రాజులో వచ్చిన మార్పు!

విరాటపురానికి చెందిన ధర్మదత్త మహారాజు తన మంత్రితో మంతనాలు జరుపుతూ ‘నేను తీర్చలేని కోరికలు ఏవైనా ఉంటాయా?’ అని అడిగాడు. ‘అలాంటివి ఎందుకు ఉంటాయి ప్రభూ.?’ అన్నాడు మంత్రి. ‘అయితే.. నేను తీర్చలేని కొత్త కోరికలు ఏవైనా ఉంటే చెప్పండి’ అని మళ్లీ అడిగాడు రాజు.

Updated : 21 May 2023 05:09 IST

విరాటపురానికి చెందిన ధర్మదత్త మహారాజు తన మంత్రితో మంతనాలు జరుపుతూ ‘నేను తీర్చలేని కోరికలు ఏవైనా ఉంటాయా?’ అని అడిగాడు. ‘అలాంటివి ఎందుకు ఉంటాయి ప్రభూ.?’ అన్నాడు మంత్రి. ‘అయితే.. నేను తీర్చలేని కొత్త కోరికలు ఏవైనా ఉంటే చెప్పండి’ అని మళ్లీ అడిగాడు రాజు. ‘కోరికల్లో కొత్త, పాత అని ఏం ఉంటాయి ప్రభూ.. ఎవరికి ఏది అవసరమో అదే కోరుకుంటారు.. కాబట్టి అవి వింతగానూ అనిపించవు’ అని జవాబిచ్చాడు మంత్రి. ‘అలా కాదు.. ఏదైనా ఒక వింత కోరిక అంటే అది తీర్చలేనిదై ఉండాలి’ అడిగాడు రాజు. ‘అలాంటివి ఉండవు మహారాజా..’ అని మంత్రి ఎంత వినయంగా చెప్పినా ఆ సమాధానం రాజుకు రుచించలేదు. ‘రేపు రాజ్యమంతా చాటింపు వేయించండి. ఎవరైతే నేను నెరవేర్చలేని కోరిక కోరతారో వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తామని ప్రకటించండి’ అన్నాడు రాజు. మహారాజుకు ఎదురుచెప్పలేక.. సరేనన్నాడు మంత్రి.

ఆ మరుసటి రోజు దండోరా వేయించాడు. ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి కోరికలు కోరడం మొదలు పెట్టారు. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..!’ అన్నట్టుగా అవేవీ రాజు మనసును సమాధాన పరచలేకపోయాయి. ఇంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నాడు. సభలో రాజుకు నమస్కరించి.. ‘ప్రభూ.. నేను కోరే ఈ కోరికను మీరు తీర్చలేరు’ అన్నాడు. ‘నాకు కూడా కావాల్సింది అదే.. ఆలస్యం చేయకుండా అదేంటో చెప్పు..’ కుతూహలంగా అడిగాడు రాజు. ‘మీరు నెరవేర్చలేనిది మీకు చెప్పడం భావ్యం కాదు ప్రభూ..’ అని తెలివిగా జవాబిచ్చాడా యువకుడు. ‘మరేం భయం లేదు.. నువ్వు ఏం కోరుకున్నా నేను నెరవేరుస్తాను’ అని భరోసానిస్తూ.. ‘నా మాటనే ధిక్కరిస్తున్నావు.. నువ్వు చెప్పిన కోరికను నేను నెరవేరిస్తే, నీకు దండన ఉంటుందనే విషయం మర్చిపోకు..’ అని హెచ్చరించాడు రాజు. ‘చిత్తం మహారాజా...’ అంటూ అందుకు అంగీకారం తెలిపాడతను.

ఇక కోరిక కోరుకోమన్నాడు రాజు. ‘ప్రభూ.. మీరు ఒక రోజు పాటు సభలోని గోడకు ఉన్న రాజ్య చిత్రపటాన్నే చూస్తుండాలి’ అన్నాడా యువకుడు. దానికి పగలబడి నవ్విన రాజు.. ‘ఓస్‌.. అదెంత పని.. మొదట అది చేసి చూపించి, ఆ తర్వాత నీతో మాట్లాడతా’ అంటూ మంత్రి సమక్షంలోనే ఆ పటాన్ని చూడటం ప్రారంభించాడు. అలా ఆరోజు మొత్తం అలాగే చూస్తూ గడిపిన రాజు.. మరుసటి రోజు మళ్లీ సభలో కొలువుదీరాడు. ఆరోజు అంతఃపురంలోనే ఉన్న ఆ యువకుడితో ‘నువ్వు ఇంత చిన్న కోరిక కోరి తప్పు చేశావు. నీకు కారాగార వాసం తప్పదు’ అన్నాడు రాజు. ‘అయ్యా.. మీరు వేసే శిక్షకు నేను కట్టుబడి ఉంటాను. అంతకు ముందు మీరు అనుమతిస్తే నాదొక మాట’ అని అన్నాడతను. చెప్పమన్నట్లు సైగ చేశాడు రాజు.

‘ఎవరికైనా అత్యంత విలువైనది సమయం. మనుషులకు అయితే మరీనూ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మానవ జన్మకు సార్థకత ఉండదు. గడిచిన కాలం తిరిగి రాదు. ఇంతమంది ప్రజల బాగోగులు చూడాల్సిన మీకు ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. ఆ సమయాన్ని పల్లెల అభివృద్ధికి ఉపయోగిస్తే.. ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి. అంతేకానీ, ఇలా నిరుపయోగ పనులకు కేటాయించడం బాధనిపించింది. అందుకే నాకు శిక్ష పడినా ఫర్వాలేదు కానీ మీరు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో మీకు తెలియజెప్పాలనుకున్నాను’ అన్నాడా యువకుడు.

ఆ మాటలతో తన తప్పేంటో మహారాజుకు తెలిసొచ్చింది. తన అనాలోచిత పనికి లోలోపలే బాధపడ్డాడు. ఆ యువకుడిని తన ఆస్థానంలో ఉద్యోగిగా నియమించాడు. ‘మేమంతా చెప్పలేని విషయాన్ని, ఇంత ధైర్యంగా రాజుకు చెప్పినందుకు అభినందనలు’ అంటూ ప్రశంసించాడు మంత్రి.  

 సింగంపల్లి శేష సాయి కుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని