సింహం.. గ్రామసింహం!

అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. దానిలో ధైర్యం, ముందుచూపు, సంయమనం, సమయస్ఫూర్తి అధికం. మృగరాజు పాలనలో జీవులకు స్వేచ్ఛ ఉండటంతో అడవిలోని ప్రాణులన్నీ ప్రశాంతంగా జీవిస్తున్నాయి.

Published : 12 Mar 2023 00:49 IST

నగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. దానిలో ధైర్యం, ముందుచూపు, సంయమనం, సమయస్ఫూర్తి అధికం. మృగరాజు పాలనలో జీవులకు స్వేచ్ఛ ఉండటంతో అడవిలోని ప్రాణులన్నీ ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఆ వనంలో అనేక జంతువులతోపాటు కుక్కలూ ఉన్నాయి. ఒకసారి వాటి దగ్గరకు నగరం నుంచి ఒక కుక్క చుట్టపు చూపుగా వచ్చింది. దానికి గొప్పలు పోవడం, లేనిపోని ఆశలు కల్పించడం, ఎదుటి వారిని పొగడ్తల్లో ముంచెత్తడం అలవాటు. అది అడవి జంతువుల వద్ద తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంది. అందుకోసం ఒకరోజు ఆ కుక్కలన్నింటినీ సమావేశపరిచింది.

వాటిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మిత్రులారా! ఈ అడవికి మీలో రాజు ఎవరు?’ అని అడిగింది. అడవికి రాజు సింహమే అని తెలిసినా.. కావాలనే అలా అడిగిందది. ఆ ప్రశ్నకు మిగిలిన కుక్కలు ‘సింహం’ అని జవాబిచ్చాయి. అప్పుడా పట్నం కుక్క ‘ఈ అడవిలో చాలా సింహాలు ఉన్నాయా?’ అని అడిగింది. ‘అదేం కాదు.. ఉన్నదే ఒక్కటి.. అదే మృగరాజు’ అని జవాబిచ్చాయి. ఆ మాటకు మరింత ఆశ్చర్యంగా ముఖం పెట్టి ‘అదేంటి? మనం ఇంత మంది ఉన్నాం కదా. ఆ సంఖ్యకు తగినట్టు మనలో నుంచి కూడా ఒకరు రాజుగా ఉండాలి కదా.. అలా కాకుండా ఒక్కటే ఉన్న సింహం రాజు కావడమా?’ అని కాస్త రెచ్చగొట్టే ధోరణిలో ప్రశ్నించింది.

ఆ మాటలు మిగిలిన కుక్కలను ఆలోచనలో పడేశాయి. అవి వాస్తవాన్ని ఆలోచించే అవకాశం ఇవ్వకుండా మరో చురకలాంటి మాటగా.. ‘జనావాసాల్లో మనజాతికి మరో పేరు ఉంది.. అదేంటో తెలుసా?’ అని అడిగింది. ‘తెలియదు’ అన్నట్లు ముఖాలు పెట్టాయా కుక్కలు. వాటిని అర్థం చేసుకున్న పట్నం కుక్క.. ‘‘మనల్ని ‘గ్రామ సింహాలు’ అంటారు. ఎందుకంటే గ్రామాల్లోని జీవుల్లో మన సంఖ్యే ఎక్కువ ఉంటుంది కాబట్టి..’’ అంటూ ఉన్నవి, లేనివి కల్పించి చెప్పింది. వాటి మనసుల్లో తామే అందరికంటే గొప్పవాళ్లమనే భావాన్ని కలిగించి రెచ్చగొట్టింది. దాని మాటల ప్రభావం చివరికి ఎంతవరకూ వెళ్లిందంటే.. ‘సింహం కంటే తాము ఏ విషయంలోనూ తక్కువ కాదు.. కాబట్టి దాన్ని రాజ పదవి నుంచి తప్పించి.. తమలో ఒకరు రాజు కావాలి’ అని దృఢంగా నిశ్చయించుకునే వరకు వెళ్లింది. అదే ఆవేశంతో.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మృగరాజు దగ్గరకు వెళ్లాయవి.

‘ఓ సింహమా! నిన్ను ఈరోజు నుంచి ఈ అడవికి రాజుగా మేం అంగీకరించం. నువ్వు నీ పదవి నుంచి తప్పుకొని, ఇకపై మేం చెప్పినట్టే నడుచుకోవాలి. మాకు ఎదురుచెబితే మేమందరం కలిసి నిన్ను రక్కి, కరచి చంపేస్తాం’ అని బెదిరించాయి. ఆ మాటలకు సింహం ముందు ఆశ్చర్యపోయింది. ‘నన్ను చూస్తేనే పారిపోయే ఈ కుక్కలు.. ఈ రోజు నా ఎదురుగా నిలబడి ఇలా మాట్లాడుతున్నాయి’ అనుకుంది. కానీ అంతలోనే మరో వైపు నుంచి ఆలోచిస్తూ ‘అయినా.. ఈ అల్ప ప్రాణులను భయపెట్టినా, చంపినా అడవికి రాజుగా నాకే అవమానం’ అనుకొని గంభీరంగా కదలకుండా అలాగే నిల్చుండిపోయింది. సింహం కిక్కురుమనకపోవడంతో అది తమ మాటలకు భయపడిందని కుక్కలన్నీ మురిసిపోసాగాయి.

తరువాత అవన్నీ కలసి ఒక చెట్టు కింద చేరాయి. అడవికి ఒక శునక రాజును ఎన్నుకోవాలని తీర్మానించాయి. ఇదంతా సింహం గమనిస్తూనే ఉన్నా.. వాటి ఆనందానికి అడ్డు తగలడం ఎందుకనుకొని ఆ సంభాషణను వినసాగింది. ఇంతలో ఒక కుక్క లేచి ‘నేను రాజుగా ఉంటాను. మీరందరూ నన్ను ఎన్నుకోండి’ అంది. దాన్ని వారిస్తూ.. మరోటి నిలబడి తననే ఎన్నుకోవాలంది. అలా నేనంటే నేనంటూ ప్రతి కుక్కా పోటీపడసాగాయి. అది శ్రుతిమించి.. కొట్టుకోవడం వరకూ వెళ్లింది. దాంతో చాలా కుక్కలు గాయపడగా.. మరికొన్ని తోక ముడిచి తలో దిక్కుకు పారిపోయాయి. అల్పబుద్ధి గల కుక్కలను చూసి, సింహం నవ్వుకుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న పట్నం కుక్క అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.

ఆదిత్య కార్తికేయ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని