దొంగకు సింహాసనం!

పూర్వం అవంతీ రాజ్యాన్ని జయకేతు అనే రాజు పాలిస్తుండేవాడు. ఒకసారి ఆయన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. అలా వేటలో లీనమై పరివారానికి దూరమయ్యాడు.

Published : 16 Mar 2023 01:28 IST

పూర్వం అవంతీ రాజ్యాన్ని జయకేతు అనే రాజు పాలిస్తుండేవాడు. ఒకసారి ఆయన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. అలా వేటలో లీనమై పరివారానికి దూరమయ్యాడు. తన వాళ్ల కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో ఎదురుపడిన పులి ఒకటి రాజుని చూసి గర్జించి, మీదకు దూకింది. అయినా భయపడకుండా దాంతో భీకరంగా పోరాడసాగాడు. అటుగా వెళ్తున్న కొందరు దొంగలు ఆ అలికిడి విని.. ఆ వైపుగా వచ్చారు. పులితో పోరాడుతున్న రాజు కనిపించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. పెద్ద పెద్ద చప్పుళ్లతో పులిని తరిమేశారు. ఆ దొంగల ముఠా నాయకుడికి రాజు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘నా ప్రాణం కాపాడారు.. మీకు ఏం కావాలో కోరుకోండి.. ఏదైనా ఇస్తాను’ అన్నాడు. ‘ప్రభువులు అలా అంటారు కానీ, నా కోరిక తీర్చలేరు’ అన్నాడు ముఠా నాయకుడు. ‘నా దగ్గర అలా జరగదు.. మాట తప్పడం మా వంశంలో లేదు’ అన్నాడు జయకేతు.

‘ప్రభూ.. నా కోరికను మీరు మన్నించాలి.. నాకు చిన్నప్పటి నుంచి రాజు కావాలని ఆశ. మీరు నన్ను మీ రాజ్యానికి ఏడాది పాటు మహారాజును చేయండి.. అది చాలు’ అన్నాడతను. ఆ కోరికతో జయకేతు కంగుతిన్నాడు. దొంగల ముఠా నాయకుడు ఇలాంటి కోరిక కోరతాడని ఆయన అస్సలు ఊహించలేదు. అయినా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. అంతలో మహారాజును వెతుక్కుంటూ... పరివారం అక్కడకు చేరుకుంది. దొంగలతో సహా అందరూ అక్కడి నుంచి కోటకు వెళ్లారు. జరిగిన విషయాన్నంతా మంత్రితో చెప్పి.. ఏడాది పాటు దొంగల ముఠా నాయకుడిని రాజుగా ప్రకటించాడు జయకేతు.

దొంగల నాయకుడు రాజవ్వగానే కారాగారంలో శిక్ష అనభవిస్తున్న చోరులందరినీ ఆగమేఘాల మీద విడుదల చేశాడు. తప్పు ఆకలిది కానీ దొంగతనానిది కాదని చట్టం చేశాడు. ఎక్కడైనా చోరీ జరిగితే ఆ తప్పు దొంగిలించిన వ్యక్తిది కాదనీ, అజాగ్రత్తగా ఉన్నవారిదేననీ ఆ చట్టంలో పేర్కొన్నాడు. తనకు తెలిసిన దొంగలందరినీ పిలిపించుకొని.. ఆస్థానంలో పెద్ద ఉద్యోగాల్లో నియమించుకున్నాడు. చిన్న దొంగలకు తోట పనులు చూసే బాధ్యత అప్పగించాడు. కొద్ది రోజుల్లోనే రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు ఎక్కువైపోయాయి. ప్రజలంతా తమ బాధలను రాజుకు చెప్పుకొన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తమ ధర్మమని నిస్సహాయంగా జవాబిచ్చేవాడు. ఒకవేళ దొంగతనాల గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, అజాగ్రత్తగా ఉన్నందుకు వారికే శిక్ష పడుతుండటంతో.. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి తలెత్తింది. రోజురోజుకు రాజ్యంలో అరాచకం తీవ్రం కాసాగింది. మంత్రికి, సేనాధిపతికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది.

అవంతికి పొరుగున వున్న రాజ్యం కుంతల. దానికి ప్రభువు గుణవర్మ. ఒకరోజు మంత్రి ఆనందభట్టు ఆయనతో.. ‘ప్రభూ.. పక్కరాజ్యంలో అరాచకం పరాకాష్టకు చేరింది. మనమిలా చూస్తూ ఊరుకుంటే ఆ ప్రభావం మనమీద కూడా పడవచ్చు’ అన్నాడు. ‘అయితే.. మనం ఏం చేయాలో చెప్పండి’ అని అడిగాడు గుణవర్మ. ‘అవంతీ రాజ్యం మీద దాడి చేయడమే మన ముందున్న ఏకైక మార్గం’ అన్నాడు మంత్రి. ‘అయితే యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు గుణవర్మ. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. స్వతహాగా రాజు కాకపోవడంతో శత్రువుల పట్ల అప్రమత్తంగా లేని దొంగల ముఠా నాయకుడు, అతని పరివారం.. కుంతల సేనల ధాటికి చెల్లాచెదురైంది. బతుకుజీవుడా అనుకుంటూ మళ్లీ అడవుల్లోకి పారిపోయారు. దొంగల పీడ విరగడ అయినందుకు అవంతీ రాజ్య ప్రజలు ఎంతో ఆనందించారు. ‘ఇప్పుడు మన తదుపరి కర్తవ్యం ఏంటి?’ అని గుణవర్మను అడిగాడు మంత్రి. ‘అవంతీ రాజ్య రాజును మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టి, మన దారిన మనం వెళ్లిపోదాం’ అన్నాడు రాజు.
మంత్రికి కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది. జయకేతుని సాదరంగా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు గుణవర్మ. దానికి జయకేతు ఆశ్చర్యపోతూ.. ‘దొంగల ముఠాను తరిమేసిన మీరు, అవంతిని కూడా మీ రాజ్యంలో కలిపేసుకుంటారేమో అనుకున్నాను. కానీ, మీరిలా ఉదార హృదయంతో మళ్లీ నన్ను రాజును చేస్తారని అస్సలు ఊహించలేదు’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు.
దానికి కుంతల రాజు గుణవర్మ స్పందిస్తూ.. ‘విస్తరణ కాంక్షతో మీ రాజ్యంపైన దాడి చేయలేదు. పక్కన ఇల్లు మంటల్లో చిక్కుకుంటే, మనకెందుకులే అని ఊరుకుంటే.. తర్వాత ఆ మంటలు మనింటికీ వ్యాపిస్తాయి. అందుకే దుష్టుల చేతుల్లో చిక్కిన మీ రాజ్యాన్ని వ్యయ ప్రయాసలకోర్చి విడిపించాం. తిరిగి మీకే అప్పగిస్తున్నాం.. ఇక జాగ్రత్తగా ఏలుకోండి. మాట తప్పని మీ వంశాచారం మంచిదే కానీ, మాట ఇచ్చేముందు కాస్త ముందూవెనుకా ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని దుర్వినియోగం చేసేవారు కూడా ఉంటారు. దొంగల ముఠా నాయకుడి విషయంలో అది మీకు బాగా అనుభవమైందనుకుంటా.. అందుకే పెద్దలు ముందు కీడెంచి, మేలెంచమన్నారు’ అన్నాడు. గుణవర్మ ఉదారత్వానికి, ముందుచూపునకు ఆశ్చర్యపోయాడు జయకేతు. అప్పటి నుంచి ఆచితూచి వ్యవహరిస్తూ.. ప్రజలకు సుపరిపాలన అందించసాగాడు.

గంగిశెట్టి  శివకుమార్ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు