ఎవరు అర్హులు?

అదో అడవి. ఆ అడవికి రాజు సింహం. అడవిలోని పరిస్థితులను చక్కదిద్దడంలో అది ముందుండేది. ‘అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి’ అనే సిద్ధాంతాన్ని నమ్మిన మృగరాజు, జంతు సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేది. అందులో భాగంగా అడవి సరిహద్దుల్లో కాపు కాసేందుకు ప్రత్యేకంగా ఒక జంతువును నియమించాలనుకుంది.

Updated : 02 Jun 2023 05:09 IST

దో అడవి. ఆ అడవికి రాజు సింహం. అడవిలోని పరిస్థితులను చక్కదిద్దడంలో అది ముందుండేది. ‘అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి’ అనే సిద్ధాంతాన్ని నమ్మిన మృగరాజు, జంతు సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేది. అందులో భాగంగా అడవి సరిహద్దుల్లో కాపు కాసేందుకు ప్రత్యేకంగా ఒక జంతువును నియమించాలనుకుంది. వేటగాళ్ల రాకను గమనించి మృగరాజుకి సమాచారం అందించడమే దాని విధి. ఒకరోజు జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది సింహం. ‘అడవి సరిహద్దుల్లో రక్షణ బాధ్యతలు నిర్వహించేందుకు ఎవరికైనా ఆసక్తి ఉందా?’ అని అడిగింది. జంతువులన్నీ ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి కానీ, ఏదీ ముందుకు రాలేదు.

ఇక లాభం లేదనుకున్న సింహం.. ముందుగా ఏనుగు వైపు చూసింది. ‘కాపు కాసే వారు పొదల చాటున నక్కి నక్కి ఉండాలి. అందుకు ఏనుగు శరీరం సహకరించదు’ అని మూతి విరిచింది నక్క. ఆ మాటలకు సింహం కూడా ఆలోచనలో పడింది. ఏనుగు చిన్నబుచ్చుకుంది. సింహం ఈసారి ఎలుగుబంటి వైపు చూసింది. ‘ఎలుగుబంటిని చూస్తే వేటగాళ్లు కూడా భయపడతారు. ఆత్మరక్షణ నిమిత్తం దాని దగ్గరి నుంచే వేటను ప్రారంభిస్తారు. ఎలుగుబంటి వాళ్లకు చిక్కితే, ఇక మీకు సమాచారం అందించే వాళ్లెవరూ ఉండరు’ అంది నక్క. ఈసారి ఎలుగుబంటి నొచ్చుకుంది.

తర్వాత జింక వైపు చూసింది మృగరాజు. ‘జింకకు పరుగనేది వెన్నతో పెట్టిన విద్య. కానీ, పిరికితనం మాత్రం పుట్టుకతో వచ్చిన గుణం. కాబట్టి కాపు కాసి మీకు సమాచారం అందించే సామర్థ్యం దానికి లేదనేది నా అభిప్రాయం’ అంటూ కుండబద్ధలు కొట్టింది నక్క. ఆ మాటలకు జింక బాధపడింది. తర్వాత అడవి మేక, కుందేలు వైపు చూసింది సింహం. ‘వాటిని చూస్తే మనకే నోరూరుతుంది. ఇక వేటగాళ్ల కంటపడితే వాళ్లు ఊరుకుంటారా? అక్కడికక్కడే వేటాడి పసందైన విందు చేసుకోరూ..!’ అంటూ నవ్వింది నక్క. అవమానంతో ఆ రెండూ తలదించుకున్నాయి.

తోడేలు మాత్రం ‘మృగరాజా.. మాంసాహార జంతువుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు?’ అని ధైర్యం చేసి ప్రశ్నించింది. ‘అయితే నువ్వు ఉంటావా?’ అని అడిగింది సింహం. ‘నా గురించి అని కాదు.. అందరి బలహీనతలను పసిగట్టడంలో బహునేర్పరి నక్క. రక్షణ బాధ్యతలను దానికే అప్పగించడం సబబుగా అనిపిస్తోంది’ అని తన మనసులోని మాటను చెప్పింది తోడేలు. ‘మృగరాజుకు సమ్మతమైతే నాకూ అంగీకారమే..!’ అని తన కోరికను బయటపెట్టింది నక్క. ‘ఓ జంబూకమా.. అయితే నీకు, తోడేలుకు రక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నా. మీలో వారానికొకరు విధులు నిర్వర్తించాలి. ఒకటి కాపలాగా ఉంటే మరొకటి.. నేను ఇచ్చే ఆహారాన్ని దానికి అందించాలి. ఉద్యోగి భద్రతే ప్రభువుకి భరోసా. అదే పరిపాలన’ అంది సింహం.

మృగరాజు అప్పగించిన పని కాబట్టి అవి రెండూ సరేనన్నాయి. మొదటి వారం తోడేలు వంతుగా తేల్చింది నక్క. తోడేలు కాపు కాసినన్నాళ్లు.. సింహం ఇచ్చే మాంసంలో కొంత భాగం తినేసి, కొద్దిగా మాత్రమే దానికి ఇచ్చేదా నక్క. అది ఎటూ సరిపోకపోవడంతో, తన అర్ధాకలి గురించి నక్కతో వాపోయేది. ‘మృగరాజు ఇచ్చిందే తెచ్చాను.. అయినా పనిపైన ఏకాగ్రత ఉంటే ఆకలి అనిపించదు. నువ్వు అర్ధాకలి అంటున్నావంటే.. పని మీద అంతగా శ్రద్ధ చూపట్లేదనుకుంటా’ అని దెప్పి పొడిచింది నక్క. నొచ్చుకున్న తోడేలు.. ఇకనుంచి ఇంకా జాగ్రత్తగా కర్తవ్యాన్ని నిర్వహించాలనుకుంది.

వారం గడిచాక.. నక్క వంతు వచ్చింది. సింహం ఇచ్చే ఆహారాన్ని నక్క కోసం తీసుకొచ్చింది తోడేలు. అది చీకటి పడే సమయం కావడంతో.. నక్క ఆచూకీ కనిపించలేదు. వెతుక్కుంటూ కాస్త ముందుకు వెళ్లింది. ఇంతలో నక్క పరుగుపెట్టుకుంటూ తనవైపు రావడం తోడేలు గమనించింది. దాన్ని కొందరు మనుషులు వెంబడిస్తున్నారు. అది చూసి.. ఆ వేటగాళ్లు అడవి వైపే వస్తున్నారనుకుంది తోడేలు. పని పట్ల నక్క చిత్తశుద్ధిని మనసులోనే మెచ్చుకుంటూ, సింహం దగ్గరకు పరుగుపెట్టింది. ‘మృగరాజా.. వేటగాళ్లు అడవిలోకి వస్తున్నారు. నక్క వారిని తప్పించుకుంటూ పరుగుపెడుతోంది’ అని ఆయాసపడుతూ చెప్పింది తోడేలు.

సింహం ఒక్కసారిగా గర్జించింది. కొద్దిసేపటికి నక్క మాత్రమే వచ్చిందక్కడికి. ‘నక్క మిత్రమా.. నీ వెనక వచ్చిన వేటగాళ్లు ఎక్కడ?’ అని ఆత్రుతతో అడిగింది తోడేలు. ‘నేను ఎదురుతిరిగి భయపెట్టడంతో తోక ముడిచారు’ అని గర్వంగా చెప్పుకొంది నక్క. ఇంతలో కుందేలు రొప్పుతూ అక్కడికి వచ్చి.. ‘మృగరాజా.. నక్క వెనక పరుగెత్తుకుంటూ వచ్చింది సమీపంలోని గ్రామస్థులు. ఆ ఊరిలోని కోళ్ల కోసం మన నక్క దొంగచాటుగా వెళ్లింది. అది గమనించిన ప్రజలు.. దాన్ని వెంబడించారు’ అని అసలు విషయం చెప్పింది.

దాంతో సింహానికి కోపం కట్టలు తెంచుకుంది. ‘వేటగాళ్లు వస్తే తెలియజేయమని నిన్ను కాపలాగా ఉంచితే, నువ్వే కోళ్ల దొంగతనానికి వెళ్తావా?’ అంటూ ఆగ్రహించింది. ‘పని పట్ల నీది చిత్తశుద్ధి అని భ్రమపడ్డాను కానీ, ఇంత చెత్తబుద్ధి అని గ్రహించలేకపోయాను’ అంది తోడేలు. దాంతో ‘తోడేలు మిత్రమా.. ఇకనుంచి అడవి రక్షణ బాధ్యతలు పూర్తిస్థాయిలో నీకే అప్పగిస్తున్నాను. నక్కను నీకు సహకరిస్తుంది. నువ్వు చెప్పినట్టు నక్క వినకపోతే.. ఆరోజే నా పంజాతో దాని కథ ముగిస్తాను’ హెచ్చరించింది సింహం.

-బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని