స్వీటీ పుట్టినరోజు..!

పుట్టినరోజు పార్టీకి స్నేహితులందరినీ ఇంటికి ఆహ్వానించింది స్వీటీ. వాళ్ల తమ్ముడూ, నాన్న కలిసి ఇంటిని రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించారు.

Published : 10 Jun 2023 00:06 IST

పుట్టినరోజు పార్టీకి స్నేహితులందరినీ ఇంటికి ఆహ్వానించింది స్వీటీ. వాళ్ల తమ్ముడూ, నాన్న కలిసి ఇంటిని రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించారు. అమ్మ సత్య.. స్వీటీకి ఇష్టమైన గులాబ్‌ జామూన్లు, పాయసం, గారెలు చేసింది. సాయంత్రమయ్యాక స్వీటీ కొత్త దుస్తులు వేసుకొని స్నేహితుల రాక కోసం ఎదురు చూడసాగింది. అంతలో ఒక్కొక్కరూ బహుమతులతో వస్తున్నారు. వచ్చిన వాళ్లను ఆప్యాయంగా పలకరించి కుర్చీల్లో కూర్చోబెట్టింది సత్య. అందరూ వచ్చాక స్వీటీ కేక్‌ కట్‌ చేసింది. స్నేహితులందరూ పుట్టినరోజు పాట పాడి తనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత అందరికీ పళ్లాల్లో కేక్‌ ముక్కతోపాటు గులాబ్‌ జామూన్లు, గారెలు, పాయసం పెట్టింది సత్య.

‘పిల్లలూ.. అందరూ మొహమాట పడకుండా తినండి. ఇంకా ఏమైనా కావాలంటే అడగండి.. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ వంట గదిలోకి వెళ్లిందామె. ‘చిట్టీ.. నాకు గారెలు చాలా ఇష్టం. నువ్వు అవి తప్పకుండా తినాలి’ అంది స్వీటీ. ‘నాకు అవంటే అసలు ఇష్టం ఉండదు.. నేను తినను’ బదులిచ్చింది చిట్టి. ‘నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి కదా.. మరి నా పుట్టిన రోజు నాకు ఇష్టమైనవి తినాలి చిట్టీ..’ అంటూ ఒక గారె తినిపించబోయింది స్వీటీ. ‘నేను కేక్‌, గులాబ్‌ జామూన్‌, పాయసం తింటాను కానీ, గారె వద్దు’ అంటూ చెయ్యి అడ్డం పెట్టింది చిట్టి. అయినా, తన మాట వినకుండా బలవంతంగా గారె నోట్లో పెట్టబోయింది స్వీటీ. దాంతో చిట్టి చెయ్యి తగిలి ప్లేటు కింద పడిపోయింది.

‘అయ్యో! నన్ను క్షమించు స్వీటీ.. పొరపాటు జరిగింది’ అంటూ కంగారుపడింది చిట్టి. ‘ఇక నుంచి నువ్వు నా ఫ్రెండ్‌వి కాదు’ కోపంగా అంది స్వీటీ. మిగిలిన స్నేహితులు వాళ్ల మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలో ‘ఏం జరిగింది పిల్లలూ.. ఏంటి గొడవ?’ అంటూ అక్కడకు వచ్చింది సత్య. వస్తూనే కింద పడిపోయిన పదార్థాలను చూసింది. ‘అమ్మా.. నాకిష్టమైన గారె తినమని చిట్టికి పెడుతుంటే.. వద్దని చెప్పి, ప్లేటు కింద పడేసింది’ అని ఫిర్యాదు చేసింది స్వీటీ. ‘ఆంటీ.. నాకు గారెలు ఇష్టం ఉండదు. అందుకే వద్దన్నాను. నా పొరపాటు వల్ల ప్లేటు కింద పడిపోయింది. నేనే శుభ్రం చేస్తాను’ బాధగా బదులిచ్చింది చిట్టి. ‘నువ్వు శుభ్రం చేయనవసరం లేదు చిట్టీ.. నేను చేస్తాను. మళ్లీ నీకు వేరే ప్లేటులో తెచ్చిస్తాను. నువ్వు కూర్చో’ అంది సత్య.

‘అమ్మా.. చిట్టి పద్ధతి నాకస్సలు నచ్చలేదు’ కోపంగా అంది స్వీటీ. అందరినీ కూర్చోమని చెప్పి, కింద పడిన పదార్థాలను తుడిచి శుభ్రం చేసి.. చిట్టికి మళ్లీ కొత్త పళ్లెంలో గారెలు తప్ప అన్నీ పెట్టిచ్చిందామె. ‘స్వీటీ.. వారం క్రితం నువ్వు స్కూల్‌ నుంచి వచ్చినప్పుడు నీ చొక్కా మీద కూర మరకలు ఉన్నాయి కదా.. అప్పుడు అవి ఎలా వచ్చాయని అడిగితే కారణం చెప్పావు కానీ, నాకు గుర్తు రావడం లేదు. మళ్లీ ఒకసారి చెప్పు!’ అడిగింది వాళ్లమ్మ. ‘ఆ రోజు నా లంచ్‌ బాక్స్‌ను బయటకు తీస్తుంటే, పారపాటుగా చిట్టి లంచ్‌ బాక్స్‌ కిందపడిపోయింది. మూత తెరుచుకోవడంతో అందులోని అన్నం, కూర అంతా నేలపాలైంది. అవి నా చొక్కా మీద కూడా పడ్డాయి’ చెప్పింది స్వీటీ. ‘అప్పుడు చిట్టి నిన్ను కోప్పడిందా?’ అడిగింది సత్య.

‘చిట్టి కోప్పడలేదు ఆంటీ.. ఆయమ్మే ఎందుకలా చేశావని స్వీటీ వైపు ఉరిమి చూసింది’ అన్నాడు అక్కడే ఉన్న నాని. ‘చిట్టీ.. మరి నువ్వు స్వీటీని ఎందుకు తిట్టలేదు? నీ లంచ్‌ బాక్స్‌ పడిపోయింది కదా.. అప్పుడు ఆకలితోనే ఉన్నావా?’ అడిగింది సత్య. ‘మేము ఫ్రెండ్స్‌ కదా ఆంటీ.. అందుకే ఏమీ అనలేదు. నేను తెచ్చుకున్నవి కింద పడిపోయినా, మిగతా స్నేహితులందరూ వాళ్ల బాక్స్‌ల్లోవి కొంచెం కొంచెం పెట్టారు. నిజం చెప్పాలంటే.. ఆరోజే ఎక్కువ తిన్నాను’ నవ్వుతూ అంది చిట్టి. ‘స్వీటీ.. నువ్వు పడేసినప్పుడు అది పొరపాటు.. వేరే వాళ్లు చేస్తే కావాలని పడేసినట్లవుతుందా? నీకు ఇష్టమైనవన్నీ నీ స్నేహితులకు కూడా నచ్చాలని లేదు కదా.. అలా ఒత్తిడి చేయడం తప్పు. పొరపాటుగా పడేసినా కూడా నిన్ను క్షమాపణ అడిగింది. శుభ్రం చేయడంలో కూడా సహాయం చేస్తానంది. స్నేహితుల మధ్య ఎలాంటి అరమరికలు ఉండకూడదు. పొరపాట్లు జరిగినా ఒకరినొకరు క్షమించడం నేర్చుకోవాలి. మీరు పెద్దవాళ్లయ్యాక ఈ అలవాటు మీకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంది సత్య.
అప్పుడు స్వీటీకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. కూర్చున్న చోటు నుంచి లేచి చిట్టి దగ్గరకు వచ్చి ‘నన్ను క్షమించు చిట్టీ.. నాకు ఇష్టమైనవి తినమని నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు వద్దని వారించినా కూడా ప్లేటు పడిపోయేందుకు కారణమయ్యాను. పైగా నీపై అరిచాను కూడా.. అదే తప్పు నేను చేసినప్పుడు కనీసం నీకు సారీ కూడా చెప్పలేదు. ఆయమ్మ నన్ను తిట్టకుండా నువ్వు సహాయం చేశావు. నేను అవన్నీ మరచిపోయాను. నువ్వు నాకు ఎప్పటికీ బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉంటావా?’ అని బిక్క ముఖంతో అడిగింది స్వీటీ.

అక్కడున్న మిగిలిన స్నేహితులంతా.. ‘స్వీటీ.. ఇప్పుడు నువ్వు మాకు ఇంకా నచ్చావు. ఇందాక నువ్వు చిట్టి మీద అరుస్తుంటే మాకు భయమేసింది. ఆ రోజు చిట్టి లంచ్‌ మొత్తం కింద పోయినా నిన్ను ఏమీ అనలేదు. ఈరోజైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు’ అంటూ అందరూ తమ చేతిని ముందుకు చాపారు. ‘ఫ్రెండ్స్‌..’ అంటూ ఒకరి చేతుల మీద మరొకరు చెయ్యి వేశారందరూ. ‘స్వీటీ.. నీకు ఇష్టమైన గారె నాకు పెట్టు. నీ కోసం నేను తింటాను..’ అని నవ్వుతూ అడిగింది చిట్టి. ఆ మాటలకు స్వీటీ ముఖం మతాబులా వెలిగిపోయింది.

కె.వి.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు