చేప పిల్లల సాహసం!

అనగనగా ఒక చెరువు. అందులోంచి రెండు చేప పిల్లలు నీళ్ల పైకి తలపెట్టి చూస్తున్నాయి. ఒడ్డునే ఒక జంతువు కళ్లు మూసుకొని కూర్చుంది. అంతకుముందు దాన్నెప్పుడూ చూడకపోవడంతో ఒక్కసారిగా భయపడ్డాయవి.

Updated : 03 Jun 2023 04:25 IST

నగనగా ఒక చెరువు. అందులోంచి రెండు చేప పిల్లలు నీళ్ల పైకి తలపెట్టి చూస్తున్నాయి. ఒడ్డునే ఒక జంతువు కళ్లు మూసుకొని కూర్చుంది. అంతకుముందు దాన్నెప్పుడూ చూడకపోవడంతో ఒక్కసారిగా భయపడ్డాయవి. బుడుంగున మునిగి, కొద్దిసేపయ్యాక మళ్లీ తలపైకి పెట్టి చూశాయి. ఆ జంతువు అక్కడే కదలకుండా కూర్చునే కనిపించడంతో ఆశ్చర్యపోయాయి.

ఒక చేప ధైర్యం చేసి.. ‘స్వామీ.. ఎవరు మీరు? ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు?’ అని అడిగింది. అప్పుడు ఆ జంతువు కళ్లు తెరిచి వాటి వైపు ప్రసన్నంగా చూసింది. ‘నాయనా.. నేను ఒక నక్కను. చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు తపస్సు చేస్తున్నాను’ అంది. ‘ఓ నక్కగారంటే మీరేనా? నమస్కారం స్వామీ!’ అన్నాయా చేపలు. అప్పటివరకూ అవి నీటిలో నివసించే జంతువుల్ని తప్ప, వేరేవాటిని చూసి ఎరుగవు. ‘సరే ఏమిటి నాయనా విశేషాలు?’ అంటూ ఆప్యాయంగా మాటలు కలిపింది నక్క.

‘మా దగ్గర విశేషాలు ఏముంటాయి స్వామీ.. ఎప్పుడూ ఈ నీళ్లలో పడి కొట్టుకోవడమే! బయట ప్రపంచాన్ని చూసింది లేదు. నీళ్ల నుంచి బయటకు వస్తే చస్తాం’ అంటూ వాపోయాయి చేపలు. ‘అయ్యో.. అలా ఎందుకు దిగులు పడతారు? మీకు ప్రపంచాన్ని చూపించే పూచీ నాది.. కొండలు, గుట్టలు, ఇతర అడవి జంతువులను చూపిస్తాను’ అంది నక్క. ‘అమ్మో.. నిజమే కానీ, మేమెలా వస్తాం స్వామీ.. నీళ్లు లేకపోతే చచ్చిపోతాం కదా?’ అని తమ బాధను వెలిబుచ్చాయి. ‘పిచ్చిమొహాల్లారా.. నేను అంత వెర్రివాడను కాను. ఇప్పుడే మీకోసం నీళ్లు నింపిన పాత్ర తీసుకొస్తాను.. మీరిద్దరూ అందులోకి దూకండి.. అలా మిమ్మల్ని షికారుకు తీసుకెళ్లి అడవిలోని విశేషాలు చూపిస్తాను’ అంది నక్క.

ఆ మాటలకు చేపలు ఎగిరి గంతేశాయి. ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పకుండా.. గబగబా నక్క తెచ్చిన ఒక మట్టి పాత్రలోకి దూకాయవి. ఆ పాత్రలో సగం వరకు నీళ్లున్నాయి. నక్క ఆ పాత్రని జాగ్రత్తగా పట్టుకుని తన గుహకి బయలుదేరింది. దారిలో వివిధ రకాల పక్షులను, కుందేళ్లని చూపించింది. ‘మా జీవితం ధన్యమైంది’ అంటూ చేపలు కృతజ్ఞతలు చెప్పాయి. ‘అప్పుడే అయిపోలేదు.. మీరు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి’ అంటూ నక్క వాటిని తన గుహకు తీసుకెళ్లింది. అప్పటికే పొద్దుపోతుండటంతో ‘ఇక వెళ్తాం స్వామీ.. పెద్దవాళ్లతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేశాం. ఆలస్యంగా వెళ్తే కోప్పడతారేమో..!’ అంటూ దిగులుపడ్డాయా చేపలు.

గుహలోకి వెళ్లాక.. ఆ మట్టి పాత్రలో కొంచెం చింతపండు పిసికి ఆ రసం పోసింది నక్క. దాంతో నీళ్లు పుల్లగా అయిపోయాయి. ‘స్వామీ.. ఉన్నట్టుండి ఈ నీళ్ల రుచి మారిపోయింది’ అన్నాయి చేపలు చప్పరిస్తూ.. తర్వాత కొంత బెల్లాన్ని చితక్కొట్టి.. ఆ పాత్రలో వేసి ‘ఇప్పుడు చూడండి.. నీళ్ల రుచి మారిపోయింది’ అంది నక్క. ‘భలే భలే.. నీళ్లు తియ్యగా ఉన్నాయి’ అంటూ చేపలు ఎగిరెగిరి సంతోషపడ్డాయి. ‘ఇంకాసేపుంటే మీరు మరింత సంతోషపడతారు’ అని ఆ పాత్రని పొయ్యి మీద పెట్టి మంట రాజేసింది నక్క.

మెల్లగా నీళ్లు వేడెక్కుతుంటే, చేపలు కుయ్యో మొర్రో అనడం మొదలుపెట్టాయి. ‘ఇప్పుడు మీరు చక్కగా పులుసైపోతార్రా.. నాకు ఘుమఘుమలాడే చేపల పులుసు దొరికినట్టే..’ అని నవ్వింది నక్క. అంతలోనే.. ‘నీకు ఆ అవకాశం లేదులే..’ అంటూ ఓ భారీ మొసలి గుహలోకి ప్రవేశించింది. వచ్చీరావడంతోనే దాని తోకతో నక్కని చావుదెబ్బ కొట్టింది.. తర్వాత పొయ్యిలో మండుతున్న కట్టెలను తీసి పక్కన పడేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మట్టి పాత్రను కిందకి దించింది. ‘ఓసి పిచ్చి మొహాల్లారా.. ఆ నక్క చెప్పిందని వచ్చేయడమేనా? కొంచెం ఆలస్యమైతే ఈపాటికి చచ్చి ఉండేవారు’ అంటూ ఆ పాత్రను తీసుకుని చెరువుకి బయలుదేరింది.

చేపలు ఏడుస్తూ.. ‘తప్పయింది మామా.. అయినా మేము ఇక్కడికి వచ్చామని నీకు ఎలా తెలిసింది?’ అని ఆశ్చర్యంగా అడిగాయవి. ‘మీరు ఆ జిత్తులమారి నక్కతో మాట్లాడడం చూశాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. వెంటనే ఒడ్డుకొచ్చి మిమ్మల్ని అనుసరించాను. కాబట్టే మిమ్మల్ని రక్షించగలిగాను. మన చుట్టూ మోసగాళ్లు ఉంటూనే ఉంటారు. ఇంకెప్పుడూ ఇలా చెప్పకుండా చెరువులోంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేయకండి. ప్రాణాల మీదకు తెచ్చుకోకండి’ అని హితబోధ చేసింది. చెరువును చేరుకోగానే ఆ చేప పిల్లల్ని అందులో వదిలేసిందా మొసలి. దేవుడా.. అనుకుంటూ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లిపోయాయవి.

చంద్రప్రతాప్‌ కంతేటి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని