ఎలుగుబంటి వంట!

ఒకరోజు ఎలుగుబంటి అడవిలో అక్కడక్కడా పెరిగిన దుంపలు తవ్వి తెచ్చుకుని, వాటితో పసందైన బిర్యానీ వండటం ప్రారంభించింది. అటుగా వెళ్తున్న కుందేలు.. ‘ఎలుగత్తా.. అడవంతా ఘుమఘుమలాడిపోతోంది.. ఏం వండుతున్నావేంటి?’ అని అడిగింది.

Updated : 09 Jun 2023 04:59 IST

కరోజు ఎలుగుబంటి అడవిలో అక్కడక్కడా పెరిగిన దుంపలు తవ్వి తెచ్చుకుని, వాటితో పసందైన బిర్యానీ వండటం ప్రారంభించింది. అటుగా వెళ్తున్న కుందేలు.. ‘ఎలుగత్తా.. అడవంతా ఘుమఘుమలాడిపోతోంది.. ఏం వండుతున్నావేంటి?’ అని అడిగింది. ‘ఎప్పుడూ తినేవేనా.. కొత్తగా ఏమైనా చేయమని పిల్లలు పేచీ పెడుతుంటే బిర్యానీ వండుతున్నా. అడవి అంచునుండే ముసలమ్మ చేస్తుండగా చాటుగా చూసి నేర్చుకున్నాలే..’ జవాబిచ్చింది ఎలుగుబంటి. ‘బ్రహ్మాండంగా చేస్తున్నావులే కానీ, నీ పిల్లలకేనా నాకేమైనా కాస్త రుచి చూపిస్తావా?’ అని లొట్టలేస్తూ అడిగింది కుందేలు. ‘ఓరినీ.. నీ బుజ్జి పొట్టకెంత కావాలీ.. తప్పకుండా పెడతాను.. అలా వెళ్లి మా పిల్లలతో కబుర్లు చెబుతుండు.. పది నిమిషాల్లో వడ్డించేస్తా’ అందది. ఎలుగు పిల్లలతో కలిసి కడుపునిండా బిర్యానీ తిని, కాస్త తేనె కూడా తాగాక.. దానికి ధన్యవాదాలు చెప్పి భుక్తాయాసంతో ఇంటికి బయల్దేరింది కుందేలు.

కుందేలు ఆయాసపడుతూ వెళ్తుండటాన్ని గమనించిన నక్క.. ‘పొట్ట పగిలేంతగా ఏం తిన్నావేంటి? ఆయాసపడుతూ వస్తున్నావు?’ అని అడిగింది. ‘ఎలుగత్త అద్భుతమైన బిర్యానీ పెట్టింది. పీకలదాకా తిన్నాననుకో..’ అని జవాబిచ్చిందా కుందేలు. ఆ మాట వినగానే నక్కకి కడుపు రగిలిపోయింది. అంతకు ముందోసారి ఇలాగే ఎలుగు ఏదో వంటకం చేస్తుండగా అటువైపు వెళ్లిన నక్కకు కొత్త వాసన రావడంతో దాని గురించి అడిగింది. ‘వెదురు బియ్యంలో కొబ్బరి కలిపి కొబ్బరన్నం చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా దండిగా పడ్డాయిలే.. ఏం రుచి చూస్తావా?’ అని ఆప్యాయంగా అడిగింది ఎలుగు. ‘కొబ్బరన్నం చప్పగా ఉంటుంది. ఓ నాలుగు చేపలనైనా అందులో వెయ్యకపోయావా?’ సలహా ఇచ్చింది నక్క. ‘ఎప్పుడూ మాంసాహారం మంచిది కాదని అడవి అంచున పిల్లలకి పాఠాలు చెప్పే పంతులు అన్నారు. అందుకని ఇవే వండుతున్నాను. రుచి అదిరిపోతుందనుకో..’ అంది ఎలుగు.

తనకొద్దని నక్క ముందుకు కదిలింది. అంతలో తనకెదురొచ్చిన తోడేలుతో.. ‘అన్నా.. ఎలుగు ఏదో కొబ్బరన్నం చేస్తోందట.. తింటావా?’ అని వెటకారంగా అడిగింది. ‘ఎర్రటి మాంసం ముక్కలే కానీ అలాంటివి నాకు మింగుడుపడవు తమ్ముడూ..’ అంది తోడేలు. ‘నాకూ అంతేనన్నా.. ఈ ఎలుగే ఎక్కడలేని చెత్తా తీసుకొచ్చి వండుతోంది. దాని వంటలకి అడవంతా ఒకటే కంపు కొడుతోందనుకో..’ అంటూ వెక్కిరించిందా నక్క. ఆ మాటలు ఏనుగు చెవిన పడ్డాయి. అది ఊరుకోకుండా.. ఎలుగు కనిపించగానే.. ‘ఏమిటి ఎలుగూ.. ఏవేవో వండుతున్నావట. నీవల్ల అడవంతా కంపు కొడుతోందని నక్క చెబుతోంది. నాకైతే అలా ఏమీ అనిపించలేదు సరికదా మీ ఇంటి వైపు నుంచి వచ్చే ఘుమఘుమలకు నోరూరుతుంటుంది’ అంది. నక్క తన వంటల గురించి నోటికొచ్చినట్టు వాగుతోందని తెలిసి.. నేరుగా సింహం దగ్గరకు వెళ్లింది ఎలుగు. ‘రాజా.. మీరు మిగిల్చిన ఆహారం తిని బతికే నక్క.. నా వంటకు వంకలు పెడుతోంది. అడవిలోని జంతువులకు చాడీలు చెబుతోంది’ అని ఫిర్యాదు చేసింది. దాంతో సింహం వెంటనే నక్కను పిలిపించి కోప్పడింది.

ఎలుగు దగ్గర బిర్యానీ తిన్నానని కుందేలు చెప్పగానే.. గతంలో జరిగిందంతా గుర్తు చేసుకుంది నక్క. ఈసారి అదే నేరుగా సింహం దగ్గరకి వెళ్లి.. ‘మహారాజా.. ఎలుగు ఏవేవో వండుతోందనీ, అవి బాగా లేవన్నందుకు నామీద మీకు ఫిర్యాదు చేసింది కదా.. ఇప్పుడు ఎలుగు చేసిన బిర్యానీ తిని కుందేలు అనారోగ్యం పాలైంది. దానికి ఒకటే ఆయాసం, తేన్పులు. ఇక మీదట ఎలుగు అలాంటి వంటలేమీ వండటానికి వీల్లేదని గట్టిగా ఆజ్ఞాపించండి’ అని కోరింది. నక్క మాటలు విని సింహం తొందరపడకుండా.. కుందేలు ఎలా ఉందో చూసి రమ్మని చిలకల్ని పంపించింది. అవి క్షణాల్లో తిరిగొచ్చి.. ‘నక్క చెప్పింది నిజమే ప్రభూ.. కుందేలు ఆయాస పడుతోంది. దాని కళ్లు కూడా మత్తుగా మూసుకుపోతున్నాయి’ అని చెప్పాయి. సింహానికి ఆశ్చర్యంగా అనిపించింది. అయినా, నక్క స్వభావం దానికి తెలియడంతో తొందరపడకుండా స్వయంగా కుందేలు ఇంటికి బయల్దేరింది.

కుందేలు ఉంటున్న చెట్టు తొర్ర దగ్గర నిలబడి.. గట్టిగా గర్జించింది. కాసేపటికి కుందేలు తూలుతూ తొర్ర బయటికి వచ్చి, మూతలు పడుతున్న కళ్లని బలవంతంగా తెరిచి.. ‘ఏంటి మహాప్రభూ..’ అని అడిగింది. ‘ఎలుగు చేసిన బిర్యానీ తిని నీకు ఆరోగ్యం చెడిందట. నిజమేనా?’ అని ప్రశ్నించింది సింహం. ఆ మాట వినగానే కుందేలు నిద్రమత్తు వదిలిపోయింది. ‘ఎవరా మాట అన్నది.. ఈ నక్కేనా?’ అంటూ అడిగింది. సింహం అవుననగానే.. మొత్తం జరిగిందంతా దానికి వివరించింది. ‘నక్క మాటలు నమ్మకుండా మంచిపని చేశారు ప్రభూ.. ఎలుగుబంటి చేసిన బిర్యానీ తిన్నారంటే మీరు కూడా నాలాగే ఆయాస పడుతూ, వెంటనే నిద్ర పోవాలని అనుకుంటారు’ అంది కుందేలు. ‘ఆ దుంపలూ, కాయలూ నేను తినలేను కదా..’ అంది సింహం. ఇంతలో అక్కడికి వచ్చిన ఎలుగుబంటి.. ‘మీకోసం నేను గుడ్లతో బిర్యానీ చేసి పెడతాను ప్రభూ!’ అంది. ఆ మర్నాడే కోడిగుడ్లూ, బాతుగుడ్లూ దండిగా వేసి బిర్యానీ వండిందది. పొట్ట పగిలేలా ఆ బిర్యానీ తిన్న సింహం.. ఆయాసపడుతూ, నిద్ర మత్తుతో కళ్లు మూసుకుపోతుండగా నక్కను చూసింది. ‘ఊ.. నీ కోసం కొంత వదిలేశాను. వెళ్లి అది తినుపో..’ అంటూ కసిరింది. ఆ మాట విని నక్క లొట్టలేసుకుంటూ బిర్యానీ వైపు కదలగా, మిగతా జంతువులన్నీ పకపకా నవ్వాయి.

లక్ష్మీ గాయత్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని