ఎలుగుకు పాఠం..!

చంపకవనం అటవీ ప్రాంతంలో ఉండే జీవులన్నింటికీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, వైద్యానికి ఎలుగుబంటే దిక్కు. అది జబ్బుకు తగిన మందులు ఇస్తూ.. మంచి పేరు తెచ్చుకుంది.

Updated : 05 Jun 2023 06:37 IST

చంపకవనం అటవీ ప్రాంతంలో ఉండే జీవులన్నింటికీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, వైద్యానికి ఎలుగుబంటే దిక్కు. అది జబ్బుకు తగిన మందులు ఇస్తూ.. మంచి పేరు తెచ్చుకుంది. అన్ని జంతువులూ దాన్ని పొగుడుతుండటంతో క్రమంగా గర్వం పెరిగింది. తను లేకుంటే అడవి జంతువులకు వేరే దిక్కే లేదని విర్రవీగసాగింది. అలా దాన్ని గౌరవించిన వారికి మంచి వైద్యం చేస్తూ.. వేరే వాటికి సరైన మందులివ్వకుండా నిర్లక్ష్యంగా చూసేది.

ఒకరోజు మృగరాజుకు కాలిలో ముల్లు లోతుగా గుచ్చుకోవడంతో బాగా ఇబ్బంది పడసాగింది. మంత్రి అయిన నక్క వెంటనే ఎలుగుబంటి కోసం వెళ్లగా.. కాస్త దూరంగా ఉన్న మరో అడవిలోని తన బంధువుల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక, వెంటనే పక్క అడవిలో వైద్యం చేసే కొంగను పిలుచుకొచ్చింది. కొంగ వచ్చి మృగరాజు కాలికి గుచ్చుకున్న ముల్లును తీసి, మందు రాసి కట్టుకట్టింది. కొంత సమయానికి ఉపశమనం కలిగిన మృగరాజుకు ఒక సందేహం వచ్చింది. ‘ఒకవేళ దేనికైనా ఆపద వచ్చిన సమయంలో ఎలుగుబంటి లేకపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు నేను పడినట్లే అవీ ఇబ్బంది పడాల్సిందే కదా..!’ అనుకుంది. అడవి జంతువుల్లో కొన్నింటికి ఎలుగుబంటి దగ్గర వైద్యం నేర్పడమే దీనికి పరిష్కారమని భావించింది.

మరుసటి రోజే మృగరాజు జంతువుల సమావేశం ఏర్పాటు చేసి.. ‘మన అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గర మీరు కొంతమంది వైద్యం నేర్చుకుంటే బాగుంటుందని నిర్ణయించాను. మీలో ఎవరికి ఆసక్తి ఉందో ముందుకురండి’ అని అడిగింది. దాంతో వైద్యం నేర్చుకోవడానికి కొంగ, కుందేలు, ఏనుగు ముందుకొచ్చాయి. ‘ఈరోజు నుంచే మీరు ఎలుగుబంటి దగ్గర శిష్యరికం చేస్తూ.. వైద్య విద్యను నేర్చుకుని, అడవిలో అందరికీ సేవలు అందించండి’ అంది. ఆరోజు నుంచి ఆ మూడు జీవులూ ప్రతిరోజు వైద్యం నేర్చుకునేందుకు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లసాగాయి. వాటికి వైద్యం నేర్పిస్తే, తన విలువ ఎక్కడ తగ్గిపోతుందోనని భావించిన ఎలుగుబంటి.. ఆ జీవులకు విద్యను నేర్పకుండా ఏదో ఒక సాకు చెబుతూ రోజులు గడపసాగింది. తమకు వైద్యం నేర్పించడం ఎలుగుబంటికి ఇష్టం లేదని కొంగకు అర్థమైంది. ఇక దాని దగ్గరకు ఎన్ని రోజులు వెళ్లినా లాభం లేదనుకుంది. ఇంతలో మృగరాజు కాలిలో ముల్లు తీసిన కొంగ గుర్తొచ్చింది. నేరుగా దాని దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి.. వైద్యం నేర్పించమని కోరింది.

అలా కొంతకాలానికి వైద్య విద్యలో పట్టు సాధించింది. చంపకవనానికి తిరిగొచ్చిన కొంగ.. వైద్యం చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న జంతువులన్నీ ఒక్కొక్కటిగా వైద్యానికి కొంగ దగ్గరికే వెళ్లసాగాయి. అది చక్కగా అన్ని వ్యాధులకు మందులు ఇచ్చి నయం చేయసాగింది. ఈ విషయం ఆ నోటా ఆ నోటా ఎలుగుబంటికి తెలిసింది. ‘నేనేమీ వైద్యం నేర్పించలేదు కదా.. అయినా, ఆ కొంగ ఎలా చికిత్స చేయగలుగుతుంది?’ అనుకుంటూ పరుగుపరుగున మృగరాజు దగ్గరికి వెళ్లింది. విషయం వివరించి.. మృగరాజును వైద్యం చేస్తున్న కొంగ దగ్గరికి తీసుకెళ్లింది.

‘మృగరాజా.. ఈ కొంగ ఏమీ నేర్చుకోకుండానే వైద్యం చేస్తుంది. అది చాలా ప్రమాదకరం. ప్రాణాలతో చెలగాటం ఆడటమే.. వెంటనే మీరు దాన్ని అడ్డుకోవాలి’ అంది. ‘ఎందుకు అలా అంటున్నావు? నువ్వే కదా దానికి వైద్యం నేర్పించింది!’ అని ఎదురు ప్రశ్నించింది సింహం. ‘అది.. అది.. నేను పూర్తిస్థాయిలో ఇంకా వైద్యాన్ని నేర్పించలేదు. కానీ, అది అప్పుడే అందరికీ చికిత్స చేసేస్తుంది’ అంటూ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో ఏనుగు, కుందేలు అక్కడికి వచ్చి ‘మృగరాజా ఈ ఎలుగుబంటి మాకు ఎలాంటి వైద్య విద్యను నేర్పించలేదు. రోజూ ఏదో కాలక్షేపం చేస్తూ దాటవేస్తూ ఉండేది’ అని చెప్పాయి. ‘ఏం ఎలుగుబంటీ.. ఇవి చెప్పేది నిజమేనా?’ అని ప్రశ్నించింది మృగరాజు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయిందది.

‘చూడూ.. కొంగ నాకు ముందే జరిగిన విషయం అంతా చెప్పింది. మనం నేర్చుకున్న విద్యను పదిమందికి పంచితేనే అది వృద్ధి చెందుతుంది. అలా కాకుండా మనం మాత్రమే ఆ విద్యను కలిగి ఉండాలి.. ఆ గుర్తింపు మనకే రావాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. విద్య ఉన్నప్పుడు గుర్తింపు దానంతట అదే వస్తుంది’ అని హితవు పలికింది. ఆ మాటలకు తన తప్పు తెలుసుకున్న ఎలుగుబంటి.. ‘నన్ను క్షమించండి మృగరాజా.. చాలా పొరపాటు చేశాను. ఇకనుంచి నాకు తెలిసిన విద్యను నేర్పిస్తాను’ అని మాటిచ్చింది. దానిలో వచ్చిన మార్పునకు మృగరాజు ఎంతగానో సంతోషించింది.  

కళ్ళేపల్లి ఏడుకొండలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని