రంగుల పక్షులు.. నెమలి రాణి!

అడవిలో ‘మహి’ అనే రామచిలుక కనబడకపోవడంతో మిగిలిన పక్షులన్నీ కంగారు పడ్డాయి. రెండు రోజులైనా అది తిరిగి రాలేదు. తరువాత ఒకరోజు అడవికి తిరిగొచ్చిందా చిలుక.

Updated : 04 Jun 2023 06:55 IST

డవిలో ‘మహి’ అనే రామచిలుక కనబడకపోవడంతో మిగిలిన పక్షులన్నీ కంగారు పడ్డాయి. రెండు రోజులైనా అది తిరిగి రాలేదు. తరువాత ఒకరోజు అడవికి తిరిగొచ్చిందా చిలుక. ‘కనీసం చెప్పకుండా ఎక్కడకు వెళ్లిపోయావు?’ అంటూ చిరుకోపంతో అడిగింది పాలపిట్ట. ‘నీ ఇష్టం వచ్చినట్టు వెళ్లి రావడం ఇక్కడ కుదరదు’ అంది ఆ పక్షుల రాజ్యానికి రాణి అయిన గద్ద. దాని పేరు కృతి. ‘మహారాణీ.. ముందుగా మీరు నన్ను క్షమించాలి. ఆ రోజు మీరు పక్షులన్నింటినీ సమావేశపరిచారు.. గుర్తుందా?’ అంది మహి. ‘ఆ గుర్తులేకే.. ఆ రోజు వాన కూడా వచ్చింది’ అంది పావురం. ‘ఉరుములు, మెరుపులు రావడంతో మీరు సమావేశం మధ్యలోనే ముగించి, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోండి’ అని ఆదేశించారు. ‘అవును’ అంది గద్ద.

‘అందరిలాగే నేనూ నా గూటికి బయలుదేరాను. ఇంతలో ఓ పెద్ద ఉరుముకు భయపడి.. కళ్లు మూసుకునే ఆకాశంలోకి ఎగిరాను. అలా ఎంత దూరం, ఎటువైపు ప్రయాణం చేస్తున్నానో కూడా తెలియలేదు. పూర్తిగా వానలో తడిసి, నీరసంతో ఒకచోట కింద పడిపోయాను’ అంది చిలుక. ‘అయ్యో.. అప్పుడేమైంది?’ ఆందోళనగా అడిగింది కాకి. ‘‘ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో స్పృహ వచ్చి అటుగా చూశాను.. చుట్టూ రంగురంగుల పక్షులు వెంటరాగా, మధ్యలో ఓ బంగారు రంగు నెమలి నడుస్తూ నావైపే రాసాగింది. దాని శరీరమంతా ధగధగా మెరిసిపోతోంది. కొత్తగా ఉన్న నన్ను చూసి అజ్ఞాత పక్షిలా భావించాయవి. దాంతో ఒక్కసారిగా భయపడిపోయాను. అన్నీ కలిసి నన్ను చుట్టుముట్టి రాణీ పక్షి దగ్గరకు తీసుకెళ్లాయి. ‘అనుమతి లేకుండా మా దీవిలోకి రాకూడదని తెలియదా?’ అని ప్రశ్నించాయి. ‘క్షమించండి.. దారి తప్పి వచ్చా’నని సమాధానమిచ్చా. ఆ బంగారు దీవిలో అడుగు పెట్టిన వారెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లలేదన్నాయి’’ అంటూ జరిగింది చెప్పసాగింది చిలుక.
‘ఆ తరువాత ఏం జరిగింది?’ ఆత్రంగా అడిగింది కోకిల. ‘‘నేను బేలగా చూస్తూ మౌనంగా ఉన్నాను. అప్పుడు వెనక నుంచి ఒక వృద్ధ పావురం వచ్చింది. ‘తెలియక వచ్చానని చెబుతోంది కదా.. వదిలేయండి’ అంది. అప్పుడు నాకా పావురం దైవంలా కనిపించింది.. ‘ఇప్పుడిది తిరిగి వెళ్తే, మరిన్ని పక్షులని తీసుకొస్తుంది. వాటి వెంట మనుషులు వస్తారు.. మన దీవిని నాశనం చేస్తారు. దీన్ని వదిలితే మన మనుగడకే ప్రమాదం’ అని గోరింక హెచ్చరించింది’’ అంటూ వివరించింది చిలుక. ‘అయినా.. నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు చిలుకమ్మా..?’ అని అడిగిందో పక్షి. ‘మాది యమునా తీరంలో ఉన్న చిట్టడవి. మా అడవికి కృతి అనే గద్ద రాణి. ఎంతో మంచిది. ఇతరులకి సహాయం చేయడంలో ముందుంటుంది’ అన్నాను. ‘అప్పుడేమన్నాయవి?’ అని అడిగింది గద్ద.

‘మహారాణీ.. మీకు గుర్తుందా.. ఒకరోజు మీరూ, నేనూ కలిసి నదీ తీరానికి వెళ్లినప్పుడు అటుగా పడవ మీద వస్తున్న కొందరు వేటగాళ్లు మనల్ని చూసి, బాణం ఎక్కుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ గద్ద.. ఆ వేటగాళ్ల దృష్టి మరల్చి, బాణం గురి తప్పేలా చేసింది. అలా మనం బతికిపోయాం. అప్పుడు నేను ఆ గద్ద పేరు అడిగితే కృతి అని చెప్పినట్లు ఆరోజు సంఘటనను నెమలికి గుర్తుచేసిందో పిచ్చుక. నెమలి కూడా తనకా సంఘటన గుర్తు ఉందని బదులిచ్చింది’ అని సమాధానమిచ్చింది చిలుక.

‘అవును.. నాకు కూడా ఆరోజు ఇంకా గుర్తుకే ఉంది’ అంది కృతి. ‘అలా ఆరోజు మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకున్న ఆ పక్షులు.. నన్ను వదిలిపెట్టాలనుకున్నాయి. కానీ, వాళ్ల దీవి చిరునామా ఎవరికీ తెలియకూడదని నా కళ్లకు గంతలు కట్టి మరీ.. మన అడవి సమీపంలో వదిలాయి’ అంది చిలుక. ‘అందుకే ఎప్పుడూ ఒకరికి సహాయమే చేయాలి. అది ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా మనకు తిరిగి దక్కుతుంది’ అని హితవు చెప్పింది పక్షి రాణి కృతి. అలాగేనంటూ పక్షులన్నీ రివ్వున ఎగిరిపోయాయి.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని