకునేది. కానీ, కోతికి మాత్రం తోటి జీవులు ఎన్నడూ విలువ ఇచ్చేవి కావు.

‘మిత్రమా! నిన్ను అన్ని జంతువులు ఎందుకు గౌరవిస్తున్నాయో నాకు అర్థమైంది. నువ్వు చాలా ఎత్తుగా, బలంగా ఉంటావు. నేను భూమికి మూరెడు ఉంటాను. అందుకే ఎవరూ నాకు విలువ ఇవ్వడం లేదు’ అని అంది కోతి. ఏనుగు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇకపై ఎప్పుడూ ఏనుగు పక్కన నడుచుకుంటూ పోవద్దని కోతి అనుకుంది.

ఎప్పుడైనా రెండూ కలిసి వెళ్లాల్సి వస్తే.. కోతి, భూమి మీద నడిచేది కాదు. ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ, కొమ్మలను విరగ్గొడుతూ, ఎగురుకుంటూ వెళ్లేది. ఎత్తు మీద ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారనుకొని ఇలా చేస్తుండేది. ఒకరోజు కోతి, ఏనుగు ఆహారం కోసం వెళ్లాయి. అయితే కోతి మాత్రం కొమ్మల మీదే నడుస్తూ వెళుతోంది.

దారిలో వాటికి ఒక నక్క గాయపడి కనిపించింది. దాని చుట్టూ జంతువులు మూగి ఉన్నాయి. ఎవరో వేటగాడి చేతిలో అది గాయపడింది. ‘మిత్రమా! నక్కకు ఏదో గాయం అయినట్లు ఉంది. మనం వెళ్లి చూద్దాం!’ అంది ఏనుగు. ‘అడవిలో ఎన్నో జంతువులు గాయపడుతూ ఉంటాయి. అన్నింటిని చూసుకుంటూ పోతే, ఇక మన పని మనం చేసుకున్నట్లే!’ అంది కోతి. కానీ ఏనుగు.. నక్క దగ్గరకు వెళ్లి, గాయాన్ని పరీక్షగా చూసింది.

పక్కనే పొదల్లోకి వెళ్లి ఆకులు కోసుకొచ్చి, ఆ పసరుతో వైద్యం చేసి కట్టుకట్టింది. నక్కకు కొంత ఉపశమనం కలిగింది. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి ముందుకు కదిలింది.

అలా నడుస్తూ, నడుస్తూ ఉండగా దారిలో ఏనుగు, కోతికి ఒకచోట అడవి తగలబడుతూ కనిపించింది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న చెరువులోని నీళ్లను తొండంతో తీసుకొచ్చి ఆ మంటల్ని ఆర్పింది. కోతి మాత్రం ఈ వింత చూస్తూ కూర్చుంది. అవి రెండూ అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తుండగా.. దారిలో వాటికి ఓ ఎలుగుబంటి కనిపించింది. ఎండదెబ్బ తగిలి అది నీరసంగా ఓ చెట్టు కింద కూర్చొని ఉంది. ఏనుగు వెంటనే దగ్గర్లో ఉన్న చెరకు తోటకు వెళ్లి కొన్ని గడలు తెచ్చింది. వాటి నుంచి రసాన్ని తీసి, ఒక డొప్పలో పోసి ఎలుగుబంటికి అందించింది. చెరకు రసం తాగిన ఎలుగుబంటి కాసేపటి తర్వాత కోలుకుంది.

అనంతరం అక్కడ నుంచి ఏనుగు, కోతి నడుస్తూ.. నడుస్తూ ఉండగా దారిలో మృగరాజు వస్తున్నట్లుగా తెలిసింది. అవి రెండూ మర్రిచెట్టు వద్ద పక్కకు నిలుచున్నాయి. మృగరాజు మర్రిచెట్టు వద్దకు చేరగానే ఏనుగు, కోతి దానికి నమస్కరించాయి. ఏనుగును పలకరించింది మృగరాజు.


‘మిత్రమా! ఎలా ఉన్నావు? నీ విషయాలు మాకు తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు తోటి జీవులపై చూపుతున్న ప్రేమ, దయ, జాలి, కరుణ చాలా గొప్పవి. ఇతర జీవులకు నువ్వు చేస్తున్న సహాయం ఎంతో విలువైంది. వీలు చూసుకుని అప్పుడప్పుడూ నా గుహకు వస్తూ ఉండు’ అంటూ అభినందించింది. అప్పుడు కోతి... ‘విలువ, గౌరవం అనేది ఎత్తును బట్టి కాదు.. ఆకారాన్ని బట్టి కాదు.. మనం చేసే పనులు, ప్రతిభను బట్టి లభిస్తుంది. మిగతావేవీ లెక్కలోకి రావు’ అని గ్రహించింది. అప్పటి నుంచి తనకు చేతనైన సహాయాన్ని ఇతరులకు చేయటం నేర్చుకుంది కోతి. కొద్దిరోజుల్లోనే వానరం కూడా ఏనుగులా మంచిపేరు తెచ్చుకుంది. కోతిలో వచ్చిన మార్పు చూసి జంతువులన్నీ సంతోషించాయి.

పైడిమర్రి రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని