భలే కుందేలు!

పాంచాల అనే అడవికి అధిపతి అనే సింహం రాజుగా ఉంటోంది. ప్రతి పదిరోజులకూ అడవిలో నివసించే జీవులన్నింటికీ సమావేశం నిర్వహించడం దానికి అలవాటు.

Updated : 22 May 2023 03:49 IST

పాంచాల అనే అడవికి అధిపతి అనే సింహం రాజుగా ఉంటోంది. ప్రతి పదిరోజులకూ అడవిలో నివసించే జీవులన్నింటికీ సమావేశం నిర్వహించడం దానికి అలవాటు. అయితే ఈసారి అయిదు రోజులకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అందరూ తప్పనిసరిగా రావాలని, తన ప్రధాన అనుచరుడైన కాకితో కబురు పెట్టింది. ఏనుగు, జింక, కుందేలు, తోడేలు, నక్క, మొదలైన జంతువులు చిలుక, పావురం, నెమలి వంటి పక్షులన్నీ ఆ సమావేశానికి వచ్చాయి.

‘అత్యవసర సమావేశం ఎందుకంటావు?’ అని ఏనుగు, జింకనడిగింది. ‘తెలియదు, మిత్రమా’ అని జింక అంది. ‘హుష్‌! మాటలాపండి. అధిపతి వచ్చింది’ అని నక్క అప్రమత్తం చేసింది. దీంతో మాటలాపి అన్నీ, సింహాసనంపై కూర్చున్న అధిపతి వైపు చూశాయి. ‘ఈ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే?..’ అని సింహం అందో లేదో... ‘ఎందుకు మహారాజా?’ అని కుందేలు అడిగింది. ‘కంగారు పడకు. విషయం పూర్తిగా చెప్పాక, నీకే అంతా అర్థమవుతుంది’ అంది మృగరాజు. దీంతో కుందేలు మాట్లాడకుండా మౌనంగా ఉంది.

‘పరపతీ!’ అంటూ సింహం తన బిడ్డను పిలిచింది. గుహలో నుంచి బుజ్జి సింహం బయటకు వచ్చి, అధిపతి పక్కన చేరింది. అధిపతి అన్ని జీవులను తేరిపారా చూసి, ‘ఈ పరపతి నా బిడ్డ అని మీకు తెలుసు కదా!’ అని అడిగింది.

‘తెలుసు, మృగరాజా!’ అని ఏనుగు, కుందేలు, నక్కతో సహా అన్ని జీవులూ అన్నాయి. నిన్న మధ్యాహ్నం పరపతి ఆడుకోవడానికి బయటకు వెళతానని నాతో అంది. ‘వేసవి.. ఎండలు మండుతున్నాయి. సాయంత్రం వెళ్లమని చెప్పాను. నా మాట విన్న నా బిడ్డ సాయంత్రం ఆడుకోవడానికి ఆనందంగా వెళ్లింది. కానీ ఇంటికి బాధగా తిరిగి వచ్చింది.

‘నిన్ను ఎవరు బాధ పెట్టారని అడిగితే చెప్పడం లేదు. అందుకే అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశాను. నేను ఈ అడవికి రాజును. పరపతి నిన్న ఎవరెవరి ఇంటికి వెళ్లింది. నా బిడ్డను ఎవరు బాధ పెట్టారు. నాకు చెప్పాలి. చెప్పి తీరాలి’ అంటూ జీవుల వంక కోపంగా చూసింది.

ముందుగా ఏనుగు లేచింది. ‘పరపతి నిన్న మా ఇంటికి వచ్చింది. రాజు బిడ్డ వచ్చిందని ఆదరించాను. అన్ని మర్యాదలూ చేశాను. నా బిడ్డ గున్న ఏనుగుతో కాసేపు ఆడుకుంది. తిరిగి ఆనందంగా వెళ్లింది’ అని చెప్పింది.

‘ఇదంతా నిజమే’ అంది పరపతి. తర్వాత జింక లేచింది. ‘పరపతి మా ఇంటికి కూడా వచ్చింది. గౌరవంగా చూశాను. నా పిల్లతో ఆడుకోమని చెప్పాను. ఆడుకుంది. ఆనందంగా వెళ్లింది’ అని చెప్పింది.

‘జింక చెప్పింది కూడా నిజమే. నన్ను బాగా చూసింది’ అని పరపతి బదులిచ్చింది. ఆపై తోడేలు లేచింది. ‘నా ఇంటికి కూడా ఆనందంగా వచ్చింది. నా పిల్లతో ఆడుకుంది. ఆనందంగా వెళ్లింది’ అని అంది. ‘తోడేలు చెప్పింది కూడా నిజమే’ పరపతి సమర్థింపుగా అంది.

‘చివరిగా ఎవరింటికి వెళ్లావు?’ అధిపతి, పరపతిని అడిగింది. ‘వాళ్లు ఇక్కడే ఉన్నారు. మర్యాదగా లేస్తే సరి’ అని పరపతి కుందేలు వైపు చూస్తూ అంది. కుందేలు లేచింది
‘‘మృగరాజా! మా ఇంటికి పరపతి వచ్చింది. కానీ మా చిట్టి కుందేలుకు సుస్తీ చేసింది. వైద్యుడైన కోతి ఇచ్చిన మందు వేయడంతో పడుకుంది. పరపతికి అదే విషయం చెప్పాను. ‘నేను రాజు బిడ్డను. నేను రమ్మంటే.. ఎలా ఉన్నా సరే రావాల్సిందే’ అంది. నేను వీలు కాదని, చిట్టిని ఆడుకోవడానికి పంపడం కుదరదని చెప్పాను. నా చిట్టి అనారోగ్యంతో బాధ పడుతోందని చెప్పడం, పరపతిని బాధ పెట్టడమా?! మృగరాజా, నిజం చెప్పడం నేరమా?!’ అని కుందేలు ధైర్యంగా అంది. పరపతి కుందేలు వంక కోపంగా చూసింది.

‘నువ్వు లేచి ఇక్కడకు రా!’ అని మృగరాజు గట్టిగా పిలవడంతో కుందేలు అధిపతి వద్దకు వెళ్లింది. ‘కుందేలుకు శిక్ష తప్పదు’ అని ఏనుగు, జింక, తోడేలు అనుకున్నాయి. అప్పుడే కాకి తెచ్చిన పూల దండను అధిపతి, కుందేలు మెడలో వేసింది. పరపతితో సహా మృగరాజు చేసిన పని చూసి జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. మృగరాజు అందరి వంకా చూస్తూ.... ‘ఆశ్చర్య పడకండి. సింహం బిడ్డ సింహం అవుతుంది. కానీ రాజు బిడ్డ రాజు కాలేదు. రాజ పదవి అనేది వారసత్వం కాదు. మన గుణం, బలం గొప్పవైతే రాజవుతాం. పరపతికి తెలియకుండా అనుసరించమని కాకిని కూడా పంపించాను. అది నాకన్నీ చెప్పింది. రాజ బిడ్డను అందరి బిడ్డల్లా సమానంగా ఆదరించండి. అతిగా మర్యాద చేస్తే దానికి తెలియకుండా అహంకారం వస్తుంది. అది పురోగతికి అవరోధం. పరపతీ! ఇప్పటికైనా నీ తప్పు తెలిసిందా?’ అని మృగరాజు తన బిడ్డను అడిగింది.

తండ్రి చెప్పిన మాటల ద్వారా పరపతిలో పశ్చాత్తాపం మొదలైంది. కుందేలు వద్దకు వెళ్లి మన్నించమని అడిగింది. పరపతిలో మార్పు చూసి కుందేలు, మృగరాజుతో సహా అన్ని జంతువులూ ఎంతో ఆనందించాయి. పరపతిని మెచ్చుకోలుగా చూశాయి.  

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని