బంగారు కడియం!

అనగనగా ఒక చిట్టడవి. అందులో ఒక పులి. అది చాలా మంచిది. దాంతో జీవులన్నీ దాన్ని అభిమానించేవి. పులి ఒకసారి అడవిలో తిరుగుతుండగా.. చెరువు ఒడ్డున బంగారు కడియం ఒకటి దొరికింది.

Published : 17 Mar 2023 00:09 IST

నగనగా ఒక చిట్టడవి. అందులో ఒక పులి. అది చాలా మంచిది. దాంతో జీవులన్నీ దాన్ని అభిమానించేవి. పులి ఒకసారి అడవిలో తిరుగుతుండగా.. చెరువు ఒడ్డున బంగారు కడియం ఒకటి దొరికింది. దాన్ని తన పుట్టినరోజు నాడు తనను అభిమానించే జంతువులు, పక్షుల్లో ఒకదానికి బహుమతిగా ఇవ్వాలనుకుంది. ఇంతలో పులి పుట్టినరోజు రానే వచ్చింది.  తెల్లవారుతుండగానే గుహ నుంచి బయటికి వచ్చేసరికి, పూలదండలు పట్టుకొని తాబేలు, కోతి కనిపించాయి. పులిని చూడగానే ఆ దండలను అందించి.. శుభాకాంక్షలు తెలిపాయవి.

తాబేలు, కోతి అభిమానానికి పులి చాలా సంతోషపడింది. వాటిని గుహ లోపలికి తీసుకువెళ్లి ‘మిత్రులారా.. ఏ వేళకు బయలుదేరారో.. ఇంత ఉదయాన్నే నా దగ్గరకు వచ్చారు..’ అని వాకబు చేసింది. ‘మిత్రమా.. నేను ప్రతి సంవత్సరంలాగే నీ పుట్టినరోజున నీతోనే ఉండాలని, నిన్న రాత్రే బయలుదేరాను’ అని చెప్పింది తాబేలు. ‘నేను వేరే పని మీద బయటకు వెళ్తుండగా.. దారి మధ్యలో తాబేలు కనిపించింది. అప్పటివరకూ నీ పుట్టినరోజు సంగతి అసలు నాకు గుర్తు కూడా లేదు. వెంటనే వెళ్లాల్సిన పని మానుకొని, నిన్ను కలవటానికి ఇద్దరం కలిసి వచ్చాం’ అని తీరిగ్గా చెప్పింది కోతి. ‘అలాగా.. చాలా సంతోషం. నా మీద అభిమానంతో చాలా శ్రమపడి వచ్చారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. నేను మీకు చక్కటి విందు ఏర్పాటు చేయిస్తాను’ అంది పులి. సరేనంటూ అవి రెండూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాయి.

ఇంతలో పులి బయటకు వెళ్లింది. కాసేపటికి తన మిత్రుడు ఎలుగుబంటితో కలిసి గుహకు తిరిగి వచ్చింది. తాను తీసుకువచ్చిన సామగ్రితో గుహను అందంగా అలంకరించింది ఎలుగుబంటి. రుచికరమైన విందును సిద్ధం చేసింది. పులికి శుభాకాంక్షలు చెప్పేందుకు అడవిలోని పక్షులు, జంతువులు ఒక్కొక్కటిగా గుహకు రాసాగాయి. ఒక్కో జీవి ఒక్కో కానుక అందించింది. అడవిలోని జంతువులు తన మీద చూపుతున్న ప్రేమకు పులి పొంగిపోయింది. వాటి రాకపోకలతో గుహ పరిసరాలు మొత్తం సందడిగా మారాయి. జీవులన్నీ కబుర్లతో ఆహ్లాదంగా గడపసాగాయి. అన్నీ కలిసి విందు భోజనం చేశాయి.

అప్పుడు ఎలుగుబంటి ముందుకు వచ్చి ‘మన మిత్రుడు పులి అంటే చాలా జీవులకు అభిమానం. ఆ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇటీవల తనకు దొరికిన ఒక బంగారు కడియాన్ని ఈరోజు తన అభిమానుల్లో ఒకదానికి బహుమతిగా ఇవ్వనుంది. అయితే, అది ఎవరికి దక్కనుందో చూడాలి’ అంటూ ప్రకటించింది. జంతువులు, పక్షులన్నీ దేనికదే ఆ కానుక తమకే వస్తుందని మనసులో అనుకున్నాయి. పులి ధగధగా మెరిసే బంగారు కడియాన్ని బయటకు తీసి.. ‘మిత్రులారా.. నా పుట్టినరోజు సందర్భంగా మీ సమయాన్ని కేటాయించి, ఈరోజు మొత్తం నాతో గడిపిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బంగారు కడియాన్ని ఒక్కరికే ఇవ్వగలను. కాబట్టి మిగతావారు బాధపడవద్దు’ అంటూ తన చేతిలోని కడియాన్ని అందరికీ చూపించింది.

జంతువులన్నీ దేనికవే పులి తమ పేరే ప్రకటిస్తుందని సంబరపడిపోసాగాయి. ఇంతలో పులి ‘ఈరోజు ఈ బంగారు కడియాన్ని అందుకోబోతున్నది.. తాబేలు’ అంటూ ప్రకటించింది. అది వినగానే తాబేలు ఎంతో ఆనందంతో పరుగులాంటి నడకతో వేదికను చేరుకుంది. పులి ఆ బంగారు కడియాన్ని సంతోషంగా తాబేలుకు తొడిగింది. మిగతా జీవులన్నీ చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశాయి. తర్వాత జంతువులన్నీ తిరిగి వెళ్లిపోయాక.. ‘మిత్రమా.. ఇంతమంది అభిమానులుండగా, నువ్వు తాబేలుకే ఎందుకు బంగారు కడియం బహుకరించావు.. నిజానికి కోతి కూడా తాబేలుతో కలిసే వచ్చింది.. అవి రెండూ నువ్వు నిద్ర లేచేసరికే గుహ ముందు పూలదండలతో సిద్ధంగా ఉన్నాయి కదా?’ అని అడిగింది ఎలుగుబంటి.

‘నిజమే మిత్రమా.. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మిత్రులందరి ప్రేమ వెలకట్టలేనిది. కానీ, తాబేలు మాత్రం నా పుట్టినరోజును గుర్తుంచుకుని ఎంతో దూరం నుంచి రాత్రంతా ప్రయాణించి ఇక్కడకు వచ్చింది. దాని నడక నెమ్మదైనా, మనసు పెద్దది. నా ప్రతి పుట్టినరోజుకూ గుర్తు పెట్టుకుని మరీ మొదట శుభాకాంక్షలు తెలిపేది తనే.. కోతి కూడా తాబేలుతో కలిసి వచ్చినా, నేనంటే ప్రేమాభిమానాలున్నా, దానికి నా పుట్టినరోజు గుర్తు లేదు. తాబేలును కలిసిన తర్వాతే.. కోతికి తెలిసింది. మనం గుర్తొచ్చి మనల్ని పలకరించే వారికన్నా, మనల్ని గుర్తుంచుకొని మరీ అభిమానం చూపేవారే నా దృష్టిలో గొప్ప..’ అని వివరించింది పులి. దాని నిర్ణయానికి ఎలుగుబంటి ఎంతో సంతోషించింది.

పైడిమర్రి రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని