గ్రామం మారింది.. కష్టం తీరింది!

ఆయుర్వేద వైద్యుడు, వాస్తు సిద్ధాంతి అయిన ప్రహ్లాద ఒకరోజు వన మూలికల కోసం అడవికి వెళ్లాడు. ఎంత వెతికినా తనకు కావాల్సిన మూలికలు దొరకలేదు.

Updated : 25 May 2023 06:47 IST

యుర్వేద వైద్యుడు, వాస్తు సిద్ధాంతి అయిన ప్రహ్లాద ఒకరోజు వన మూలికల కోసం అడవికి వెళ్లాడు. ఎంత వెతికినా తనకు కావాల్సిన మూలికలు దొరకలేదు. అడవి లోపలికి వెళ్తే దొరుకుతాయని భావించి మరింత దూరం నడిచాడు. ఒక గుబురు పొదలో తనకు కావాల్సిన మూలికలు దొరకడంతో ఆనందంతో వాటిని సేకరించాడు.
కానీ, అప్పటికే సూర్యుడు నడి నెత్తి మీదకు చేరాడు. బాగా ఆకలేసింది. దాహం కూడా వేసింది. ఎంత వెతికినా ఒక్క చుక్క నీటిబొట్టు కూడా దరిదాపుల్లో కనిపించలేదు. పిడచ కట్టుకుపోయిన నాలుకతోనే చిన్నగా నడుస్తూ ఇంటికి బయలుదేరాడు. అయితే తను వచ్చిన దారి మరిచిపోయి, మరో తోవలో వెళ్లాడు.

కొద్దిదూరం నడిచాక కానీ తాను దారి తప్పిన విషయం గుర్తించలేకపోయాడు. ఒక్కసారిగా తనలో భయం మొదలైంది. దానికి తోడు, ఆహారం కూడా లేకపోవడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. తేనె కోసం అడవికి వచ్చిన కొందరు ప్రహ్లాదను చూశారు. పరీక్షించి, ప్రాణాలతో ఉండటంతో తమ గ్రామానికి తీసుకువెళ్లారు. సపర్యలు చేయడంతో అతడికి మెలకువ వచ్చింది. తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. గ్రామస్థులు ఇచ్చిన ఆహారాన్ని తృప్తిగా తిని, సేదతీరాడు.

కాస్త తేరుకున్నాక, ఊరికి ఏమైనా చేయాలనిపించింది ప్రహ్లాదకు. ఊరు చూస్తానని వారిని కోరాడు. ‘అయ్యా... మా ఊరిలో ఏముంది చూడటానికి? శిథిలమైన రాజభవనం, కొండ తప్పితే. ఇక్కడ ఎవ్వరికీ సరైన పని దొరకదు. కనీసం నోట్లోకి వేళ్లు పోయేంత ఆదాయం కూడా లేదు’ అని బాధపడ్డారు.

అయినా ఊరంతా తిరిగి రావాలని పట్టుబట్టాడు ప్రహ్లాద. గ్రామంలో కనీసం యాభై ఇళ్లు కూడా లేవు. జీవనోపాధి లేక చాలా మంది ఇతర గ్రామాలకు వలస వెళ్లినట్లు తెలుసుకున్నాడు. అంతా తిరిగాక.... ‘ఈ ఊరికి మహర్దశ తెప్పిద్దాం’ అన్నాడు. ‘అదెలా సాధ్యం?’ అని ప్రశ్నించారు గ్రామస్థులు. ఊరి చిత్రాన్ని ఒక గోడ మీద గీయించాడు. ప్రతి వీధినీ, కొండల్ని, చెట్టూపుట్టల్ని క్షుణ్నంగా పరిశీలించాడు.

ఊర్లోని వారినందరినీ గుంపుగా చేర్చి.. ‘మీరు కాస్త కష్టపడితే ఇక్కడ బంగారం పండుతుంది’ అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ‘మీ గ్రామం ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. మీరు ప్రయత్నిస్తే ఈ ఊరిని పర్యాటక కేంద్రంగా మార్చుకోవచ్చు’ అన్నాడు. ‘దానికి మేము ఏం చేయాలి?’ అని వారు ఆసక్తిగా ప్రశ్నించారు. ‘కొండను కొంచెం తొలిచి కొన్ని గదుల్లా నిర్మించండి. ఎవరికైనా ఒక్కసారి వాటిలోకి అడుగుపెడితే రాతి యుగంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అలాగే కళావిహీనమైన రాజభవనానికి చిన్నచిన్న మరమ్మతులు చేసి కళ తెప్పించండి. రాజ భవనంలోని వందల సంవత్సరాల నాటి కళాకృతుల బూజు దులపండి. కొలనును శుద్ధి చేయించండి. ఈ భవనం ప్రయాణికులను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తయారవుతుంది. రాజభవనం చుట్టూ ఉండే చెట్లను అలాగే వదిలేస్తే అడవిలాగా కనిపిస్తుంది. వాటిని ఒక క్రమపద్ధతిలో పెంచితే ఉద్యానవనమవుతుంది. దాని మధ్యలో స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించండి’ అని సలహా ఇచ్చాడు.

‘ఇవన్నీ చేస్తే, నిజంగా మా కడుపులు నిండుతాయా?’ అని గ్రామస్థులు ప్రశ్నించారు. ‘ప్రయత్నించండి. విత్తనాలు నాటితే కదా, మొక్కలు మొలిచేదీ, లేనిదీ తెలిసేది...!’ అని బదులిచ్చాడు. తర్వాత ప్రహ్లాద.. ఆడవాళ్ల వైపు తిరిగి.. ‘నేను మీ వంటలు తిన్నాను. చాలా రుచిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మీ చేతుల్తో వంటలు చేసి పెట్టండి’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు.

అయిదు సంవత్సరాల తర్వాత ప్రహ్లాద, ఆ ఊరు ఎలా ఉందో... చూద్దామని వెళ్లాడు. అక్కడ గుడిసెల స్థానంలో పెద్దపెద్ద భవంతులు కనిపించాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో సందడిగా ఉంది. ఆ రాజభవనం గురించి కొందరు యువకులు కథలుకథలుగా పర్యాటకులకు చెబుతున్నారు.

ప్రహ్లాదను గుర్తించిన గ్రామస్థులు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ‘మేము ఇక్కడే పుట్టి పెరిగినా.. మాకు ఈ ఆలోచన రాలేదు. మీకెలా సాధ్యమైంది’ అని వాళ్లు ప్రహ్లాదను అడిగారు. ‘మనం రోజూ చూసేవి మన కళ్లకు సాదాసీదాగా కనిపిస్తాయి. వాటి ప్రత్యేకత, విలువ, గొప్పతనాన్ని మనం పెద్దగా గుర్తించం. అందుకే మీరు వాటిని పట్టించుకోలేదు. కొత్తగా ఈ ఊరికి వచ్చిన నాకు మీ ఊరిలో ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయనిపించింది. అందుకే మీకు ఆ సలహాలు ఇచ్చాను’ అన్నాడు ప్రహ్లాద. ‘నిజమే... దేన్నీ తక్కువగా తీసి వేయకూడదు, కొత్తగా ఆలోచించాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం’ అని గ్రామస్థులు తెలుసుకున్నారు.

ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని