అది స్వార్థం... ఇది మోసం!

కొసల రాజ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తమ ఊరికి బయల్దేరారు చిన్ననాటి స్నేహితులైన శివం, సుందరం. ఇద్దరికీ కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువ.

Updated : 23 May 2023 05:04 IST

కొసల రాజ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తమ ఊరికి బయల్దేరారు చిన్ననాటి స్నేహితులైన శివం, సుందరం. ఇద్దరికీ కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. వాళ్లిద్దరూ రామాపురం మీదుగా వెళుతుండగా ఇద్దరు రైతుల మధ్య తగాదా చూశారు. కారణమేంటని అక్కడివారిని అడిగితే జరిగింది చెప్పారు. ‘అది రైతులు సోమయ్య, భీమయ్యల మధ్య గొడవ. సోమయ్య పొలంలో నాటడానికి విత్తనాలు ఇస్తానని కొన్ని రోజుల ముందు భీమయ్య చెప్పాడు. కానీ ముందుగా డబ్బేమీ పుచ్చుకోలేదు. తీరా ఇప్పుడు సోమయ్య విత్తనాలు అడిగితే తన దగ్గర లేవన్నాడు భీమయ్య’ అతడినే నమ్ముకున్న సోమయ్యకు కోపమొచ్చింది. భీమయ్య తనకు నమ్మకద్రోహం చేశాడని తిట్టాడు. ‘అలాంటిదేమీ లేదని, విత్తనాలు మిగల్లేదని’ చెప్పాడు భీమయ్య. తమకిస్తానన్న విత్తనాలను ఎవరికో ఎక్కువ డబ్బుకు అమ్ముకోవడం చూశానని సోమయ్య కోడలు చెప్పింది. వాగ్దానం చేసినట్లుగా తనకు విత్తనాలు ఇవ్వక పోవడం వల్ల నష్టపోయానని, మోసగాడైన భీమయ్య మీద న్యాయాధికారికి ఫిర్యాదు చేయడానికి సోమయ్య సిద్ధమయ్యాడు.

అక్కడి నుంచి శివం, సుందరం ముందుకు వెళుతుండగా.. మరో చోట కొందరు జనం గుమిగూడి ఉన్నారు. అక్కడేం జరిగిందో చెప్పమని జనాన్ని అడిగాడు శివం. వాళ్లు.. ‘ఇది ఇద్దరు వ్యాపారుల మధ్య తగాదా. పది బస్తాల పెసలు తన దగ్గర తీసుకుని అందుకు సరిపడా జీడిపప్పు ఇస్తానన్నాడని, ఇప్పుడు సరకు ఇమ్మంటే ఇవ్వడం లేదని మొదటి వ్యాపారి చెబుతున్నాడు. తన కొట్లో జీడిపప్పు నిల్వ లేదనీ, అంగడిలో ధర తగ్గగానే కొంటాననీ రెండో వ్యాపారి చెబుతున్నాడు. పెసలు తీసుకెళ్లేటప్పుడే జీడిపప్పు సిద్ధంగా లేదని చెబితే బాగుండేదనీ, అప్పుడు పెసలు ఇచ్చేవాడిని కాదని మొదటి వ్యాపారి వాదిస్తున్నాడు. తనను మోసం చేసినందుకు న్యాయాధికారికి ఫిర్యాదు చేయడానికి ఆ వ్యాపారి వెళుతున్నాడు’ అని చెప్పారు.

శివం, సుందరానికి ఈ వివాదాలను న్యాయాధికారి ఎలా పరిష్కరిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. గ్రామస్థులతో పాటే వాళ్లూ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. ముందుగా రైతుల వివాదం విన్నాడు న్యాయాధికారి. ‘చెప్పినట్టుగా విత్తనాలు ఇవ్వకపోయినంత మాత్రాన భీమయ్య మోసం చేసినట్లు కాదని, అతడు మానవత్వం విడిచి స్వార్థంతో ప్రవర్తించాడు’ అని తీర్పు చెప్పాడు. దీంతో ఏకీభవించలేదు సోమయ్య. ఇంకా ఏదో చెప్పబోయాడు. అతణ్ని కాసేపు ఆగమని చెప్పి రెండో వివాదం గురించి అడిగి తెలుసుకున్నాడు న్యాయాధికారి.
వ్యాపారులు చెప్పింది పూర్తిగా విన్న తరువాత... ‘మొదటి వ్యాపారి అభియోగం మోపినట్టుగా, రెండో వ్యాపారి జీడిపప్పు ఇవ్వకపోవడం మోసమే అనీ, అందుకు శిక్ష లేదా జరిమానా విధిస్తాను’ అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ‘రైతులకు ఇచ్చిన తీర్పే తమకూ ఇవ్వమని రెండో వ్యాపారి, వ్యాపారులకు ఇచ్చిన తీర్పే తమకూ ఇవ్వమని సోమయ్య ఒకేసారి న్యాయాధికారిని వేడుకున్నారు.

వారి మాటలు విన్న న్యాయాధికారి.. ‘తీర్పు చెప్పేటప్పుడు నేను కొన్ని ధర్మసూక్ష్మాలను పరిగణనలోకి తీసుకుంటాను. విత్తనాలు ఇస్తానని మాత్రమే సోమయ్యకు వాగ్దానం చేశాడు భీమయ్య. కానీ ఎక్కువ నగదుకు ఆశపడి ఇస్తానన్న విత్తనాలు ఇవ్వలేదు. విత్తనాల ధరకు సరిపడే డబ్బును ముందుగా తీసుకోలేదు కాబట్టి భీమయ్యది మోసం కాదు.. కేవలం స్వార్థం. మానవత్వం మరిచిపోయి, ధనం మీద ఆశతో ఇలా ప్రవర్తించిన భీమయ్యను మందలిస్తున్నాను’ అని చెప్పాడు.  

‘తోటి వ్యాపారి దగ్గర నుంచి తనకు కావాల్సిన పెసలు తీసుకున్నాడు మరో వ్యాపారి. తన దగ్గర జీడిపప్పు ఉన్నట్లు అతణ్ని నమ్మించాడు. తీరా సరకు ఇవ్వాల్సి వచ్చేసరికి అంగడిలో ధర తగ్గాక కొంటానన్నాడు. ఆ విధంగా తన దగ్గర లేని జీడిపప్పును ఉన్నట్లు నమ్మించి పెసలు తీసుకోవడం కచ్చితంగా మోసమే. అందుకు రెండో వ్యాపారి శిక్షార్హుడు. అతడికి వేయబోయే శిక్షను కాసేపటిలో ప్రకటిస్తాను’ అన్నాడు న్యాయాధికారి.

ప్రజలంతా తీర్పు విని జేజేలు పలికి న్యాయాధికారిని అభినందించారు. కానీ శివం, సుందరం మాత్రం న్యాయాధికారికి నమస్కరించి, ‘స్వార్థానికి, మోసానికి మధ్యన ఉన్న తేడా చెబితే వినాలని ఉంది’ అని వినయంగా అడిగారు. ‘స్వప్రయోజనం కోసం ఇతరుల ఇబ్బందిని పట్టించుకోకుండా ప్రవర్తించడం స్వార్థం. తనకు లాభం కలగడం కోసం అవతలి వ్యక్తికి కష్టం, నష్టం కలగజేస్తే అది మోసం. నేను విన్న రెండు వివాదాల్లో మొదటిది.. ఒక రైతు, ఎదుటి రైతుకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా విత్తనాలను మరొకరికి అమ్మేయడం స్వార్థం అవుతుంది. తన దగ్గర లేని వస్తువులను ఉన్నట్టు నమ్మించి తోటి వ్యాపారి నుంచి సరకు తీసుకోవడం, తరువాత లేదని చెప్పి కష్టం, నష్టం కలిగించడం కచ్చితంగా మోసమే’ అని వివరించి చెప్పాడు న్యాయాధికారి. తమ ప్రయాణంలో కూడా కొత్త విషయాలు తెలిశాయని సంతోషించారు శివం, సుందరం.  

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు