పూటకూళ్లమ్మ నోటి లెక్క!

పార్వతీపురం శివారు ప్రాంతంలో ఓ పూటకూళ్లమ్మ ఉండేది. అటుగా పోయే బాటసారులకు తిండి, వసతి కల్పిస్తూ.. వారి నుంచి కొంత డబ్బు తీసుకొనేది.

Published : 08 Mar 2023 00:34 IST

పార్వతీపురం శివారు ప్రాంతంలో ఓ పూటకూళ్లమ్మ ఉండేది. అటుగా పోయే బాటసారులకు తిండి, వసతి కల్పిస్తూ.. వారి నుంచి కొంత డబ్బు తీసుకొనేది. వారితోపాటు వచ్చే గుర్రాల కోసం గడ్డి మోపులనూ అందుబాటులో ఉంచేది. అలా వచ్చే ఆదాయంతో తాను బతుకుతూ, నలుగురు పనివాళ్లకు కూడా ఉపాధి కల్పిస్తుండేది. పూటకూళ్లమ్మ పెద్దగా చదువుకోకపోయినా, నోటి లెక్కలు వేయడంలో మంచి నేర్పరి. ‘అంత బాగా ఎలా లెక్కిచగలవు?’ అని ఎంతమంది అడిగినా, నవ్వి ఊరుకునేది. ఒకసారి పొరుగు దేశపు బాటసారి గుర్రం మీద వచ్చి పూటకూళ్లమ్మ ఇంటి దగ్గర ఆగాడు. ఆమెను కలిసి.. ‘నేను, నా మిత్రులు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాం. ప్రస్తుతానికి నేనొక్కడినే ఇక్కడికి వచ్చా. మిగిలిన మిత్రులంతా వేర్వేరు పనుల నిమిత్తం వెళ్లారు. సాయంత్రం మేమంతా ఇక్కడకు వచ్చి బస చేస్తాం. మాతో పాటు కొన్ని గుర్రాలు కూడా ఉన్నాయి. మాకు భోజన వసతులతోపాటు గుర్రాలకు గడ్డి ఏర్పాటు చేయాలి. ఒక్కొక్కరికి ఎంత ఖర్చవుతుందో చెబితే, ఆ డబ్బు చెల్లిస్తాను’ అన్నాడతను.

‘ముందు మీరెంత మంది వచ్చారో చెప్పండి’ అని అడిగింది పూటకూళ్లమ్మ. ‘అదంతా కాదు కానీ, ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటావో ముందు చెప్పు’ అని అడిగాడతను. ‘వచ్చినవారి సంఖ్య తెలిశాకే ఇక్కడ ఏర్పాట్లు చేయగలను’ అని సూటిగా జవాబిచ్చిందామె. ‘ప్రశ్నకు సమాధానం చెప్పడం మంచివాళ్ల లక్షణం. ఇక్కడివారంతా మంచివాళ్లనుకున్నాను. నీలాంటి మొండి వాళ్లు కూడా ఉన్నారన్నమాట’ అంటూ చులకనగా మాట్లాడాడు బాటసారి. ‘మీరు ఈ దేశం వాళ్లు కాదు. ఈరోజుకు ఇక్కడ తలదాచుకోడానికి అవకాశం ఇచ్చినందుకు, రేపు జరగరానిదేదైనా జరిగితే రాజుగారికి సమాధానమిచ్చుకొనే పరిస్థితిలో నేనుండాలి కదా’ అని అసలు విషయం చెప్పిందామె. ‘రాజుగారి అనుమతితోనే ఏ వ్యాపారైనా మీ దేశంలో అడుగుపెడతాడు. నేను కూడా అంతే..!’ అని తేల్చిచెప్పాడా బాటసారి. ‘విదేశీయులతో వ్యాపార సంబంధాలు నెరపడం రాజధర్మం. ఆశ్రయం కోసం వచ్చిన వారిని నిశిత పరిశీలన చేయడం పౌర ధర్మం.. ఇప్పుడు నేను చేసేది అదే..’ అని బాధ్యతతో చెప్పిందామె.

‘బాగా తెలివిగా మాట్లాడుతున్నావు. నీకు మా సంఖ్య కావాలి కదా.. మా బృందంలో కొంత మంది మనుషులు, కొన్ని గుర్రాలు ఉన్నాయి. ఇద్దరు మనుషుల చొప్పున ఒక్కో గుర్రంపైన కూర్చుంటే, ఒక గుర్రం మిగిలిపోతుంది. అదే ఒక్కో మనిషి ఒక్కో గుర్రంపైన కూర్చుంటే ఒక మనిషి మిగిలిపోతాడు’ అని చెప్పాడు. ‘ఓహో అలాగా..!’ అంది నవ్వుతూ.. ‘ఇప్పుడు మా ఖర్చు సంగతి చెప్పు?’ అని అడిగాడు బాటసారి. ‘ముగ్గురు మనుషులు, రెండు గుర్రాలైతే నలభై వరహాలు తీసుకుంటాను. అదే.. ఇద్దరు మనుషులు, నాలుగు గుర్రాలైనా నలభై వరహాలే తీసుకుంటాను. ఆ లెక్కన చెల్లించండి’ అంది పూటకూళ్లమ్మ. ‘నేను వర్తకుడినని ఆటపట్టిస్తున్నావా.. లేకపోతే నా తెలివితేటలను పరీక్షిస్తున్నావా?’ అంటూ కాస్త కోపంగా అడిగాడా బాటసారి. ‘మిమ్మల్ని పరీక్షించే సామర్థ్యం నాకు లేదు. మీరు నడిచిన దారిలోనే నేను నడిచాను’ అంటూ వినయంగా సమాధానమిచ్చిందామె. ‘ఘటికురాలివే’ అంటూ నవ్వేశాడతను.
పూటకూళ్లమ్మ కూడా నవ్వి తన ఏర్పాట్లలో మునిగిపోయింది. ఇంతలో పొద్దుపోయింది. నాలుగు కంచాల్లో ఆహార పదార్థాలను సిద్ధం చేసి ఉంచింది. వాకిట్లో మూడు గడ్డి మోపులను కూడా పెట్టించింది. తన మిత్రులతో కలిసి వచ్చిన బాటసారి.. ఆ ఏర్పాట్లు చూసి.. ‘భేష్‌ వంటలమ్మా.. నీ తెలివితేటలు అద్భుతం’ అంటూ ప్రశంసించాడు. ‘అంతా మీ అభిమానం’ అంది పూటకూళ్లమ్మ. ‘చదువుకోకపోయినా, నీ నోటి లెక్కల ప్రతిభ నచ్చింది. అందుకు తగ్గట్టుగా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు అడిగిన డబ్బుకు ఆరు రెట్లు ఎక్కువే ఇస్తున్నాను’ అంటూ 330 వరహాలు అందించాడు. ‘అంటే.. ఒక భోజనం ఖరీదు పది వరహాలు, గడ్డి మోపు ఖరీదు అయిదు వరహాలన్నమాట’ అన్నాడు భోజనం చేస్తున్న వారిలో ఒక వ్యక్తి. ఎక్కువ ఇచ్చిన వరహాలను వద్దని, వారికే తిరిగి ఇచ్చేసిందామె. ‘నీ లెక్కల మాదిరే భోజనాలు కూడా బాగున్నాయి’ అంటూ లొట్టలేసుకుంటూ తిన్నారా నలుగురు.
బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని