మనసులోని మాట!

మహేంద్రగిరి కొండలకు ఆనుకొని ఉన్న అడవికి రాజు సింహాద్రి. దాని పాలనలో అడవిలోని జంతువులు, పక్షులు ఆనందంగా ఉండేవి. సింహాద్రికి పొగడ్తలు అంటే ఇష్టం.

Published : 17 May 2023 00:25 IST

మహేంద్రగిరి కొండలకు ఆనుకొని ఉన్న అడవికి రాజు సింహాద్రి. దాని పాలనలో అడవిలోని జంతువులు, పక్షులు ఆనందంగా ఉండేవి. సింహాద్రికి పొగడ్తలు అంటే ఇష్టం. తన చుట్టూ చేరి పొగడ్తలతో ముంచెత్తే జంతువులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేది. మంత్రి కుందేలుకు రాజు స్వభావం నచ్చేది కాదు. ‘భజన చేసే వారికి పెద్దపీట వేయొద్దు’ అని ఎన్నిసార్లు చెప్పినా.. రాజు వైఖరి మార్చుకోలేదు.
ఒకరోజు వేట నిమిత్తం మహేంద్రగిరి కొండల వైపు వెళ్లింది సింహం. గుహలో ఒక ముని ధ్యానంలో ఉండటాన్ని గమనించింది. అతనికి ఎదురుగా వెళ్లి, కాస్త దూరంగా కూర్చుంది. ముని కళ్లు తెరిచి చూసేసరికి, సింహం కనిపించింది. సింహం నమస్కరించి.. ‘మునివర్యా.. మీకోసం ఈ పండ్లు తీసుకొచ్చా’ అని దారిలో కోసుకొచ్చిన వాటిని అందించింది. ముని వాటిని స్వీకరించి.. ‘మృగరాజా.. ఈరోజు నా ఆకలి తీర్చావు. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో’ అని అడిగాడు.
‘మునివర్యా.. నా గురించి మా అడవిలోని జంతువులు వాటి మనసులో ఏమనుకుంటున్నాయో నాకు తెలియాలి. ఆ వరం ఇవ్వండి చాలు’ అని అడిగిందది. అప్పుడు ముని.. ‘ఇది చాలా ఇబ్బందితో కూడుకున్న వరం. దాంతో నీ మనశ్శాంతి నశించే ప్రమాదం ఉంది. మాట ఇచ్చాను కాబట్టి, ఒక్కరోజు మాత్రమే మీ అడవిలోని జీవుల మనసులో అనుకుంటున్న విషయాలు నీకు తెలుస్తాయి. ఆ ఒక్కరోజు కూడా ఏదన్నది నువ్వే నిర్ణయించుకోవాలి’ అని వరం ఇచ్చాడు. మునికి కృతజ్ఞతలు తెలిపి, తిరిగి తన గుహకు చేరుకుంది సింహం.
మంత్రి కుందేలును పిలిచి.. ‘రేపు అడవిలోని జంతువులకు, పక్షులకు విందు భోజనం ఏర్పాటు చేస్తున్నా. అన్నీ తప్పకుండా వచ్చేలా చూడు’ అంటూ ఆదేశించింది. అందుకు సరేనంటూ.. ‘ఇంతకీ విందు ఏర్పాటుకు కారణం ఏంటి?’ అని అడిగిందది. ‘ప్రత్యేకంగా ఏమీ లేదు. కేవలం నా ఆనందం కోసమే..’ అని జవాబిచ్చింది సింహం. మంత్రి కోతిని పిలిచి.. ‘అడవిలోని జంతువులకు, పక్షులకు మృగరాజు విందు ఏర్పాటు చేశారు. అందరూ రేపు తప్పకుండా రావాలి. అన్ని జీవులకు కబురుపెట్టు’ అని చెప్పింది కుందేలు. మంత్రి చెప్పినట్లే కోతి అడవిలోని జీవులన్నింటికీ సమాచారం ఇచ్చింది. సింహాద్రి కూడా ఆరోజే జంతువులు, పక్షులు తన గురించి వాటి మనసులో అనుకుంటున్న మాటలను తెలుసుకోవాలనుకుంది.
విందు రోజు రానే వచ్చింది. తృప్తిగా తిన్న తర్వాత మంత్రి కుందేలు మనసులో ‘ఈరోజు రాజుగారు అడవి జీవులకు విందు ఏర్పాటు చేయడం చాలా మంచిది. వేసవి కాలంలో జీవులు బయటకు వెళ్లి ఆహారం సేకరించుకోలేకపోతున్నాయి. ఈ విధంగానైనా ఈ ఒక్క రోజు వాటి కష్టాలు తప్పుతాయి’ అని అనుకుంది. మంత్రి మనసులోని మాటలు విని సింహం సంతోషించింది. ఇంతలో ఏనుగు అక్కడికి వచ్చింది. ‘విందు భోజనానికి చక్కని ఏర్పాట్లు చేశారు. మీరు చాలా గొప్పవారు’ అని రాజుతో అంది. కానీ, మనసులో మాత్రం ‘కారణం లేకుండా ఈ విందు ఏంటి? తన గొప్ప చూపించుకోవడానికే మృగరాజు ఇది ఏర్పాటు చేసినట్లు ఉంది. ఎలాగూ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి కదా..’ అని అనుకుంది. ఏనుగు మనసులోని మాట విన్న సింహాద్రికి దాని స్వభావం అర్థమైంది.
తర్వాత నక్క వచ్చింది. ‘మృగరాజా.. విందు ఏర్పాట్లు అద్భుతం. అది మీకే సాధ్యం’ అని పొగిడింది. ఆ మాటలకు సింహం సంతోషించేలోపే.. అది తన మనసులో ‘ఇదే మంచి అదను. మృగరాజును బుట్టలో వేసుకొని, రోజూ సులభంగా ఆహారం సంపాదించుకోవచ్చు. ఎలాగూ పొగడ్తలు అంటే దీనికి మహాఇష్టం’ అని అనుకుంది. నక్క మనసులోని మాటలు విన్న సింహాద్రికి చాలా కోపం వచ్చింది.
ఇంతలో రెండు జింకలు సింహాద్రి దగ్గరకు వచ్చాయి. వాటిని చూసి.. ‘నాతో వీటికి ఎప్పుడూ ముప్పే. నా గురించి  ఇవి మిగతా జీవులకన్నా హీనంగా మాట్లాడతాయి’ అనుకుంది సింహం. ఆ జింకలు బెరుకు బెరుకుగా నమస్కారం చేసి.. ‘మృగరాజా.. మీ మంచి మనసుకు కృతజ్ఞతలు. ఈ వేసవిలో మేం బయటికి వెళ్లి, ఆహారం సంపాదించుకోలేకపోతున్నాం. ఈరోజు మీరు విందు ఏర్పాటు చేయడం మాతోపాటు చాలా జీవులకు సంతోషాన్నిచ్చింది’ అన్నాయి. వాటి మనసులో ‘మృగరాజు చాలా మంచివారు. అడవిలోని అన్ని జీవులకు విందు ఏర్పాటు చేయడం మాటలు కాదు’ అనుకున్నాయి. వాటి మనసులోని మాటను విన్న రాజు చాలా సంతోషించింది.
ఎప్పుడూ తనను పొగడ్తలతో ముంచెత్తే జంతువులు.. పైకి ఒకలా, లోపల మరోలా వ్యవహరిస్తున్నాయని సింహానికి అర్థమైంది. ముని ఈ వరం ఇచ్చేటప్పుడు ‘దీనివల్ల నీ మనసు బాధ పడుతుంది’ అని ఎందుకు అన్నాడో దానికి బోధపడింది. మంత్రి కుందేలు ఎప్పటి నుంచో తనకీ విషయం చెబుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన చెందింది. మరుసటి రోజు నుంచి పొగడ్తలకు పొంగిపోకుండా.. ఎటువంటి ఆపేక్షలు లేకుండా పరిపాలన చేయసాగింది సింహాద్రి. మహారాజులో వచ్చిన మార్పును చూసి మంత్రి కుందేలు సంబరపడింది.  

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని