అసలైన బహుమతి!

ఒక రాజుగారికి సందేహం కలిగింది. అదేమిటంటే... ‘ఎవరికైనా దుర్లభమైన వస్తువు దొరికితే ఏమి చెయ్యాలి?’ అని. మర్నాడు సభను సమావేశ పరిచి తన పరివారాన్ని ఆ సందేహానికి సమాధానం చెప్పమని అడిగాడు.

Updated : 08 May 2023 04:59 IST

క రాజుగారికి సందేహం కలిగింది. అదేమిటంటే... ‘ఎవరికైనా దుర్లభమైన వస్తువు దొరికితే ఏమి చెయ్యాలి?’ అని. మర్నాడు సభను సమావేశ పరిచి తన పరివారాన్ని ఆ సందేహానికి సమాధానం చెప్పమని అడిగాడు. సభలోని వారు రకరకాలుగా ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్పారు. వాటిలో ఏ సమాధానమూ రాజుకు సంతృప్తిని కలిగించలేదు.
‘ఈ ప్రశ్నకు సరైన జవాబు చెప్పిన వారెవరైనా సరే వారికి మంచి బహుమతి ఇస్తాను’ అని రాజ్యంలో దండోరా వేయించాడు. అదివిన్న చాలామంది ఆశతో ప్రయత్నం చేసి, ఎన్నోరకాల సమాధానాలు చెప్పారు. కానీ అవేవీ కూడా మహారాజుకు సంతృప్తి కలిగించలేదు.

ఆ రాజ్యంలోనే ఉన్న ఒక సామాన్య గృహస్థుకు ఆ విషయం తెలిసింది. అతడు కాస్త  తార్కికజ్ఞానం ఉన్నవాడు. అంటే ఏ విషయాన్నైనా విశ్లేషణ చేసి ఆలోచిస్తాడు. అతడు ఒక్క క్షణం ఆలోచించి... ‘ఇందులో ఆలోచించాల్సినంత విషయం ఏముంది? దుర్లభమైన వస్తువు దొరికినప్పుడు, ఆ సంగతి ఎవరికీ తెలియనివ్వకుండా, రహస్యంగా ఉంచాలి. ఈ విషయం రాజుగారికి చెప్పండి’ అని జవాబు చెప్పాడు.

ఆ మాటల్ని ఉద్యోగులు రాజుకు విన్నవించారు. ఆ సమాధానం విన్న మహారాజు ఒక్క క్షణం ఆలోచించి.. ‘ఇది సబబుగానే ఉన్నట్టుంది. పూర్తిగా అర్థం కాకపోయినా అందులో ఏదో అంతరార్థం ఉంది’ అనిపించి సంతృప్తి చెందాడు. అందుకే ఆ సమాధానం చెప్పిన వ్యక్తిని స్వయంగా కలిసి దాని భావం పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. ముందుగా సమాచారం ఇచ్చి గృహస్థు ఇంటికి వెళ్లాడు మహారాజు.

అది ఒక సాధారణమైన ఇల్లు. అతడు పరిచిన చాప మీద కూర్చుంటూ... ‘నీ సమాధానం నాకు సంతృప్తినిచ్చింది. నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో’ అన్నాడు. అప్పుడు ఆ గృహస్థు... ‘ప్రభూ! మీకు నా మీద ఇంతటి అభిమానం కలిగినందుకు కృతజ్ఞతలు. కానీ నాదొక్క మనవి. ఏమిటంటే... ఇక మీదట నేను ఆహ్వానించకుండా మీరెప్పుడూ నా ఇంటికి రావద్దు. అలానే నన్ను కూడా మీ ఆస్థానానికి పిలిపించవద్దు. ఇదే నేను మిమ్మల్ని కోరే బహుమతి. అలా చేస్తే అదే మీరు నాకు ఇచ్చే కానుక. ఇలా అన్నానని ఇది నా అహంకారం అనుకోవద్దు. ఇది నా అభ్యర్థన మాత్రమే’ అని మనవి చేసుకున్నాడు.

సామాన్య గృహస్థు నోటివెంట ఆ మాటలు రావడంతో మహారాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే... సామాన్యులైనవారు మహారాజంతటి వాడు తన ఇంటికి వస్తే సంబర పడిపోతారు. పైగా కోరికలు కోరుకొమ్మనే సరికి మురిసిపోయి ఏవేవో కోరేస్తారు. వీలైతే ఇంకా ఏకరువు పెట్టాలని చూస్తారు. కానీ ఇతని మాటలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అదే విషయం అతణ్నే అడిగాడు.

అప్పుడా గృహస్థు... ‘మహారాజా! నేను మిమ్మల్ని నా వద్దకు రావద్దని, నన్ను మీ వద్దకు పిలిపించ వద్దని అన్నాను. అంతేగాని ఇకపై ఎప్పుడూ నేను మీ దర్శనం చేసుకోనని అనలేదు కదా’ అన్నాడు నవ్వుతూ.

అర్థం కాక చూస్తుండిపోయిన రాజుతో.... ‘మీ అనుగ్రహం పొందడం నాకు మహాభాగ్యం. నాలాంటి సామాన్యుడికి మహారాజుల స్నేహం లభించడం ఎంతో దుర్లభమైన విషయం. అలాంటప్పుడు ఈ విషయాన్ని నేను గోప్యంగా ఉంచాలి కదా. ఎందుకంటే నాకు మహారాజు అనుగ్రహం లభించిందని, రాజు గారు నాతో సన్నిహితంగా ఉన్నారని ప్రజలకు తెలిస్తే నా తోటివారు, సాటివారు నన్ను ప్రశాంతంగా బతకనీయరు.

‘నీకు మహారాజుతో పరిచయం ఉందికదా. రాజు గారికి చెప్పి నాకు కొలువు ఇప్పించు. ఆ పని, ఈ పని చేయించి పెట్టు’ అంటూ నన్ను ఇబ్బంది పెడతారు. ఒకటో రెండో మీ చేత చేయించుకున్నా, ప్రతిసారీ అడిగితే మీ దగ్గర నా గౌరవం పోతుంది. చేయించక పోతే వాళ్ల దగ్గర మాట పడాల్సి వస్తుంది. ఇలా లేనిపోని బెడదలన్నీ తలకు ఎత్తుకున్నట్లు అవుతుంది. అందువల్ల మీరు రావద్దు, నన్ను రమ్మనవద్దు’ అన్నాను. అవసరమైతే సమయం సందర్భం చూసుకుని నేనే తమ దర్శనానికి వస్తుంటాను. నిజానికి మీకు నన్ను కలుసుకోవాల్సిన అవసరం కాని, నాకు మిమ్మల్ని దర్శించుకోవాల్సిన పరిస్థితి కానీ ఎప్పుడూ రాక పోవచ్చు’ అన్నాడు.

ఆ మాటల్లో నిజం ఉందనిపించింది రాజుకు. అందుకే ఆ సమాధానంతో... ‘దుర్లభమైన వస్తువు దొరికినప్పుడు, ఆ సంగతి ఎవరికీ తెలియనివ్వకుండా, గోప్యంగా ఉంచాలి’ అని అతడు ఎందుకన్నాడో అప్పుడు పూర్తిగా అర్థం అయింది రాజుకు.  

ఆదిత్య కార్తికేయ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని