చిరుకప్ప గర్వం!

అనగనగా ఒక అడవి. దానికి సింహం రాజు. అది నడిచివస్తుంటే చిన్న జంతువులన్నీ తలో దిక్కుకు పారిపోయేవి. ఒకవేళ పొరపాటున ఎదురుపడినా, వెంటనే అడ్డు తప్పుకుని.. దానికి దండం పెట్టేవి.

Updated : 30 May 2023 05:01 IST

నగనగా ఒక అడవి. దానికి సింహం రాజు. అది నడిచివస్తుంటే చిన్న జంతువులన్నీ తలో దిక్కుకు పారిపోయేవి. ఒకవేళ పొరపాటున ఎదురుపడినా, వెంటనే అడ్డు తప్పుకుని.. దానికి దండం పెట్టేవి. ఒక సాయంత్రం ఆ సింహం విహారానికి బయలుదేరింది. అది చూసిన జంతువులన్నీ ఆ దారి నుంచి దూరంగా వెళ్లిపోయాయి. కొన్నేమో పొదల్లో దాక్కున్నాయి.

కానీ ఇదంతా పట్టించుకోని ఒక చిరుకప్ప మాత్రం చెంగు చెంగున గెంతుతూ.. దారికి అడ్డంగా తిరుగుతోంది. అది చూసిన ఒక ఎండ్రకాయ... ‘కప్ప మిత్రమా! నీకు అడవికి రాజు అయిన సింహం రావడం కనిపించడం లేదా ఏమిటి? నీ కుప్పిగంతులు ఆపి ఎక్కడైనా దాక్కో, లేదంటే ప్రాణాలు దక్కవు’ అని హితవు పలికింది.

దానికి కప్ప... ‘అడవికి రాజైతే నాకేంటి? నేను ఇలాగే గెంతులు వేస్తాను’ అంటూ చెంగు చెంగున ఎగరసాగింది. సింహం అక్కడకు రానే వచ్చింది. తనకు ఏమాత్రం భయపడకుండా గెంతుతున్న ఆ చిరుకప్పను చూసింది.

ఉరుములా గర్జిస్తూ... ‘ఏయ్‌ కప్పా! నీ గెంతులు ఆపు. లేకపోతే, నిన్ను చంపేస్తాను’ అంది సింహం. ‘ఏంటీ.. నన్ను నువ్వు చంపుతావా! అది నీవల్ల కాదు...! వెళ్లు... వెళ్లు! నీ ప్రతాపం మరో జంతువు మీద చూపించు’ అంటూ నవ్వింది.

అస్సలు భయపడకుండా, ఆ చిరుకప్ప సింహం చుట్టూ గెంతసాగింది. సింహం తన పంజా ఆ కప్ప మీదకు విసరగా.. అది తప్పించుకుని, వెనకకు దూకింది. అలా సింహానికి చిక్కకుండా ముందుకూ వెనుకకు, ఇటుపక్కకు, అటుపక్కకు గెంతింది.

దీంతో విసుగొచ్చిన సింహం... ‘నేను అడవికి రాజైనా ఈ కప్పను ఏమీ చేయలేక పోతున్నానే! అయినా ఈ చిరుజీవితో నాకేంటి?’ అని మనసులో అనుకుంది. కాసేపటికి అక్కడి నుంచి సింహం తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ పరిణామంతో కప్ప ఉబ్బితబ్బిబ్బయింది.

‘చూశారా! నేనెంతో పరాక్రమవంతురాలిని. అడవికి రాజైన సింహం కూడా నన్ను ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ఓడిపోయి పారిపోయింది. ఇప్పటి నుంచి, ఇక నేనే ఈ అడవికి రాజును’ అని గర్వంతో విర్రవీగింది. ఆ ప్రదేశమంతా గెంతసాగింది.

ఎండ్రకాయ దగ్గరకు వచ్చి... ‘ఏం మిత్రమా! ఇంకా ఆ రాయి కింద దాక్కున్నావెందుకు? బయటకురా! ఆ సింహాన్ని ఎదిరించి పోరాడాను. దెబ్బకు అది నాకు భయపడి పారిపోయింది’ అంది పెద్దగా నవ్వుతూ చిరుకప్ప.

ఎండ్రకాయ బయటకు వచ్చి... ‘ఆ సింహం నీకు భయపడి ఏమీ పోలేదు. మనలాంటి చిరుజీవులపై అది తన ప్రతాపం చూపదు. అయినా నీకు అంత గర్వం పనికిరాదు. నోరు అదుపులో పెట్టుకో... లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే!’ అంది.

అప్పటి వరకూ సింహానికి భయపడి దాక్కున్న ఒక పాము పుట్టలోంచి తల బయటకు పెట్టింది. చిరుకప్ప పెద్ద పెద్ద మాటలకు విసుగు చెందింది. కప్ప కన్నూమిన్నూ కానక పిచ్చిదానిలా గెంతుతూ పుట్ట దగ్గరగా వెళ్లింది.  

పామును చూసి... ‘ఏంటి సర్పమా! నువ్వూ సింహానికి భయపడి పుట్టలోకి దూరావే...! ఇంత పొడవున్నావు. నాలాగా ధైర్యంగా సింహాన్ని ఎదిరించలేవా?’ అంది.
చిరుకప్ప మాటలు పాముకు కోపం తెప్పించాయి. ‘కప్పా! సింహాన్ని ఎదిరించాను అన్న భ్రమలో ఏకంగా నా ముందుకే వచ్చావా...! ఇతర జంతువులు ఏవైనా రాజుగా ఉంటానని పోరాటానికి వస్తే సింహం తన ప్రాణాలు వదిలేస్తుందేమో కానీ, తన తల వంచనే వంచదు. కేవలం ఆహారం కోసమే కాదు, ఏ జీవైనా తన రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చినా చంపేస్తుంది. అడవిని కన్న బిడ్డలా కాపాడుకుంటుంది. అది మనకు రాజు. అందుకే మృగరాజును అడవంతా గౌరవిస్తుంది’ అంది పాము.
కానీ చిరుకప్పకు ఆ మాటలు చెవికెక్కలేదు. పైగా ‘నువ్వు నిజంగానే సింహానికి భయపడి పుట్టలోకి దూరావు. నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానో’ అంటూ పామును హేళన చేస్తూ గెంతుకుంటూ వెళ్లసాగింది.

దాంతో పాముకు కోపం మరింత ఎక్కువైంది. వెంటనే చిరుకప్పను నోట కరిచి గుటుక్కున మింగేసి, పుట్టలోకి వెళ్లిపోయింది. చిరుకప్పకు పట్టిన దుస్థితిని చూసి ఎండ్రకాయ జాలిపడింది. తర్వాత కాసేపటికి అది కూడా తన దారిన తాను వెళ్లిపోయింది.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని