విలువైన బహుమతి!
‘హ్యాపీ బర్త్ డే గోపీ’.. అంటూ శుభాకాంక్షలు తెలిపాడు రాజు. ‘థ్యాంక్స్’ అంటూ సంతోషంగా బదులిచ్చాడు గోపి. ఆ వెంటనే తరగతిలో ఒక్కొక్కరూ గోపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘మాకోసం ఏం తెచ్చావు?’ అని అడిగాడు రాజు. ‘ఈ చాక్లెట్లు మన కోసం, మిఠాయిలేమో టీచర్ల కోసం తెచ్చాను’ అని బదులిచ్చి.. ‘అరెయ్ రాజూ.. నువ్వు కూడా నాతో పాటు రావాలి’ అని కోరాడు గోపి. ‘ఎక్కడికి?’ అని అడిగాడు రాజు. ‘ముందుగా ఈ స్వీట్స్ టీచర్లకు ఇచ్చి, వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి. నాతో పాటు స్టాఫ్ రూమ్‌కి వస్తావా?’ అనడిగాడు. ‘ఓ.. తప్పకుండా వస్తాను.. పద.. పదా...’ అంటూ తొందర పెట్టాడు రాజు. ఎంత త్వరగా స్వీట్స్ పంచేస్తే.. అంత త్వరగా తమకు చాక్లెట్లు వస్తాయని అతడి ఆశ.
గోపి, రాజు ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఒకసారి గోపికి ఆరోగ్యం బాగోలేక, పది రోజులు బడికి వెళ్లలేదు. అప్పుడు బడిలో చెప్పిన పాఠాలన్నీ.. గోపీ వాళ్ల ఇంటికెళ్లి మరీ చెప్పేవాడు రాజు. అందరికీ చాక్లెట్లు పంచడం పూర్తయ్యే సరికి.. సైన్స్ మాస్టారు క్లాస్ రూంలోకి వచ్చారు. ఆ మాస్టారంటే విద్యార్థులకు చెప్పలేనంత ఇష్టం. పాఠాలను కథల్లా వివరించి చెబుతారాయన. ‘నిన్న మనం ఏ పాఠం చెప్పుకొన్నాం’ అని అడిగారు సైన్స్ మాస్టారు. ‘పచ్చని చెట్లు.. పాఠం చెప్పారు సార్’ జవాబిచ్చాడు రాజు. దానికి కొనసాగింపుగా మరో పాఠాన్ని చెప్పారా మాస్టారు. ఇంతలో బడి గంట మోగడంతో మాస్టారు వెళ్లిపోయారు. మిత్రులకు చాక్లెట్లు పంచేటప్పుడే.. ‘మీరంతా సాయంత్రం మా ఇంటికి రావాలి. నా బర్త్ డే కేక్ కటింగ్ ఉంది’ అని ఆహ్వానించాడు గోపి.
‘మనందరం కాస్త ముందుగా గోపి వాళ్లింటికి వెళ్దాం. అక్కడ ఎంచక్కా ఆడుకోవచ్చు. మీరంతా సిద్ధమేనా?’ అని అడిగాడు రాజు. ‘ఓ.. మేమంతా రెడీ..’ అంటూ వంతపాడారు మిత్రులంతా. అనుకున్నట్లుగానే అందరూ సాయంత్రం గోపి వాళ్లింటికి వెళ్లారు. ‘మీరంతా వచ్చినందుకు చాలా థ్యాంక్స్.. మా నాన్న గారు ఆఫీస్ నుంచి వచ్చేవరకూ మనం హాయిగా ఆడుకోవచ్చు’ అంటూ సంతోషంగా చెప్పాడు గోపి. అలా వారంతా కాసేపు ఆటలు ఆడుకున్నారు. ‘రాజూ.. బర్త్ డే గిఫ్ట్ ఏం తెచ్చావు?’ అని అడిగాడు శేఖర్. ముందుగా చెప్పడం ఇష్టం లేక.. ‘అది.. అది.. సీక్రెట్’ అన్నాడు రాజు. ‘నేనైతే అలారం వాచీ తెచ్చాను’ అన్నాడు శేఖర్. ‘నేను రిమోట్ కారు బొమ్మ తెచ్చాను. మా నాన్న అటువంటివి ఖరీదైన రెండు బొమ్మలు దిల్లీ నుంచి తెప్పించారు. వాటిలో ఒకటి గోపి కోసం తీసుకొచ్చా’ బడాయికి పోయాడు సంతోష్. ‘గోపీ.. త్వరగా రా నాన్నా.. నువ్వు రెడీ అవ్వాలి.. మీ నాన్న గారు వచ్చేశారు’ పిలిచింది వాళ్లమ్మ. ‘నాన్న గారొచ్చేశారా?’ అంటూ సంతోషంగా ఇంట్లోకి పరుగెత్తాడు గోపి.
కేక్ కటింగ్‌కు ఏర్పాట్లు పూర్తవడంతో.. ‘పిల్లలూ లోపలికి రండి’ అని ఆహ్వానించింది గోపి వాళ్లమ్మ. అందరూ ఉత్సాహంగా ‘హ్యాపీ బర్త్ డే టు గోపీ..’ అని పాట పాడుతుండగా.. సంతోషంగా కేక్ కట్ చేశాడతను. ఆ తర్వాత స్నేహితులందరూ ఒక్కొక్కరుగా తాము తీసుకొచ్చిన బహుమతులు అందిస్తూ.. ఫొటోలు దిగడం ప్రారంభించారు. ‘అరెయ్ రాజూ.. అలా వెనుకే ఉండిపోయావేం.. ముందుకు రా’ అని పిలిచాడు గోపి. ‘హ్యాపీ బర్త్ డే గోపీ’.. అంటూ మిత్రుడిని ఆప్యాయంగా హత్తుకొని తను తెచ్చిన మొక్కను బహుమతిగా అందించాడు రాజు. అందరూ ఆ బహుమతి వైపు విచిత్రంగా చూశారు. ‘అదేంటి.. గిఫ్ట్ కొంటే డబ్బులైపోతాయనా.. ఇలా మొక్కతో సరిపెట్టావు?’ అంటూ హేళన చేశాడో మిత్రుడు. ‘అదేం కాదు.. నేనే మా నాన్న గారికి చెప్పి మరీ, కావాలనే ఈ మొక్కను బహుమతిగా తీసుకొచ్చా’ అన్నాడు రాజు.
‘రాజు తెచ్చిన బహుమతి చాలా విలువైనది. మీరు అలా మిత్రుడిని హేళన చేయడం ఏం బాగాలేదు’ అన్నారు గోపి వాళ్ల నాన్న. ‘మీరు మంచి బహుమతులే తీసుకొచ్చారు కానీ, ఆ వస్తువులన్నీ కొద్ది రోజుల్లోనే పాడైపోతాయి. అదే రాజు తెచ్చిన బహుమతి.. మీతోపాటు పెరిగి పెద్దదై, పది మందికి నీడనిస్తుంది.. అంతేకాదు మనం బతకడానికి అవసరమైన ఆక్సిజన్ కూడా చెట్లే విడుదల చేస్తాయని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు’ అని మరింత వివరించారాయన.
‘అవును అంకుల్.. రాజు విషయంలో మేము హేళనగా మాట్లాడటం సరికాదు.. మేము తెచ్చిన బొమ్మలు కొద్దిరోజుల్లో పాడైపోతాయి.. చెట్ల వల్ల ఉపయోగాలను మా సైన్స్ మాస్టారు నిన్న చెప్పిన పాఠం ద్వారా తెలుసుకున్నాం. మమ్మల్ని క్షమించండి’ అన్నారు గోపి స్నేహితులు. ‘అయ్యో.. మీరు క్షమాపణ కోరేంత పెద్ద తప్పేం చేయలేదు.. మీరంతా భావి భారత పౌరులు.. ఈ సమాజం, పర్యావరణ బాధ్యత మీపైనే ఉంది’ అన్నారు గోపి వాళ్ల నాన్న. ‘సరే అంకుల్.. ఇకనుంచి మా మిత్రులెవరి పుట్టిన రోజు జరిగినా మొక్కలనే బహుమతిగా అందజేస్తాం’ అన్నారు. ‘మీ పిల్లలందర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పదండి.. పదండి.. అందరం కలిసి భోజనం చేద్దాం’ అని గోపీ వాళ్లమ్మ అనడంతో.. ‘సరే’ అంటూ డైనింగ్ హాల్‌లోకి పరుగెత్తారంతా.
కోరాడ అప్పలరాజు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
-
Politics News
Anam: అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Shubman Gill: నేను సెలక్టర్నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్
-
India News
Amritpal Singh: ‘అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపో’.. అకాల్‌తక్త్ పిలుపు
-
World News
Putin: పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్లో అణ్వాయుధాల మోహరింపు
-
Movies News
Harish Shankar: ఉస్తాద్ భగత్‌సింగ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ కౌంటర్