కుందేలు సాయం!

చిత్రావనం చిట్టడవిలో మంగళం అనే కాకి ఉండేది. ఒక చెట్టు మీద అందంగా గూడు కట్టుకుని, తన పిల్లలను జాగ్రత్తగా అందులోకి చేర్చింది. ‘అమ్మా.. ఆకలి’ అన్నాయవి.

Updated : 14 May 2023 06:39 IST

చిత్రావనం చిట్టడవిలో మంగళం అనే కాకి ఉండేది. ఒక చెట్టు మీద అందంగా గూడు కట్టుకుని, తన పిల్లలను జాగ్రత్తగా అందులోకి చేర్చింది. ‘అమ్మా.. ఆకలి’ అన్నాయవి. తల్లి వెంటనే ‘మీకు ఆహారం తీసుకొస్తాను. అప్పటివరకూ గూడు వదలి బయటకు రాకండి’ అని చెప్పింది. ‘అలాగేనమ్మా’ అన్నాయవి. కాకి ఎగిరేందుకు సిద్ధమవుతుండగా.. పరిమళం అనే కుందేలు వచ్చింది. ‘మిత్రమా..’ అంటూ మంగళాన్ని పిలిచింది. ‘ఏంటి విషయం?’ అని అడిగింది కాకి. ‘ఈరోజు ఆహారం కోసం నాకు బయటకు వెళ్లే ఓపిక లేదు. నీ పిల్లలతోపాటు నా బిడ్డకు కూడా కాస్త ఆహారం తెచ్చిపెడతావా?’ అని నెమ్మదిగా అడిగింది.

‘ఇలా అడిగితే ఆహారం రాదు. కష్టపడితేనే వస్తుంది. నీకోసం నేనెందుకు కష్టపడాలి? నువ్వు నా మిత్రుడివి కావు. బంధువు అంతకన్నా కాదు. నేను నీకు ఆహారం తెచ్చివ్వను’ అంటూ తేల్చిచెప్పింది మంగళం. ‘సాటి జీవివన్న చనువుతో అడిగాను. నీవల్ల కాదంటే నేనేం బలవంతం చేయడం లేదు కదా!’ అంటూ చిన్నబుచ్చుకుంది పరిమళం. దాని మాటలు పూర్తిగా వినకుండానే.. పైకి ఎగిరింది మంగళం. కొన్ని గంటల తర్వాత మంగళం.. తన పిల్లలున్న చెట్టు మీద వాలబోతూ అక్కడే తిరుగుతున్న పరిమళాన్ని చూసింది. తాను తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు అందించింది. పరిమళం వద్దకు వెళ్లి ‘ఆహారం ఇవ్వనని చెప్పాను కదా! ఒకసారి చెబితే అర్థం కాదా?’ అని కసురుకుంది.

‘అందుకు కాదు మిత్రమా!’ అంటూ అది ఏదో చెప్పబోతుండగా.. ‘నీ మాటలు వినను. ఆహారం తెచ్చివ్వను’ అంటూ తన గూటిలోకి వెళ్లిపోయింది మంగళం. మరుసటి రోజు తెల్లవారగానే అలవాటులో భాగంగా ఆహారం కోసం బయటకు వెళ్తున్న కాకికి అక్కడే తిరగాడుతున్న కుందేలు కనిపించింది. ‘నువ్వెంత తిరిగినా, నీ కాళ్లు నొప్పి పుడతాయే తప్ప కడుపు నిండదు. వెళ్లిపో’ అంటూ ముఖం మీదే చెప్పింది. ఆ మాటలకు పరిమళం తనలో తానే నవ్వుకుంది. కొంతసేపటికి మంగళం ఆహారంతో తిరిగి వచ్చింది. చెట్టు మీద వాలబోతూ.. ఇంకా అక్కడే తిరుగుతున్న పరిమళాన్ని చూసింది. ‘ఎంత చెప్పినా.. ఇది వినేట్టు లేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా హెచ్చరించాలి’ అనుకుంటూ కిందకు వచ్చింది.

కానీ, అప్పుడే పరిమళం ఏదో మాట్లాడుతున్నట్లు అనిపించి, జాగ్రత్తగా వినసాగింది. ‘పిల్లలూ.. పాము వస్తోందని భయపడకండి. నా స్నేహితుడు గద్దకు చెప్పాను. పాముకు కనబడకుండా అది ఇక్కడిక్కడే తిరుగుతోంది’ అంది. ఆ మాటలు వినగానే పొదల్లో దాక్కున్న పాము భయపడి పారిపోయింది. పాము వెళ్లిపోవడం చూసిన మంగళం ఆశ్చర్యపోయి.. ‘ఆహారం కోసం వచ్చావని నిన్ను చులకనగా చూశాను. ఎంత చెప్పినా వినడం లేదని అసహ్యించుకున్నాను. కానీ నా పిల్లలకు నేను లేని సమయంలో తోడుగా ఉంటున్నావని గ్రహించలేకపోయా. అయినా, నువ్వు చేస్తున్న సాయం గురించి చెబితే, నేను ఆహారం ఇచ్చేదాన్ని కదా.. ఎందుకు చెప్పలేదు?’ అని అడిగింది.

అప్పుడు పరిమళం నవ్వుతూ.. ‘ఫలితం ఆశించి చేస్తే అది పని అవుతుంది. స్వార్థానికి దారి తీస్తుంది. ఇక్కడకు వచ్చిన రోజే చెట్టు కింద పాము ఉన్నట్లు అనుమానించాను. రెండో రోజు గుర్తించాను. ఆ విషయం నీకు చెప్పేలోపు వినిపించుకోకుండా వెళ్లిపోయావు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను. ఎలాగైతేనేం.. నీ బిడ్డలను కాపాడాను. నా ఉపాయం ఫలించింది. ఇక వెళ్లివస్తాను’ అంటూ పరిమళం కదలబోయింది. ఈలోగా ‘ఆగు మిత్రమా..’ అని మంగళం అనడంతో.. ‘ఎందుకు?’ అని అడిగిందది. ‘కాస్త ఆహారం ఇస్తాను. తీసుకెళ్లి నీ పిల్లలకు పెట్టు’ అంది. ‘మిత్రమా.. ఈ రోజు నాకు ఓపిక ఉంది. ఆహారం సంపాదించుకున్నాను’ అని జవాబిచ్చింది.
‘నా అనుకోవడంలో స్వార్థం ఉంది. మనం అనుకోవడంలోనే సహకార భావం ఉంది. నువ్వు నాలో మార్పు తీసుకొచ్చావు. ఇకనుంచి సాయం కోరి వచ్చినవారికి అండగా నిలుస్తాను. ఎటువంటి ఫలితం ఆశించకుండా సహాయం చేస్తాను’ అని కుందేలుకు మాట ఇచ్చింది కాకి. ‘చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మిత్రమా.. నీ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి’ అంటూ మంగళం వైపు మెచ్చుకోలుగా చూసింది పరిమళం.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని