నక్క నమ్మక ద్రోహం!

అనగనగా హరితమాల అనే అరణ్యం. ఎత్తయిన చెట్లు, జలజల పారే జలపాతాలు, పక్షుల కిలకిలారావాలు, జంతువులతో ఆ అడవి చాలా అందంగా, ఎంతో సందడిగా ఉండేది.

Updated : 16 May 2023 00:47 IST

నగనగా హరితమాల అనే అరణ్యం. ఎత్తయిన చెట్లు, జలజల పారే జలపాతాలు, పక్షుల కిలకిలారావాలు, జంతువులతో ఆ అడవి చాలా అందంగా, ఎంతో సందడిగా ఉండేది. అరణ్యానికి సుచలుడు అనే సింహం రాజుగా వ్యవహరించేది. జిత్తు అనే నక్క మంత్రిగా పనిచేసేది. పక్షులు, జంతువులను మృగరాజు ప్రేమగా చూసుకునేది. అవసరం మేరకే వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేది. సుచలుడి వద్దకు ఎప్పుడైనా వెళ్లి తమ బాధలు చెప్పుకునేవి పక్షులు, జంతువులు.

ఈ మధ్య అడవిలో వేటగాడి తాకిడి ఎక్కువ కావడంతో క్రమక్రమంగా పక్షులు, జంతువుల సంఖ్య తగ్గడం మొదలైంది. పక్షుల ద్వారా విషయం తెలుసుకున్న సుచలుడు, మంత్రి జిత్తుతో చర్చించింది. సమస్య పరిష్కారానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగింది.

‘మహారాజా! మన అడవిలో వేటగాడిని నిలువరించాలంటే.. అది, ఒక్క మీ వల్లే సాధ్యం. పగటిపూట మీరు గర్జిస్తూ అడవి మొత్తం సంచరిస్తే వేటగాడు పారిపోతాడు’ అని సలహా ఇచ్చింది జిత్తు. బాగుందని మృగరాజు మెచ్చుకుంది.

‘రేపటి నుంచే మన కార్యాచరణ మొదలు పెడదాం. నువ్వు కూడా నాతోనే రా’ అని మంత్రి జిత్తుతో చెప్పింది మృగరాజు. మరునాడు ఉదయమే అడవిలో తిరుగుతూ, గర్జిస్తూ బయలుదేరింది సింహం. కాసేపటి తర్వాత బాగా అలసిపోయిన మృగరాజు పెద్ద మర్రిచెట్టు కింద సేద తీరింది. మృగరాజు ప్రతిరోజూ స్వయంగా అడవి పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోందన్న విషయం తెలుసుకున్న పక్షులు, జంతువులు చాలా సంతోషించాయి.

ఇలా రోజూ సింహంతోపాటు తిరగడం వల్ల నక్కకు ఆహారం దొరకడం కష్టంగా మారింది. ‘నేను ఇచ్చిన ఉపాయం నాకే ఆహారం లేకుండా చేస్తోంది.. ఎలా?’ అని దీర్ఘంగా ఆలోచిస్తూ మర్రిచెట్టు కిందనే కూర్చుంది జిత్తు. అలసిపోయిన మృగరాజు గాఢనిద్రలోకి జారుకుంది.  

కాస్త దూరంలో ఉన్న వేటగాడిని చూసింది జిత్తు. అతడి దగ్గరికి వెళ్లి... ‘ఓ వేటగాడా! నన్ను చూసి నువ్వేం భయపడవద్దు. రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారు. ప్రతిరోజు స్వయంగా రాజుగారే అరణ్య సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు’ అంది. ‘నిజమే... నాకు ఈ నెల రోజుల నుంచి ఒక్క జంతువు, పక్షి కూడా వేటకు చిక్కలేదు. పైగా మృగరాజు గర్జనతో నేను ప్రాణభయంతో వణికి పోతున్నాను. ఏ క్షణం, ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో... అని భయం, భయంగానే వేటకు వస్తున్నాను’ అన్నాడు వేటగాడు.

‘నీ భయం నిజమే! స్వయంగా మృగరాజే అరణ్య సంరక్షణ బాధ్యతలు చూసుకుంటోంది. వేటాడడమే మానేసింది. నాకు కడుపునిండా ఆహారం దొరకక నెల రోజులు దాటింది. నీకు ఒక ఉపాయం చెబుతాను. సింహం, అడవిలో ఏరోజు ఎటువైపు వెళ్తుందో నీకు ముందే సమాచారాన్ని అందిస్తాను. నువ్వు అటు దిక్కు రాకుండా వేరే వైపు నీ వేటను కొనసాగించు. కానీ ఒక షరతు! నీకు సాయం చేస్తున్న నా కోసం రోజూ కాస్త మాంసాన్ని మాత్రం ఆహారంగా తీసుకురావాలి’ అని నక్క, వేటగాడితో అంది.

వేటగాడు ఈ ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకొన్నాడు. జిత్తు ప్రతిరోజూ, మృగరాజు ఎటువైపు వెళ్తోందో ముందుగానే వేటగాడికి సమాచారాన్ని చేరవేసేది. వేటగాడు వేటాడిన దాంట్లో కొంత మాంసాన్ని జిత్తుకు ఆహారంగా తీసుకెళ్లేవాడు. ఒకరోజు వేటగాడి వలలో జింక పడింది. దాని మాంసాన్ని, మంత్రి జిత్తు ఆవాసం వద్దకు తీసుకు వెళ్తుండగా జామచెట్టుపై వాలి తీయని పండ్లు తింటున్న చిలుక చూసింది. ఇలా ఎందుకు వస్తున్నాడో తెలుసుకోవడానికి అతన్ని అనుసరించిందది.

వేటగాడు జిత్తు నివాసం ఉండే పొదల దగ్గరకు వెళ్లి నక్కకు ఆ మాంసాన్ని ఇవ్వడం చూసింది చిలుక. తన కనులను తానే నమ్మలేకపోయింది. వేటగాడు మాంసాన్ని ఇస్తూ... ‘మంత్రిగారూ.. మీ మంచితనానికి చాలా ధన్యవాదాలు. మీరు ఏ రోజుకారోజు మృగరాజు సంచారం గురించి ఇస్తున్న సమాచారం వల్లనే, నేను ఏ ప్రాణభయమూ లేకుండా అడవిలో వేట కొనసాగిస్తున్నాను. ఇదిగో తీసుకోండి... మీ భాగం. కడుపునిండా తినండి’ అని వేటగాడు మంత్రి జిత్తుతో చెప్పిన మాటలు విని చిలుక ఆశ్చర్యపోయింది.

వెంటనే సింహం ఉన్న గుహ వద్దకు వెళ్లి వాలింది. ‘మహారాజా! మంత్రి జిత్తు, వేటగాడితో మాట్లాడడం నేను కళ్లారా చూశాను, చెవులారా విన్నాను. మీరు ప్రతిరోజు అరణ్యంలో సంచరిస్తున్నా వేటగాడు మీ కంటికి కనబడటం లేదు. దానికి కారణం నక్కే! అది వేటగాడితో ఒప్పందం కుదుర్చుకొని ప్రతిరోజు మీ కదలికల వివరాలను అతడికి అందిస్తోంది. దీనికి బదులుగా ఆ వేటగాడు మరో వైపున వేటాడి, కాస్త మాంసాన్ని నక్కకు ఇస్తున్నాడు’ అని అసలు విషయాన్ని చెప్పింది చిలుక.

మరుసటి రోజు జిత్తుతో కలిసి సింహం అరణ్యానికి బయలుదేరింది. మధ్యాహ్నం కావస్తుండడంతో సింహం మర్రిచెట్టు కింద అలసిపోయి నిద్రించినట్లు నటించింది.

జిత్తు, కాస్త దూరంగా వేటగాడిని చూసి అతని దగ్గరికి వెళ్లింది. ‘నువ్వేం భయపడకు, మృగరాజు మంచి నిద్రలో ఉంది. అవును ఇంతకీ నీ వేట ఎలా సాగుతోంది?’ అని అడిగింది.

‘మీ దయవల్ల నా వేట బాగానే కొనసాగుతోంది’ అన్నాడు వేటగాడు. ఈ సంభాషణలు విన్న సింహం గర్జిస్తూ ముందుకు వెళ్లింది. ప్రాణ భయంతో వేటగాడు పరుగులు పెట్టాడు. నక్క గజగజ వణుకుతూ అక్కడే నిలబడిపోయింది. ‘మహారాజా మన్నించండి’ అని వేడుకుంది. ‘ద్రోహీ! మంత్రిగా ఉంటూ నాకే నమ్మకద్రోహం చేస్తావా? శత్రువునైనా క్షమిస్తాను కానీ.. మిత్రుడి రూపంలో ఉండి వెన్నుపోటు పొడిచిన నిన్ను క్షమించను’ అని పంజాతో ఒక దెబ్బ వేసింది. దాంతో వెంటనే ప్రాణాలు వదిలింది జిత్తు. తర్వాత మృగరాజు, చిలుకను మంత్రిగా నియమించుకుంది. వేటగాడు ఇంకెప్పుడూ అడవి వైపు వచ్చే సాహసం చేయలేదు. అడవిలోని పక్షులు, జంతువులు చాలా సంతోషించాయి.  

ముక్కామల జానకీరామ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని