అమ్మ మాట!

పరీక్షలు పూర్తయ్యాయి.. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. నగరంలోని అపార్ట్‌మెంట్లలో పిల్లలంతా ఎవరి ఇళ్లలో వారు టీవీ చూడటమో, సెల్‌ఫోన్‌తో ఆడుకోవడమో చేస్తున్నారు. రవి వాళ్ల అమ్మ ఓ సంచిలో శెనక్కాయలను అతడి ముందు పోసి పొట్టు తీయమని చెప్పింది. ‘అసలేంటమ్మా.. ఇప్పుడే కదా టిఫిన్‌ చేసి అలా కూర్చున్నా..

Updated : 12 May 2023 05:07 IST

రీక్షలు పూర్తయ్యాయి.. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. నగరంలోని అపార్ట్‌మెంట్లలో పిల్లలంతా ఎవరి ఇళ్లలో వారు టీవీ చూడటమో, సెల్‌ఫోన్‌తో ఆడుకోవడమో చేస్తున్నారు. రవి వాళ్ల అమ్మ ఓ సంచిలో శెనక్కాయలను అతడి ముందు పోసి పొట్టు  తీయమని చెప్పింది. ‘అసలేంటమ్మా.. ఇప్పుడే కదా టిఫిన్‌ చేసి అలా కూర్చున్నా.. అయినా ఉదయాన్నే ఆడుకోమని చెప్పకుండా, ఇలా ఇవి పొట్టుతీయి.. ఆ పనిచేయి అని చెబుతున్నావు? అన్ని కాయలు వొలిస్తే నా చేయి నొప్పి పుట్టదూ..’ అంటూ టీవీ వైపు తిరిగి కూర్చున్నాడు.

‘సరే.. సమయం వచ్చినప్పుడు అర్థం అయ్యేలా చెబుదాం’ అని మనసులోనే అనుకుందామె. మధ్యాహ్నం వంటకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకునేందుకు లోపలకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత రవిని పిలిచి.. ‘చిన్నా.. అక్కడున్న డబ్బాలో చింతపండు ఉంది. దాన్ని శుభ్రం చేసి ఇందులో వేయి’ అంటూ ఓ గిన్నెను అందించిందామె. డబ్బాలోంచి చింతపండును తీసి గిన్నెలో వేసుకొని, కడగసాగాడు రవి. మధ్య మధ్యలో వచ్చిన చింత పిక్కలను కిటికీలో నుంచి బయటకు విసిరేయసాగాడు. లోపలి గది నుంచి ఇదంతా గమనిస్తున్న అమ్మ.. మరోమారు సందర్భం కోసం ఎదురుచూసింది.
ఇంతలో రోజూలాగే వీధిలోకి ఐస్‌క్రీములు అమ్మే బండి వచ్చింది. బయట ఆ బండి చేసే శబ్దం.. ‘ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్లి కొనుక్కొని తిందామా..!’ అన్నట్లు ఊరిస్తోంది. వెంటనే అమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి, ‘అమ్మా.. నాకు ఐస్‌ కొనిపెట్టవా?’ అని అడిగాడు రవి. ‘నీకు నేనెందుకు కొనిపెట్టాలి.. నువ్వే కొనుక్కోవచ్చుగా..’ అంది అమ్మ కొత్తగా. ‘అదేంటి ఎప్పుడు అడిగినా కొనిస్తాననో, ఇవ్వననో చెప్పే అమ్మ.. ఈరోజు కొత్తగా నువ్వే కొనుక్కోవచ్చుగా అంది’ అనుకుంటూ ఆలోచనలో పడ్డాడా బాబు.

వెంటనే అమ్మ.. ‘అవును.. నేను నిన్ను ఉదయం శెనక్కాయలను వొలవమంటే నావల్ల కాదన్నావు.. ఇప్పుడు చింత పిక్కలను బయట పడేశావు.. మరి నీకు ఐస్‌ ఎలా వస్తుంది?’ అని అడిగింది. అర్థం కాక చూస్తున్న రవిని దగ్గరకు తీసుకొని ‘మేము చిన్నతనంలో మా పల్లెలో వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండేవాళ్లం కాదు. మళ్లీ స్కూళ్లు తెరిచేలోగా నీడపట్టునే ఉంటూ.. పుస్తకాలకు, స్టేషనరీకి సరిపడా డబ్బులు సంపాదించుకొనేవాళ్లం తెలుసా..’ అందామె.
ఆ మాటలకు కాస్త బిక్క ముఖం వేసిన రవితో.. ‘అమ్మమ్మ వాళ్ల ఊరిలో విత్తనాలకు శెనక్కాయలను వొలిచేవారం. ఎన్ని గింజలైతే.. అన్ని డబ్బులు ఇచ్చేవాళ్లు. అలాగే.. చింతపండు నుంచి గింజలను వేరు చేసి అన్నింటినీ ఓ సంచిలో వేసుకొనేవాళ్లం. వారానికి ఒకసారి వచ్చే వ్యక్తి వాటిని తీసుకొని, మాకు ఎంతోకొంత డబ్బు ఇచ్చేవాడు. ఇంకా చెట్టు నుంచి కింద రాలిపడిన వేపకాయలన్నీ ఏరి బాగా ఎండబెట్టేవాళ్లం. ఆ గింజలను గానుగలకు అమ్మేవాళ్లం. కానుగ కాయలు కూడా.. ఇలా ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మా నోటు పుస్తకాలకు, పెన్నులకు కావాల్సిన మొత్తం మేమే సొంతంగా సంపాదించుకొనే వాళ్లం’ అని వివరించిందామె.

‘అమ్మా.. డబ్బు కోసమే ఇలా చేసే వాళ్లా మీరంతా..?’ అని చిన్న మాటతో పెద్ద ప్రశ్న వేశాడు రవి. ఆ మాటకు కొడుకుని ఇంకాస్త దగ్గరకు తీసుకున్న అమ్మ.. ‘కేవలం డబ్బుల కోసమే కాదు చిన్నా.. ఆ పనుల వల్ల మాకు సమయం బాగా గడిచేది. ఒకరికొకరు ఎలా సహాయపడాలో నేర్చుకున్నాం.. తెలియని విషయాలు బోలెడు తెలుసుకున్నాం. పెద్ద వయసు వారైతే చందమామ కథలు కూడా చెప్పేవారు. పనులేమీ లేకపోతే.. చుట్టుపక్కల ఇళ్ల వారందరూ కలిసి తినుబండారాలను చేసుకొని పంచుకొనే వాళ్లం’ అంటూ అమ్మ చెబుతుంటే కదలకుండా వింటున్నాడు రవి.

‘అయితే.. ఇవన్నీ చేస్తున్నట్లు అమ్మమ్మా, తాతయ్యలకు తెలుసా?’ అని అడిగాడా బాబు. ‘ఓ.. ఎందుకు తెలియదు? అమ్మమ్మే చెప్పి మరీ పంపించేది’ అని సమాధానమిచ్చిందామె. ‘ఇప్పుడు నన్ను కూడా బయటకు వెళ్లి డబ్బులు సంపాదించమంటావా అమ్మా?’ అని అమాయకంగా అడిగాడు రవి. దాంతో ఒక్కసారిగా నవ్వి.. కొడుకు తల నిమురుతూ.. ‘ఇప్పుడు నిన్ను వెళ్లమని చెప్పడం లేదు.. సెలవులను వృథా చేసుకోకుండా, పనికొచ్చేవి నేర్చుకోవాలి. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులు చెబితే బద్దకించకుండా పెద్దవాళ్లకు సహాయపడాలి’ అని చెప్పిందామె. ‘సరేనమ్మా’ అంటూ నవ్వాడు రవి.

సింగంపల్లి శేష సాయి కుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని