కోతిపిల్లకు బుద్ధి వచ్చిందోచ్‌!

వంశధార అడవుల్లో చాలా జంతువులు ఉండేవి. వాటిలో దుర్ముఖి అనే కోతి పిల్ల ఒకటి. అది చెడ్డది. అల్లరి పనులు, వెర్రి చేష్టలతో జంతువులకు కష్టం కలిగించి ఆనందించేది.

Updated : 15 May 2023 03:58 IST

వంశధార అడవుల్లో చాలా జంతువులు ఉండేవి. వాటిలో దుర్ముఖి అనే కోతి పిల్ల ఒకటి. అది చెడ్డది. అల్లరి పనులు, వెర్రి చేష్టలతో జంతువులకు కష్టం కలిగించి ఆనందించేది. దాని బాధ పడలేని జంతువులన్నీ దుర్ముఖి తల్లిదండ్రుల దగ్గరకెళ్లి.. ‘పనీపాటా లేకుండా దుర్ముఖి తిరగడమే కాకుండా, మా పిల్లల్ని కూడా చెడగొడుతోంది. దాన్ని మంచి గురువు దగ్గర చేర్పించి సరైన దారిలో పెట్టండి’ అని అర్థించాయి.

ఆ మాటల్ని విన్న పావురం ‘విశాలమైన మన అడవికి ఇప్పుడు ఎలుగుబంటి మాత్రమే వైద్యుడు. అదికూడా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. దుర్ముఖిని ఎలుగుబంటి దగ్గర చేర్పించి వైద్యం నేర్పిస్తే... అదీ బాగుపడుతుంది, మనకూ ఒక కొత్త వైద్యుడు దొరుకుతాడు’ అని సలహా ఇచ్చింది.

ఈ సూచన నచ్చడంతో దుర్ముఖిని జంతువులన్నీ  ఒప్పించాయి. వెంటనే దాన్ని తీసుకుని ఎలుగుబంటి దగ్గరకు బయల్దేరాయవి. అప్పటికే దుర్ముఖి గురించి తెలిసిన విషయాలన్నీ చెప్పేసి దాంతో జాగ్రత్తగా ఉండమని ఎలుగుబంటికి చెప్పిందొక కాకి. నిజానికి ఎలుగుబంటి చాలా మంచిది. ప్రతిఫలం ఆశించకుండా జంతువులు, పక్షులకు వైద్యం చేస్తోంది. తనతోనే వైద్యం అంతరించి పోకూడదని, తగిన శిష్యుడు దొరికితే బాగుండునని అనుకుంటోంది. దుర్ముఖి విషయం కాకి ద్వారా తెలిసి సంతోషించింది ఎలుగుబంటి. అల్లరి స్వభావం కలిగి ఉన్న కోతిపిల్లని సరైన దారిలో పెట్టాలనుకుంది. ‘శిష్యుడిగా నిన్ను ఒప్పుకోవాలంటే ఒక పని చెయ్యాలి. లోకంలో దేనికీ పనికి రానిదేదైనా తెచ్చివ్వు. అప్పుడే నా శిష్యుడివి కాగలవు’ అని షరతు పెట్టింది ఎలుగుబంటి.

‘లోకంలో పనికి రానివే ఎక్కువ ఉంటాయి. అవి తేవడం సులువు. పరీక్ష అంటే కష్టమైనదేదో అనుకున్నా. ఇంత సులువైనది అడిగింది ఈ ఎలుగుబంటి. అలా వెళ్లి ఇలా తెచ్చేస్తా’ అనుకుంది దుర్ముఖి.

సరేనని ఎలుగుబంటికి చెప్పి దుర్ముఖి వెళుతుంటే దారిలో దానికి ఒక గాడిద కనబడింది. తప్పు చేసిన పిల్లల్ని ‘గాడిద’ అని మనుషులు తిట్టడం గుర్తొచ్చింది దానికి. అది పనికిరానిదై ఉంటుందనుకుని, దానికి విషయం మొత్తం వివరించి తనతో రమ్మంది.
‘నేను బరువుల్ని సులువుగా మోసుకెళ్తాను. కొందరు వైద్యంలో నా పాలు వాడతారు. నేను పనికిరాని దాన్ని కాదు’ అంది గాడిద. తల గోక్కుని మళ్లీ ముందుకు కదిలింది దుర్ముఖి. ఈసారి దానికి ‘కావ్‌... కావ్‌..’ అన్న అరుపు వినబడగా పైకి చూసింది. చెట్టు మీద కాకి కనబడింది.  

‘దీని అరుపుల్ని వింటే.. కాకిగోల అని తిడతారు జనం. ఇది పనికి రానిదే అవుతుంది. దీన్ని తీసుకెళ్తా’ అనుకుని విషయమంతా చెప్పి కాకిని తనతో రమ్మంది దుర్ముఖి. ‘చనిపోయిన వాళ్లకు పెట్టే పిండాలను నేను తిన్నప్పుడే మనుషులు తృప్తి పడతారు. ఇళ్ల పరిసరాల్లో ఎంగిలి మెతుకులు తింటూ శుభ్రంగా ఉంచుతాను. కోకిల గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తాను. నేను పనికిరానిదాన్ని కాదు’ అంది కాకి.

ఉసూరుమంటూ మళ్లీ బయల్దేరింది దుర్ముఖి. ఈసారి దానికి ఓ పిల్లి ఎదురైంది. ఇళ్లలో పడి పాలు తాగేస్తుందని, పిల్లి ఎదురైతే అపశకునమని తిడతారు మనుషులు. దీన్ని తీసుకెళ్తాననుకుని పిల్లిని తనతో రమ్మంది దుర్ముఖి.

‘ఎలుకల్ని పట్టుకోవాలంటే మనుషులకు నేనే గతి. వాళ్లు ప్రేమగా నన్ను పెంచుకుంటారు తెలుసా?’ అని చెప్పింది పిల్లి. ఈసారి మరో దిక్కు వైపు నడుస్తూ వెళుతున్న దుర్ముఖికి ఓ ఆవు కనబడింది. తిండి పెట్టడం దండగని వదిలేస్తే ఇది అడవికి వచ్చినట్టుంది. పనికిరానిదే అయి ఉంటుందనుకుని ఆవుని ఎలుగుబంటి దగ్గరకు రమ్మంది దుర్ముఖి.

‘తోటి ఆవుల నుంచి విడిపోయి పొరపాటున వచ్చాను. నా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. నా పాలను తాగి  మనుషులు ఆరోగ్యం పొందుతారు. ఆవు పాలతో నెయ్యి, పెరుగు చేసుకుని ఆహారంగా వాడతారు. నా సంతతిని  పొలం పనులకు వాడతారు’ అని చెప్పేసి, అక్కడ పేడను వేసి వెళ్లిపోయింది ఆవు.

ఆవుపేడను చూడగానే దాన్ని తీసుకెళ్లి ఎలుగుబంటికి ఇవ్వొచ్చని కోతికి బుద్ధి పుట్టింది. వెడల్పుగా ఉన్న ఆకుని దొన్నెలాగా చేసి పేడను ఎత్తబోయింది కోతి.

‘పేడను ఎందుకు తీస్తున్నావు?’ అని అప్పుడే అక్కడికి వచ్చిన ఓ సాధువు కోతిపిల్లను అడిగాడు. జరిగిన  విషయమంతా చెప్పింది కోతిపిల్ల. ‘పొలాల్లో సారం పెంచడానికి రైతులు పేడను ఎరువుగా వాడతారు. ఆవుపేడతో గొబ్బెమ్మలు, పిడకలు చేసి పండుగల్లో ఉపయోగిస్తారు. ఆవుపేడ కలిపిన నీటితో కళ్లాపి చల్లుతారు. ఇలా చాలా ఉపయోగాలున్నాయి’ అని చెప్పాడు సాధువు.

దుర్ముఖికి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. సృష్టిలో పనికిరానిదే లేదా అనుకుంది. ‘పేడ వల్ల కూడా ఉపయోగముందని తెలుసుకున్నావు. కానీ నీవల్ల ఏ ప్రయోజనం ఉందో చెప్పగలవా’ అనడిగాడు సాధువు.  

ఎంత ఆలోచించినా తన వల్ల ఉపయోగమేమిటో ఒక్కటీ తోచలేదు కోతికి. ఏమీ చెప్పలేకపోయింది. ‘ఇప్పటికైనా అర్థమైందా? నువ్వే పనికిరానిదానివని! బుద్ధిగా వైద్యం నేర్చుకున్నావంటే... అప్పుడు నీ వల్ల చాలా మేలు జరుగుతుంది. అప్పుడు నువ్వూ అందరికీ పనికి వస్తావు’ అన్నాడు సాధువు.

సాధువుకు ధన్యవాదాలు చెప్పి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లింది దుర్ముఖి. ‘పనికిరానిది తేవడం కోసం చాలా వెతికాను. కానీ అన్నీ పనికొచ్చేవే. ఆఖరుకు పేడ వల్ల కూడా ఉపయోగాలున్నాయని తెలిసింది. వాటన్నింటితో పోలిస్తే నేను మాత్రమే పనికిరాని దాన్ని. నన్నే తీసుకుని వైద్యం నేర్పించి పనికొచ్చేదానిగా మార్చండి’ అని కన్నీళ్లు పెట్టుకుంది కోతి.

‘నీవేంటో నీకు తెలిసింది కదా. నీలో గర్వం పోయిందనడానికి అదే సంకేతం. నీకు వైద్యం నేర్పుతాను. బుద్ధిగా నేర్చుకో’ అని తన శిష్యుడిగా చేర్చుకుంది. తక్కువ సమయంలోనే వైద్య చిట్కాలు నేర్చుకుని, అడవిలోని జంతువులకు సేవలందించి మంచి పేరు తెచ్చుకుంది దుర్ముఖి.    

నారంశెట్టి ఉమామహేశ్వరరావు

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని