నక్క.. పరుగో పరుగు!
అనగనగా అదో పే..ద్ద అడవి. అందులో సింహం, పులి, నక్క, జింక ఇలా అన్ని రకాల జంతువులు హాయిగా నివసిస్తుండేవి. ఒకరోజు పులిబిడ్డ పుట్టిన రోజు జరిగింది. ఆ వేడుకకు వెళ్లి వస్తుండగా, నక్కకు సింహం ఎదురైంది. ‘పుట్టిన రోజు వేడుక ఎలా జరిగింది?’ అని అడిగింది. ‘ఓ.. చాలా ఆర్భాటంగా జరిగింది మృగరాజా.. చుక్కల లేడి పులి బిడ్డకు చక్కని బహుమతులు తెచ్చింది.
అనగనగా అదో పే..ద్ద అడవి. అందులో సింహం, పులి, నక్క, జింక ఇలా అన్ని రకాల జంతువులు హాయిగా నివసిస్తుండేవి. ఒకరోజు పులిబిడ్డ పుట్టిన రోజు జరిగింది. ఆ వేడుకకు వెళ్లి వస్తుండగా, నక్కకు సింహం ఎదురైంది. ‘పుట్టిన రోజు వేడుక ఎలా జరిగింది?’ అని అడిగింది. ‘ఓ.. చాలా ఆర్భాటంగా జరిగింది మృగరాజా.. చుక్కల లేడి పులి బిడ్డకు చక్కని బహుమతులు తెచ్చింది. నెమలి రంగురంగుల బొమ్మలు పట్టుకొచ్చింది. కోకిల తన మధురమైన గాత్రంతో పాటలు పాడింది. పచ్చని చిలుక దాని మాటలతో అతిథులను ఆప్యాయంగా పలకరించింది. ఎలుగుబంటి పుట్ట తేనెను తెచ్చింది. ఏనుగైతే పులిబిడ్డను వీపుపై ఎక్కించుకుని అడవంతా తిప్పింది’ అని బదులిచ్చింది నక్క.
‘ఇక చాలు.. ఎలా జరిగిందని అడిగితే, అంతలా వివరిస్తున్నావు..? ఇంతకూ నేను రాలేదని పులి అసలు గుర్తు చేసిందా?’ అంటూ నక్క మాట్లాడుతుండగానే అడిగింది సింహం. ‘లేదు మృగరాజా.. మీ గురించి ఒక్కమాట కూడా అడగలేదు’ అని చెప్పింది నక్క. ‘అదేంటీ.. నన్ను వేడుకకు రమ్మని మరీ మరీ చెప్పిందే పులి..!’ అంటూ ఆశ్చర్యపోతూ అంది సింహం. ‘ఒక్క పులేమిటీ.. మీరు రాలేదని మిగతా ఏ జీవులూ గుర్తించలేదు. వేటికవే ఆనందంలో ఉన్నాయి. అది చూస్తుంటే మీరు అక్కడ లేకపోవడమే వాటి సంతోషానికి కారణమనిపించింది. నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది. అందుకే అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. మీతో ఆ బాధను పంచుకోవాలనే ఇలా వస్తుంటే, మీరే ఎదురయ్యారు’ అని ఎంతో వినయం ప్రదర్శించింది నక్క. ‘అలాగా..!’ అంది సింహం.
‘ఇంకో విషయం మీకు చెప్పాలనుంది కానీ చెప్పిన తర్వాత మీరు కోపంతో ఏం చేస్తారోనని భయం వేస్తోంది’ అంది నక్క. ‘నిజం దాచినా అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు?’ అని గట్టిగా అడిగింది సింహం. ‘ఈసారి జరగబోయే ఎన్నికల్లో మన అడవికి పులిని రాజును చేయాలని అన్ని జీవులూ అనుకుంటున్నాయి. అందుకు పులి కూడా సిద్ధమని చెప్పడం నేను గమనించాను’ అని బదులిచ్చింది నక్క. దాని మాటలు పూర్తి కాకుండానే కోపంతో ఊగిపోతూ.. ఒక్కసారిగా లేచి జూలు విదిల్చింది సింహం. అది చూసి నక్క భయంతో రెండడుగులు వెనక్కి వేసింది.
‘నేను బరిలోకి దిగనంతవరకే ఆ జీవుల మాటలు, ఆటలు సాగుతాయి. ఆ తరవాత ఇక వాటి కథ ముగిసినట్టే. నా పంజా దెబ్బ ఎలా ఉంటుందో అన్నింటికీ రుచి చూపిస్తాను’ అని కోపంతో ఊగిపోయింది సింహం. దాని మాటలు విన్న నక్క ఇదే మంచి సమయం అనుకుని.. ‘మృగరాజా..! మీ పదవికి పోటీగా వచ్చిన వారితో స్నేహం చేయాలి. అది కుదరకపోతే అడ్డైనా తొలగించుకోవాలి. ఏం చేస్తారో మీరే ఆలోచించండి’ అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చింది. ‘పులి అసలు బుద్ధి బయటపడ్డాక, ఇక దాంతో స్నేహం చేయడం కుదరదు. చంపడమొక్కటే మార్గం అనిపిస్తోంది’ అంది సింహం. ‘నాదీ అదే అభిప్రాయం మృగరాజా..’ అంటూ లోలోపలే పొంగిపోయింది నక్క. ‘అయితే ఇప్పుడే ఆ పులిని చంపేస్తా’ అంటూ గర్జించింది సింహం. ఇంతలో గుహ లోపలి నుంచి పులి రావడం చూసిన నక్క అవాక్కైంది. ‘ఇప్పటి వరకూ పులి ఇక్కడే ఉందా?’ అని వణుకుతూ అడిగింది.
‘పులిని చూసి భయపడుతున్నావా..? వేడుకకు హాజరు కాకపోవడంతో నా ఆరోగ్యం ఎలా ఉందోనని తెలుసుకునేందుకు పులే నా దగ్గరకు వచ్చింది. మరో విషయం ఏంటంటే.. చాలా రోజులుగా నువ్వు పులితో నా గురించి చాడీలు చెబుతున్నావని కూడా తెలిసింది. ఇలా మాలో మాకు గొడవలు పెట్టి, సహాయం చేస్తున్నట్లు నటించి.. మంచి పదవితోపాటు ఇతర ప్రయోజనాలు పొందాలని నీ దురుద్దేశం. ఏ ప్రయోజనం ఆశించకుండా మంచి పనులు చేస్తే, పదవులు వాటంతట అవే వస్తాయి. నువ్వు ఇటుగా రావడం గమనించి, పులిని గుహలోనే దాక్కోమని చెప్పాను. కావాలనే పులి బిడ్డ పుట్టినరోజు ఎలా జరిగిందని అడిగాను. దాంతో నీ కపట బుద్ధి బయటపడింది. చాడీలు చెప్పే నీలాంటి వారి వల్ల అడవికి ఎప్పటికైనా ప్రమాదమే. నేను కళ్లు మూసి తెరిచేలోగా ఇక్కడి నుంచి వెళ్లిపో. ఇంకెప్పుడూ ఈ అడవిలో కనిపించకు’ అంటూ సింహం గట్టిగా చెప్పింది. ఇక తన మాట అక్కడ చెల్లదని తెలుసుకొని, పక్క అడవి వైపు పరుగందుకుందది. ‘జిత్తులమారి నక్కను తరిమేసి మంచి పని చేశారు మృగరాజా!’ అంటూ సింహాన్ని అభినందించింది పులి.
కె.వి.లక్ష్మణరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్‌ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు