మృగరాజు ఎంపిక!

అలవాటులో భాగంగా తెల్లవారుజామునే నిద్ర లేచింది మృగరాజు. గుహ నుంచి బయటకు వచ్చి, చుట్టూ చూసింది. ఏ అలికిడీ లేకపోవడంతో అడవంతా ఒకసారి తిరిగి చూడాలనుకుంది. అనుకున్నదే తడవుగా నెమ్మదిగా నడక మొదలు పెట్టింది. కొంత దూరం వెళ్లగానే.. గుర్రు పెట్టి నిద్రపోతున్న తోడేలు కనిపించింది.

Updated : 31 May 2023 05:32 IST

అలవాటులో భాగంగా తెల్లవారుజామునే నిద్ర లేచింది మృగరాజు. గుహ నుంచి బయటకు వచ్చి, చుట్టూ చూసింది. ఏ అలికిడీ లేకపోవడంతో అడవంతా ఒకసారి తిరిగి చూడాలనుకుంది. అనుకున్నదే తడవుగా నెమ్మదిగా నడక మొదలు పెట్టింది. కొంత దూరం వెళ్లగానే.. గుర్రు పెట్టి నిద్రపోతున్న తోడేలు కనిపించింది. దాని దగ్గరగా వెళ్లి గర్జించింది. ఆ దెబ్బతో తోడేలు ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఎదురుగా సింహాన్ని చూసి.. ‘మృగరాజా.. ఎప్పుడొచ్చారు?’ అని అడిగింది. ‘వెలుగుతోపాటే నేనూ వచ్చాను. ఇంత పొద్దెక్కినా ఇంకా మొద్దు నిద్ర ఏంటి? సాయంత్రం నా గుహ వద్దకు రా.. నీతో మాట్లాడాలి’ అంది సింహం. ‘నన్ను శిక్షిస్తారా మృగరాజా?’ భయంగా అడిగింది తోడేలు. ‘అక్కడే చెబుతాను.. రావడం మరచిపోవద్దు’ అంటూ సింహం ముందుకు కదిలింది.

మరికొంత దూరం వెళ్లిన సింహానికి.. నిద్రపోతున్న నక్క కనిపించింది. ‘నక్కా.. బద్దకమే మన శత్రువని తెలుసుకో’ అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడి లేచింది. అది చేతులు జోడించి.. ‘మృగరాజా.. రాత్రి కాస్త ఆలస్యంగా నిద్రపోయాను. అందుకే ఉదయం మెలకువ రాలేదు’ అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది. ‘సమయానికి నిద్రపోవడం, సమయానికి నిద్ర లేవడమే సమయపాలన’ అంది సింహం. ‘అలాగే మృగరాజా.. ఇకపై సమయపాలన పాటిస్తాను’ అని భయంభయంగా సమాధానమిచ్చింది నక్క. ‘సాయంత్రం గుహ వద్దకు రా.. నీతో మాట్లాడాలి’ అని తోడేలుకు చెప్పినట్టుగానే నక్కతోనూ అంది సింహం. ‘మీ మాట వింటానని చెప్పాను. అయినా ఇంకా ఎందుకు రమ్మంటున్నారు మృగరాజా..?’ అంటూ కాస్త ఆందోళనగా అడిగింది నక్క. ‘ఇక్కడ కాదు.. విషయమేంటో అక్కడే చెబుతాను’ అంటూ సింహం ముందుకు కదిలింది.

ఇంకొంత దూరం వెళ్లేసరికి ఏనుగు కనిపించింది. ముందురోజు వచ్చిన భారీ గాలివానకు విరిగిపడిన చెట్ల కొమ్మలను ఏనుగు తన తొండంతో తీసి ఒక పక్కగా కుప్ప చేస్తుండటాన్ని సింహం గమనించింది. ‘ఎందుకలా చేస్తున్నావు?’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది. బాటకు అడ్డంగా పడిపోయిన కొమ్మలను తీయకపోతే, మనలాంటి జంతువులు ఇబ్బంది పడతాయి. వీటివల్ల వేటగాళ్లకు కూడా దొరికిపోయే ప్రమాదం ఉంది’ అని జవాబిచ్చిందది. ‘సరే.. సాయంత్రం నా గుహ వద్దకు రా.. నీతో మాట్లాడాలి’ అని ఏనుగుకూ చెప్పింది సింహం. ఇంకొంచెం ముందుకు వెళ్లిన సింహానికి.. దారిలో ఇంకా నిద్రపోతూనే ఉన్న జింక, ఎలుగుబంటి తదితర జంతువులు కనిపించాయి. వాటిని కూడా నిద్ర లేపి.. సాయంత్రం గుహ వద్దకు రమ్మని చెప్పింది.

మృగరాజు ఆదేశం ప్రకారం.. సాయంత్రం గుహ వద్దకు వచ్చిన తోడేలు, నక్క, ఏనుగు, జింక, ఎలుగుబంటి తదితర జంతువులన్నింటినీ ఒకసారి పరిశీలనగా చూసి చిన్నగా నవ్వింది. సింహం నవ్వడంతో కొంచెం ధైర్యం తెచ్చుకున్న నక్క.. ‘మృగరాజా.. మీరెందుకు పిలిచారో తెలియక ఆందోళనకు గురవుతున్నాం. మేము చేసిన తప్పేమిటో తెలియడం లేదు’ అంది. ‘నిజమే మృగరాజా..’ అంటూ తోడేలు కూడా నక్క మాటకు వంత పాడింది. ‘తప్పు చేసిన వాళ్లే భయపడతారు. మీకెందుకు భయం?’ అంటూ ప్రశ్నించింది సింహం. ‘ఉదయం మీరు మా వద్దకు వచ్చే వరకూ మేం నిద్రలోనే ఉన్నాం. అది మా తప్పే’ అంది జింక. ‘మీ తప్పు మీరు తెలుసుకున్నారు.. సంతోషం.. అయితే మీ అందర్నీ పిలవడానికి మరో కారణం కూడా ఉంది’ అని సింహం అనడంతో అవన్నీ ఉలిక్కిపడ్డాయి. ‘కారణం చెప్పండి మృగరాజా.. మాలో మళ్లీ ఆందోళన మొదలైంది’ అంది తోడేలు.

‘కొన్ని రోజుల క్రితం మన అడవికి, మనకి రక్షణగా నిలిచిన చిరుత అనారోగ్యంతో మరణించింది. ఇప్పుడు చిరుతలా రక్షణగా నిలిచేవారి అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతకు మీలో అర్హులెవరో చెప్పండి’ అంది సింహం. ‘ఆ పదవి నాకు ఇవ్వండి మృగరాజా..’ అంటూ ముందుకు వచ్చింది నక్క. ‘నక్కకు నిద్ర ఎక్కువ. నాకే ఇవ్వండి’ అంది తోడేలు. ‘మాంసాహారులు అడవికి రక్షణగా ఉండలేరు. ఆ పదవి నాకే ఇవ్వండి’ అంటూ ముందుకు దూసుకొచ్చింది జింక. సింహం.. ఏనుగు వైపు చూస్తూ.. ‘ఆ పదవికి మీరందరూ ముందుకొచ్చారు కానీ, అర్హత ఉన్న ఏనుగు మాత్రం నోరు మెదపడం లేదేంటి?’ అని ఆశ్చర్యంగా అడిగింది. ‘తన శరీరం తనకే బరువైన ఏనుగుకు ఆ పదవి ఎలా ఇస్తారు? ఏం అర్హత ఉందని?’ అంటూ ప్రశ్నించింది తోడేలు.

‘ఈరోజు బారెడు పొద్దెక్కినా మీరంతా నిద్రలోనే ఉన్నారు. రక్షణ బాధ్యతలు చేపట్టే వారికి బద్దకం, నిద్రమత్తు అసలే ఉండకూడదు. ఒకవేళ నిద్ర పోయినా చీమ చిటుక్కుమన్నా లేచేలా ఉండాలి. మనకోసం దారికి అడ్డుగా పడిన కొమ్మలను ఏనుగు పక్కకు తీయడం ఈరోజు నేను గమనించాను. పని మీద శ్రద్ధ ఉన్నవారికి పదవితో నిమిత్తం లేదని అది నిరూపించింది. ఇప్పుడు చెప్పండి. నా నిర్ణయం సరైనదేనా?’ అంటూ గట్టిగా అడిగింది సింహం. ‘సరైనదే మహారాజా..’ అంటూ మిగతా జంతువులన్నీ తల దించుకున్నాయి. ఏనుగుకు అభినందనలు తెలిపాయి.  
కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని