సాధనతోనే విజయం!

స్కూల్‌ నుంచి రాగానే నేరుగా వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లాడు బంటి. ‘వచ్చేశావా బంటీ.. నీకు ఇష్టమని పునుగులు చేస్తున్నాను.

Updated : 24 May 2023 05:03 IST

స్కూల్‌ నుంచి రాగానే నేరుగా వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లాడు బంటి. ‘వచ్చేశావా బంటీ.. నీకు ఇష్టమని పునుగులు చేస్తున్నాను. బ్యాగ్‌ అల్మారాలో పెట్టేసి, కాళ్లూచేతులూ కడుక్కొని రా..’ అందామె. ‘భలే భలే పునుగులు.. తొందరగా తీసుకురామ్మా’ అంటూ గదిలోకి వెళ్లాడు బంటి. పది నిమిషాల్లో పళ్లెంలో పునుగులు, చట్నీ వేసుకొని టీవీ చూస్తున్న బంటికి ఇచ్చింది. ‘పునుగులు నువ్వు భలే చేస్తావమ్మా!’ అంటూ గబగబా తినసాగాడు. హఠాత్తుగా తినడం ఆపి ‘నేను అసలు విషయం మరచిపోయానమ్మా.. అది చెప్పడానికే రాగానే వంట గదిలోకి వచ్చాను’ అని బంటి అనడంతో.. ‘ఏంటది?’ అని అమ్మ అడిగింది.

‘టీచర్‌ మాకు చిత్రలేఖనం పోటీ పెట్టారు. రేపు ఆదివారం కదా.. సెలవు రోజున మా దృష్టికి వచ్చిన గుండ్రటి ఆకారంలో ఉండే అయిదు వస్తువుల బొమ్మలు వేయడం నేర్చుకొని రమ్మన్నారు.. సోమవారం ఉదయాన్నే క్లాసులో గీయిస్తారట’ చెప్పాడు బంటి. ‘అవునా.. అయితే నువ్వు డ్రాయింగ్‌ బాగా వేస్తావు కాబట్టి నీ మెదడుకి పని చెప్పు. నీ దృష్టికి వచ్చినవాటిని ముందు పేపర్‌ మీద రాసుకో.. తరువాత వాటిని గీయడం ప్రాక్టీస్‌ చేసుకో..’ సూచనలిచ్చిందామె. ‘పునుగు.. ఇది గుడ్రంగా ఉంది. ఈ కుర్చీలో దిండూ గుండ్రంగా ఉంది.. ఇంకా ఇంకా..’ అని చుట్టూ చూస్తూ గుండ్రంగా ఉన్న వస్తువుల పేర్లు చెబుతూ.. పళ్లాన్ని సింక్‌లో పెడుతూ ‘అమ్మా! ఈ ప్లేటు కూడా గుండ్రంగా ఉంది’ అన్నాడు అరుస్తూ.. ‘వెతికితే ఇంకా మంచివి కనిపిస్తాయి. వాటిలో నువ్వు బాగా వేయగలిగినవి ఎంచుకో’ అందామె.

బంటి నాలుగో తరగతి చదువుతున్నాడు. బొమ్మలు చాలా బాగా వేస్తాడు. ఇక ఆ సాయంత్రం నుంచి కనిపించిన ప్రతి వస్తువునూ పరిశీలనగా చూడసాగాడు. అమ్మానాన్నల సలహా కూడా తీసుకున్నాడు. గతేడాది కూడా బంటి చిత్రానికే మొదటి బహుమతి వచ్చింది. సోమవారం ఉదయం చాలా సంతోషంగా బడికి వెళ్లాడు బంటి. ‘పిల్లలూ.. మీలోని ఊహాశక్తికి పదును పెట్టండి.. మీ దృష్టికి వచ్చిన గుండ్రటి ఆకారంలో ఉన్న బొమ్మలను వేయండి’ అని చెప్పారు టీచర్‌. పిల్లలందరూ చకచకా గీయడం ప్రారంభించారు. ‘ఈ చిత్రాలను న్యాయనిర్ణేతలకు పంపిస్తాను. విజేతల పేర్లను రేపు ప్రకటిస్తాను’ అని పిల్లలకు చెప్పారామె. ‘అమ్మా.. నేను చాలా బాగా బొమ్మలు వేశానమ్మా.. మొదటి బహుమతి కచ్చితంగా నాకే వస్తుంది’ అని ఇంట్లోకి అడుగుపెడుతూనే అన్నాడు బంటి.

‘బంటీ.. నువ్వు గెలుస్తావనే నమ్మకం ఉండటాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి కానీ, గర్వం పనికిరాదు. గెలుపు ఏ ఒక్కరి సొంతమూ కాదు. ఓడిపోయినా బాధ పడకుండా.. అందుకు కారణాలను అన్వేషించాలి. ఆ పొరపాట్లు మరోసారి జరగకుండా చూసుకోవాలి’ అంటూ వాళ్లమ్మ వివరించింది. బంటికి ఓడిపోవడం అనే పదం నచ్చలేదు. కానీ, అమ్మ మాటను తీసేయకుండా సరేనన్నట్లు తల ఆడించాడు.
మరుసటి రోజు ఉదయం చిత్రలేఖనం పోటీల విజేతలను టీచర్‌ ప్రకటించారు. ప్రథమ బహుమతి రవికి, ద్వితీయ బహుమతి బంటీకి వచ్చాయి. వారిద్దరికీ బహుమతులు అందించారు. తరగతిలో ఉన్న పిల్లలందరితో చప్పట్లు కూడా కొట్టించారు. రవి ముఖం వెలిగిపోతుంటే, బంటిది మాత్రం మాడిపోయింది. అది టీచర్‌ గమనించారు. ‘పిల్లలూ.. ఇప్పుడు మీరు గీసిన చిత్రాలన్నీ చూపిస్తాను. అప్పుడు బహుమతికి ఎంపికైన వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటో మీకే తెలుస్తుంది. రండి వెళ్దాం!’ అని డ్రాయింగ్‌ రూమ్‌లోకి తీసుకెళ్లారు టీచర్‌.

విద్యార్థులు వేసిన చిత్రాలన్నీ గోడ మీద వరసగా తగిలించి ఉన్నాయి. పిల్లలందరూ ఓపిగ్గా వాటిని చూస్తున్నారు. అందరూ గుండ్రటి ఆకృతిలోని అయిదు రకాల వస్తువులను చాలా చక్కగా గీశారు. కానీ, రవి గీసినవి మాత్రం పుట్టిన రోజు సందర్భంలోనివి. గుండ్రటి టీపాయ్‌ మీద వృత్తాకార కేక్‌, దాని పక్కన పేపర్‌ ప్లేట్స్‌, బెలూన్స్‌, లాలిపాప్స్‌ అందులో కనిపిస్తున్నాయి. బంటితో సహా పిల్లలందరికీ ఆ బొమ్మ భలే నచ్చింది. ‘రవికి ఆ ఊహ ఎలా వచ్చిందా?’ అని ఆశ్చర్యపోయారు.

‘పిల్లలూ! మీ అందరికీ రవి ఆలోచన నచ్చింది కదూ.. న్యాయనిర్ణేతలకు కూడా బాగా నచ్చింది. అందుకే దానికి మొదటి బహుమతి వచ్చింది.. గతేడాది బంటి గెలిచాడు.. ఈసారి రవి.. అంటే.. గెలుపు ఒక్కరి దగ్గరే ఆగిపోదు. అందుకే, ఎప్పుడూ మనకే అన్నీ తెలుసనుకోవద్దు. ఎంత నేర్చుకున్నా.. సాధన చేయడం మాత్రం మానొద్దు. ఓడిపోయామని బాధపడవద్దు.. సరేనా?’ అని టీచర్‌ అనడంతో విద్యార్థులంతా సరేనన్నట్లు తలూపారు. ఆ మాటలు విన్న తర్వాత బంటి మనసు కాస్త తేలిక పడింది. ‘రవీ.. నువ్వు బొమ్మలు చాలా బాగా వేశావు’ అంటూ స్నేహితుడి చెయ్యి పట్టుకొని అభినందించాడు. ‘థాంక్యూ బంటీ.. నువ్వు గీసిన బొమ్మ కూడా చాలా బాగుంది’ అన్నాడు రవి. ‘టీచర్‌.. ఈసారి నేను ఇంకా బాగా సాధన చేస్తాను’ అని అనడంతో.. ‘అలాగే’ అంటూ భుజం తట్టారా టీచర్‌.  

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని