స్నేహమేరా శాశ్వతం!

చరణ్‌ నాలుగు నుంచి అయిదో తరగతికి వచ్చాడు. తన స్నేహితుడైన వంశీని చూడాలని వాళ్ల ఇంటికి వెళ్లాడు. ‘వంశీ’ అంటూ పిలిచాడు. చరణ్‌ని చూడగానే హాల్లో సోఫాలో కూర్చున్న వంశీ నవ్వుతూ లేవబోయాడు.

Published : 07 Jun 2023 00:44 IST

రణ్‌ నాలుగు నుంచి అయిదో తరగతికి వచ్చాడు. తన స్నేహితుడైన వంశీని చూడాలని వాళ్ల ఇంటికి వెళ్లాడు. ‘వంశీ’ అంటూ పిలిచాడు. చరణ్‌ని చూడగానే హాల్లో సోఫాలో కూర్చున్న వంశీ నవ్వుతూ లేవబోయాడు. ‘నీ కోసం నేనే వచ్చాను’ అంటూ మిత్రుడిని లేవనివ్వకుండా పక్కనే కూర్చున్నాడు చరణ్‌. ‘వేసవి సెలవుల్లో మీ అమ్మమ్మ గారింటికి వెళ్లావు కదా.. ఎప్పుడొచ్చావు? అక్కడేం చేశావు?’ అంటూ ఆత్రుతగా అడిగాడు వంశీ. ‘నిన్ననే తిరిగొచ్చాం. అమ్మమ్మ రోజూ తెనాలి రామకృష్ణుడు, పరమానందయ్య శిష్యుల కథలు చెప్పేది’ అని చరణ్‌ బదులివ్వడంతో ‘మరి నాకు ఆ కథలు తెలియవు కదా..’ అన్నాడు వంశీ. ‘నేను నీకు చెబుతాను కదా..’ అని నవ్వుతూ భరోసాగా బదులిచ్చాడు చరణ్‌.

అప్పుడే వంశీ వాళ్లమ్మ లక్ష్మి ‘తీసుకో చరణ్‌’ అంటూ చెగోడీలు పెట్టింది. వాటిని అందుకుంటూనే.. ‘ఆంటీ.. ఈ వీధి చివర రామాలయం ఉంది కదా..’ అన్నాడు. ‘ఆ.. అవును.. ఉంటే..?’ అడిగింది లక్ష్మి. ‘అక్కడ ఎగ్జిబిషన్‌ పెట్టారు. వంశీతో కలిసి అక్కడికి వెళ్లాలని ఉంది. నాతో పంపిస్తారా?’ అని అడిగాడు. ఆమె వంశీ వైపు చూడగానే.. ‘ఎగ్జిబిషన్‌ అంటే నాకు చాలా ఇష్టం కదమ్మా.. తప్పకుండా వెళ్తాను కానీ, అందులో రైలు ఉందో, లేదో?’ అంటూ అనుమానంగా అడిగాడు. ‘ఒక్క రైలేమిటీ.. ఎగిరే విమానం, చుట్టూ తిప్పే రంగుల రాట్నం, జెయింట్‌ వీల్‌.. ఇలా చాలా ఉన్నాయట. మా నాన్న చెప్పారు. నీకు ఇష్టం కదా అని వెంటనే నీ దగ్గరకు వచ్చాను. మరి సాయంత్రం వెళ్దామా?’ అడిగాడు చరణ్‌.

అమ్మ కూడా అనుమతి ఇవ్వడంతో వస్తానన్నాడు వంశీ. ‘సాయంత్రం నేను మా ఇంటి నుంచి నేరుగా రామాలయానికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడకు వచ్చేయ్‌’ అన్నాడు చరణ్‌. ‘అక్కడి వరకూ నేనొక్కడినే నడుచుకుంటూ రావాలా?’ కొంచెం బాధగా అడిగాడు వంశీ. ‘దూరం తక్కువే కదా.. ముందే వచ్చి నీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా!’ ధైర్యం చెబుతూ అన్నాడు చరణ్‌. ‘సరే, సాయంత్రం వస్తాను. అక్కడ కలుసుకుందాం’ ఆనందంగా అన్నాడు వంశీ. ‘అలాగే.. ఎగ్జిబిషన్‌లో ఆడుకుందాం’ అంటూ ఇంటికి వెళ్లిపోయాడు చరణ్‌.

సాయంత్రమైంది. వంశీ ఎగ్జిబిషన్‌ చూడాలన్న సంతోషంతో తన ఇంటి నుంచి బయలుదేరాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా రామాలయానికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ చరణ్‌ కనబడలేదు. ఎగ్జిబిషన్‌ కూడా లేదు. మామూలుగా జరిగే వారపు సంత మాత్రమే ఉంది. ఒకవైపు కూరగాయలు, మరోవైపు కిరాణా సరకులు అమ్ముతున్నారు. ఇంకోవైపుగా తినుబండారాల దుకాణాలు ఉన్నాయి. కనుచూపు మేరలో ఎక్కడా ఎగ్జిబిషన్‌ కనిపించకపోవడంతో వంశీకి చరణ్‌ పైన పట్టరాని కోపం వచ్చేసింది. ‘ఎగ్జిబిషన్‌ ఉందని అబద్ధం చెప్పాడు. వస్తానని మోసం చేసాడు. స్నేహితుడు అనే పదానికి అర్థం లేకుండా చేశాడు’ అనుకుంటూ బాధతో వెనుతిరిగాడు.

అప్పుడే ఎదురుగా చరణ్‌ కనిపించాడు. ‘అబద్ధం చెప్పి నన్ను ఇంతదూరం రప్పించావు. నీతో నేను మాట్లాడను.. పో..’ అంటూ చరణ్‌ వైపు కోపంగా చూస్తూ అన్నాడు వంశీ. ‘కోపం వద్దు వంశీ. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక్కడివే ఇంత దూరం నడిచావు. ఎలాగైనా నిన్ను నడిపిస్తానని ఆంటీకి చెప్పాను. చెప్పింది చేశాను’ అన్నాడు చరణ్‌. ‘నడిపించడం ఏంటి?’ సరిగ్గా అర్థంకాక అడిగాడు వంశీ.

‘నాలుగు వారాల క్రితం సైకిల్‌ చక్రంలో పడటంతో నీ కాలికి దెబ్బ తగిలింది కదా.. అప్పుడు డాక్టర్‌ వద్దకు నీతోపాటు నేనూ వచ్చాను.. దెబ్బ తగ్గిపోయాక కాస్త నొప్పిగా ఉన్నా, ప్రతిరోజూ నడుస్తుండాలని డాక్టర్‌ అన్నారు. నీ కాలి దెబ్బ ఎలా ఉందో చూడాలని నేను నిన్న అమ్మమ్మ ఊరి నుంచి నేరుగా మీ ఇంటికే వచ్చాను. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నీ కాలి దెబ్బ పూర్తిగా తగ్గిపోయింది కానీ, నడవమంటే... భయంతో నువ్వు నడిచేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆంటీ నాతో చెప్పారు. ఎంత ఎక్కువ నడిస్తే అంత త్వరగా సర్దుకుంటుందట. అందుకే, నిన్ను నడిపించాలనే ఈరోజు ఉదయం మీ ఇంటికి వచ్చి ఎగ్జిబిషన్‌ పెట్టారని చెప్పాను. సాయంత్రం నీకు తెలియకుండానే నిన్ను అనుసరిస్తూ వచ్చాను. చూశావా ఎగ్జిబిషన్‌ పేరుతో భయాన్ని విడిచిపెట్టావు’ అని అసలు విషయం చెప్పాడు చరణ్‌. ‘అవునా...!!’ అంటూ ఆశ్చర్యపోయాడు వంశీ.

‘ఇదిగో నీకు ఇష్టమని మిఠాయిలు కూడా కొన్నాను.. తిను..’ అంటూ వంశీ చేతిలో లడ్డూ పెట్టాడు చరణ్‌. అప్పుడే వంశీ ఏడవసాగాడు. ‘ఎందుకు ఏడుస్తున్నావు. దెబ్బ పూర్తిగా తగ్గిపోయిందిగా..!’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు చరణ్‌. ‘ఇది ఏడుపు కాదు మిత్రమా.. ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. ముందు నిన్ను తిట్టుకున్నాను. నిజం తెలిశాక స్నేహితుడివంటే నువ్వేనని గర్వంగా అనిపిస్తోంది’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా అన్నాడు వంశీ.

‘అన్నట్టు వంశీ.. మా నాన్న ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా.. మరో వారం రోజుల్లో ఇక్కడ నిజంగానే ఎగ్జిబిషన్‌ పెడతారట. నేను అబద్ధం ఆడలేదు. కొంచెం ముందుగా చెప్పానంతే..’ నవ్వుతూ అన్నాడు చరణ్‌. ‘మా మంచి చరణ్‌..’ అంటూ మిత్రుడి భుజం మీద చేయి వేసి ముందుకు కదిలాడు వంశీ.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని