కూనలుగా వచ్చాయి... వేట నేర్చాయి!

నల్లమల అడవి పేరెత్తగానే గుబురు చెట్లు, క్రూరమృగాలు గుర్తుకొస్తాయి. ఆ అడవిలో ఒక ఆడపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ కూనలను దగ్గరకు తీసుకొని కడుపారా పాలు ఇవ్వసాగింది తల్లి.

Published : 14 Mar 2023 01:24 IST

ల్లమల అడవి పేరెత్తగానే గుబురు చెట్లు, క్రూరమృగాలు గుర్తుకొస్తాయి. ఆ అడవిలో ఒక ఆడపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ కూనలను దగ్గరకు తీసుకొని కడుపారా పాలు ఇవ్వసాగింది తల్లి. మధ్యమధ్యలో వాటి శరీరాన్ని నాలుకతో తడుముతూ.. అమ్మ ప్రేమను చూపించింది. ఆ కూనలు నిలబడలేక... నడిచేందుకు తడబడుతున్నాయి. అది గమనించిన తల్లి పులి.. పిల్లలను నోటితో పట్టుకొని దగ్గరకు తీసుకుంది. అలా రెండు రోజులు గడిచాయి. ఇంతలో తల్లి పులి శక్తిని కూడదీసుకుంది. పిల్లలు కూడా కళ్లు తెరవటంతో తల్లిని గుర్తించాయి. మధ్యమధ్యలో తల్లి తోకతో ఆడుకోసాగాయి. పిల్లల అల్లరి చూస్తూ తల్లి ఎంతో ఆనందపడింది. ఒకరోజు తల్లి పులి, ఆహారం కోసం వేటకు వెళ్లాలనుకుంది. పిల్లలను దగ్గరకు పిలిచి.. ‘మీ కోసం లేత మాంసం తీసుకొస్తాను. నేను వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడకూ వెళ్లొద్దు. ఇతర జంతువులు కనబడితే పొదల మాటున దాక్కోండి. ఎవరి మాటలనూ గుడ్డిగా నమ్మకండి. నేను తిరిగి వచ్చే వరకు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లకండి’ అని జాగ్రత్తలు చెప్పింది.

దానికి పులి కూనలు తల్లితో.. ‘మేమూ నీతో వస్తాం.. అడవిని చూస్తాం.. నువ్వు జంతువులను ఎలా వేటాడతావో ప్రత్యక్షంగా చూస్తాం’ అన్నాయి. దానికి తల్లి పులి.. ‘అడవి చాలా ప్రమాదకరమైంది. అందులోనూ మీరు రోజుల కూనలు. మిమ్మల్ని తీసుకొని వేటకు వెళ్తే.. ఇంకేమన్నా ఉందా! మీరు కాస్త పెద్దయ్యాక కచ్చితంగా తీసుకెళ్లి నేర్పిస్తాను.. అంతవరకూ నా మాట వినండి’ అంది. అయిష్టంగానే అంగీకరించాయా పులి కూనలు. పిల్లలకు కడుపారా పాలిచ్చి.. మరోసారి జాగ్రత్తలు చెప్పి తల్లి పులి వేటకు బయలుదేరింది. అది అలా వెళ్లగానే పులి కూనలు ఒక చెట్టు కిందకు చేరాయి. అందులో ఒకటి చెట్టు పైకి ఎక్కటానికి విశ్వప్రయత్నం చేయసాగింది. దాన్ని చూసి మరొకటి.. అలా నాలుగూ చెట్టు ఎక్కాలని ప్రయత్నించటం.. జారి కిందకు రావడం జరిగింది.

పులి కూనలకు తల్లి చెప్పినట్లు ఒకే చోట ఉండటం నచ్చలేదు. అడవిని చూడాలని... చెట్ల మధ్యలో సరదాగా తిరగాలనుకున్నాయి. తల్లి తిరిగి వచ్చేవరకూ ఏమీ తెలియనట్లు మళ్లీ అక్కడికి చేరుకోవాలనేది వాటి పథకం.

అనుకున్నట్లుగానే నాలుగు పులి కూనలూ అడవిలోకి వెళ్లాయి. మొదటిసారి కావడంతో అంతా కొత్తగా ఉంది.. అలా చాలాదూరం వెళ్లిపోయాయి. చివరకు వెనక్కి పోదామని అనుకున్నాయి. కానీ, వాటికి వచ్చిన దారి గుర్తులేదు. ఏం చేయాలో తోచలేదు. దాంతో భయం మొదలై.. ఆ నాలుగూ ఒక దగ్గరకు చేరుకున్నాయి. దూరంగా కుక్కల అరుపులు వినపడ్డాయి. ఇంతలో పశువుల కాపరి వాటిని చూసి.. ‘మన ఊళ్లోకి పులి కూనలు వచ్చాయి’ అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు ఊరంతా వినిపించడంతో, వాటిని చూడటానికి గ్రామస్థులందరూ తరలివచ్చారు. అంతమందిని చూడగానే పులి కూనలు భయంతో మరో మూలకు చేరాయి. వాటిని చూసి.. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడసాగారు. ఈ తతంగం చూస్తున్న వారిలో ఒకరు విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇంతలో కొందరు ఊరి పిల్లలు పులి కూనలతో ఫొటోలు దిగటం, పాలు పట్టటం, వాటితో సరదాగా ఆడుకోవటం చేయసాగారు.

అధికారులు రాగానే.. ఆ కూనలను స్వాధీనం చేసుకున్నారు. అవి ఆకలితో ఉన్నాయని గుర్తించి.. తమవెంట తీసుకొచ్చిన మాంసం ముక్కలను నోటికి అందించారు. ఇప్పుడా కూనలను తల్లి వద్దకు ఎలా చేర్చాలో వారికి అర్థం కాలేదు. ఇంతలో ఒక అధికారి.. ‘అడవిలో వదిలేద్దాం.. వాటి తల్లి గుర్తించి తీసుకుపోతుంది’ అన్నారు. మరో అధికారి.. ‘అడవిలో వదిలేస్తే ఇతర జంతువులు చంపేసే ప్రమాదం ఉంది’ అన్నారు. అడవిలో పులి ఎక్కడ తిరుగుతుందో గుర్తించి.. ఆ ప్రాంతంలో వదిలేద్దామన్నారు ఇంకో అధికారి. మిగతా వారంతా దానికి అంగీకరించారు. అడవిలో అక్కడక్కడా కొన్ని చెట్లకు సీసీ కెమెరాలను అమర్చారు. రెండు రోజులు గడిచినా.. తల్లి పులి సమాచారం లభించలేదు.

తల్లి పులి జాడ తెలిసే వరకూ.. కూనలను జూ పార్కులో ఉంచాలని అధికారులు అనుకున్నారు. దాంతో పాటు వాటికి వేట కూడా నేర్పించాలని నిర్ణయించారు. నాలుగు కూనలకు వేటలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వారు చిన్న చిన్న జంతువులను తీసుకొచ్చి, పులి కూనల ముందు ఉంచారు. అవి మెల్లమెల్లగా వాటిని వేటాడటం ప్రారంభించాయి. అలా కొద్దిరోజుల్లోనే అవి మెరుగ్గా వేటాడసాగాయి. ఈలోగా అవి కాస్త పెద్దవయ్యాయి. ఇక వాటిని అడవిలో వదిలితే ఎలాంటి ప్రమాదం ఉండదని అటవీ అధికారులు భావించారు. వాటిని బోనులో ఉంచి, వాహనంలో అడవికి తరలించారు. పులుల నివాసానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించి.. బోను తలుపులు తెరిచారు. అవి ఒక్క ఉదుటున అడవిలోకి పరుగులు తీశాయి. నాలుగు జీవాలకు వేట నేర్పి.. వాటి ప్రాణాలు నిలబెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని