కొండముచ్చు కట్టడి!
అదొక చిట్టడవి. అందులో కోతులు, కుందేళ్లు తదితర చిన్న చిన్న ప్రాణులు తప్ప క్రూర మృగాలేవీ లేవు. అడవికి రాజు కూడా లేదు. జీవులన్నీ ఐకమత్యంగా ఉంటూ.. పండ్లూ, ఫలాలు తింటూ.. కలిసి మెలిసి జీవించేవి
అదొక చిట్టడవి. అందులో కోతులు, కుందేళ్లు తదితర చిన్న చిన్న ప్రాణులు తప్ప క్రూర మృగాలేవీ లేవు. అడవికి రాజు కూడా లేదు. జీవులన్నీ ఐకమత్యంగా ఉంటూ.. పండ్లూ, ఫలాలు తింటూ.. కలిసి మెలిసి జీవించేవి. ఇక్కడి విషయాలన్నీ పక్క అడవిలో ఉండే ఒక కొండముచ్చు తెలుసుకుంది. నిమిషం ఆలస్యం చేయకుండా.. చిట్టడవిలోకి ప్రవేశించింది. ముఖం నల్లగా.. తోక చాలా పొడవుగా ఉండడంతో దాన్ని చూసి పిల్ల కుందేలు విరగబడి నవ్వింది. అలా కొత్త వారిని చూసి నవ్వకూడదని తల్లి కుందేలు వారిస్తూనే ఉంది. అయినా, పిల్ల కుందేలు నవ్వడం ఆపలేదు. దాంతో కొండముచ్చుకు పట్టరాని కోపం వచ్చింది.
తనను అవి కొత్తగా చూస్తున్నట్టు అర్థం కాగానే.. దాని మదిలో మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే.. ‘నేను ఈ అడవికి రాజును. నా పేరు కొండయ్య. నన్ను చూసి నవ్వుతావా?’ అంటూ కోపంగా చూసింది. ‘నీ రొట్టె పెంక ముఖానికి నువ్వొక రాజువా?’ అని లోలోపలే అనుకుంటూ పడిపడి నవ్వింది కుందేలు పిల్ల. కొండముచ్చు పళ్లు కొరుకుతూ.. అమాంతం దాని మీదకు దూకింది. భయంతో తల్లి వెంటనే పిల్లను దగ్గరికి లాక్కొని.. ‘ఏదో చిన్న పిల్ల చేష్టలు.. మన్నించండి మహారాజా..’ అంటూ వేడుకుంది. ‘మహారాజా’ అనే మాట వినగానే కొండముచ్చు కాస్త శాంతించింది. లోలోన సంబరపడింది కూడా.
‘పక్క అడవి మృగరాజు నన్ను ఈ చిట్టడవికి మహారాజుగా నియమించి పంపాడు. ఈ విషయం అందరికీ తెలియజేయండి’ అంటూ కుందేళ్ల ముఖాల్లో చావు భయాన్ని చూస్తూ ఆనంద పడిందది. వాటిని మరింత భయపెడుతూ.. తినడానికి ఏమైనా తీసుకురమ్మని ఆదేశించింది. తల్లి కుందేలు తన బిడ్డని తీసుకుని చకచకా పొదల్లోకి వెళ్లిపోయింది. కొన్ని పండ్లు తీసుకొని వచ్చి కొండముచ్చుకు అందించింది. మరుసటి రోజు నుంచి దాని ఆగడాలు మితిమీరి పోయాయి. అల్పజీవులపై దాడి చేస్తూ.. వాటి ముఖాల్లో భయాన్ని చూస్తూ.. గంతులు వేసేది. వాటితోనే ఆహార పదార్థాలను తెప్పించుకొని స్థావరం నుంచి కదలకుండా కడుపు నింపుకొనేది.
ఒకరోజు అల్పజీవులన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి. కొండముచ్చు గురించి తెలిసిన తల్లి కుందేలు ముందుకు వచ్చి.. ‘ఈ అపాయం నుంచి బయటపడేందుకు నా దగ్గరో ఉపాయం ఉంది’ అంది. ఆ మరునాడు కొండముచ్చు వద్దకు వెళ్లి.. ‘మహారాజా.. మాలాంటి అల్ప జీవులను భయపెట్టడం కంటే.. ఈ అడవి మీదుగా వెళ్లే మనుషులను బెదిరించండి. వారి ముఖాల్లో కనిపించే భయం మీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది’ అంది. ‘ఈ అడవికి వస్తూ.. వస్తూ.. నక్కతోక తొక్కి వచ్చానేమో.. అంతా నాకు అనుకూలంగా జరుగుతోంది’ అని మనసులోనే అనుకుందా కొండముచ్చు.
తర్వాత రోజు నుంచి అది అడవి బాట మీదుగా రాకపోకలు సాగించే జనం మీద దాడి చేయసాగింది. వారు విసిరేసే రకరకాల తినుబండారాల కంటే వారి ముఖాల్లోని భయాన్ని చూసే అది ఎక్కువ ఆనందపడేది. ‘నేనంటే మీకెందుకు అంత భయం?’ అంటూ వెక్కిరిస్తూ.. నృత్యం చేసేది. ఒక ముసలమ్మను కూడా అలాగే భయపెడితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగెత్తింది. ఇంటికి చేరగానే తన మనవడు మనోహర్‌కి విషయం చెప్పింది.
అతడికి అడవి పరిసర ప్రాంతాలన్నీ తెలుసు. ఆ కొండముచ్చుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించాడు. ఒక నులక మంచాన్ని తీసుకొని అడవికి వెళ్లాడు. తన పథకం ప్రకారం ఒక పెద్ద బావి ఒడ్డునే ఉన్న చెట్టు కింద ఆ మంచం వేసి నడుం వాల్చాడు. ఇదంతా చూస్తున్న కొండముచ్చుకు కోపం కట్టలు తెంచుకుంది. అంత దర్జాగా నిద్రపోతున్న ఆ వ్యక్తిని బావిలోకి తోసేసి, అతడి అంతు చూడాలని అనుకుంది. నెమ్మదిగా శబ్దం కాకుండా మంచం కింద దూరింది. ‘మంచాన్ని బావిలోకి ఎలా తోసేద్దామా?’ అని ఆలోచనలో పడింది. ఇంతలో మనోహర్ తన పథకం ఫలించబోతోందని ముసిముసిగా నవ్వసాగాడు. ఈ క్రమంలో ఆ కొండముచ్చు పొడవైన తోకను నులక మంచానికి కట్టేశాడు.
కొండముచ్చు అది గమనించకుండా, తన శక్తినంతా కూడదీసుకొని మంచాన్ని బావిలోకి తోసింది. అదే అదునుగా చెట్టు కొమ్మల ఆసరాగా బావిలో పడకుండా తప్పించుకున్నాడు మనోహర్. తోక ముడి వేసి ఉండటంతో మంచంతో సహా కొండముచ్చు బావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా.. బయటపడలేకపోయింది. ‘ఊపిరి ఆడటం లేదు.. ఇక చచ్చిపోతానేమో..’ అనే భయం దాని ముఖంలో కనిపించసాగింది. నీళ్లలో దాని ప్రతిబింబం చూసుకొని మరింత భయపడింది. ఏడుస్తూ.. ‘కాపాడండి.. కాపాడండి’ అంటూ అరవసాగింది.
ఇంతలో తల్లి కుందేలు తన మిత్రులతో సహా అక్కడికి వచ్చి.. కొండముచ్చుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంది. కానీ, మనోహర్‌కు మాత్రం జాలి కలిగింది. ‘మనుషులకైనా, జంతువులకైనా ప్రాణం ఒక్కటే.. దాన్ని తిరిగి తీసుకురాలేం’ అని అక్కడున్న జీవులకు వివరించాడు. జంతువుల సాయంతో ఆ కొండముచ్చును బావిలోంచి బయటకు తీసుకొచ్చి రక్షించాడు. అందరి వైపు చూస్తూ.. ‘చావు భయమంటే తెలిసి వచ్చింది. ఇకనుంచి ఎవరినీ భయపెట్టను. నేను మా అడవికి వెళ్లిపోతా. ఎప్పటిలాగా మీరు ప్రశాంతంగా ఉండండి’ అందా కొండముచ్చు.
చెన్నూరి సుదర్శన్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: పాక్‌లో మరోసారి పేలుళ్లు.. పలువురి మృతి
-
Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం