మహారాజు నిర్ణయం..!

శాలినీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. ప్రజలను తన సొంత మనుషుల్లా చూసుకునేవాడు. ఒకసారి రాజ్యంలో విపరీతంగా దొంగతనాలు పెరిగిపోయాయి. మహారాజు నిఘా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.

Published : 28 May 2024 00:02 IST


శాలినీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. ప్రజలను తన సొంత మనుషుల్లా చూసుకునేవాడు. ఒకసారి రాజ్యంలో విపరీతంగా దొంగతనాలు పెరిగిపోయాయి. మహారాజు నిఘా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకరోజు ఆ దొంగల ముఠా నాయకుడు, అతని ఒక సహచరుడు తప్ప మిగతా వారందరినీ రాజ భటులు పట్టుకున్నారు. వెంటనే వారిని సభలో హాజరు పరిచారు. రాజు వారికి జైలు శిక్ష విధించాడు. మరికొన్ని రోజుల్లోనే.. ఆ దొంగల నాయకుడు, అతని సహచరుడిని కూడా భటులు పట్టుకున్నారు. కానీ రాజు.. ఒక దొంగను శిక్షించి, మరో దొంగను వదిలిపెట్టేశాడు. ఆ నిర్ణయం ప్రజలెవ్వరికీ నచ్చలేదు. కానీ ఎవరూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. 

మరొకసారి కీర్తిసేనుడు ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి.. తన పరివారంతో కలిసి రాజ్య సరిహద్దుల్లోని అటవీ గ్రామాలకు వెళ్లాడు. పరివారాన్ని ఒకచోట ఉండమని చెప్పి.. ఒక భటున్ని వెంట పెట్టుకొని వెళ్లి, ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంతలోనే మధ్యాహ్నం అయింది. అందరి కోసం భటులు భోజనాలు ఏర్పాటు చేయించారు. మహారాజు తినడానికి వెళ్తుండగా.. ఒక భటుడు, అక్కడున్న ఆహార పదార్థాలన్నిటినీ కింద పడేశాడు. అది చూసి అందరూ అతడిని మందలించారు. ఇక అతనికి శిక్ష తప్పదని భావించారు. ఇదే విషయాన్ని రాజు వచ్చాక ఆయనకు చెప్పారు. అప్పటికే చాలా ఆకలితో ఉన్న రాజు.. కోప్పడి, అతన్ని శిక్షిస్తాడు అనుకున్నారు. కానీ.. అతని భుజం తట్టి ‘శభాష్‌!’ అన్నాడు. దాంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ‘అసలు మహారాజుకు ఏమైంది? అంత ఆహారం నేలపాలు చేసినా.. ఏమీ అనకపోగా, మెచ్చుకుంటున్నాడు!’ అని అంతా అనుకోసాగారు. 

కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఏర్పాటు చేసిన సభలో రాజు మాట్లాడుతూ.. ‘ప్రజలారా! నేను గతంలో ఒక దొంగను శిక్షించకుండా వదిలిపెట్టాను. తినడానికి వండిన ఆహారాన్ని నేలపాలు చేసిన భటున్ని మెచ్చుకున్నాను కదా! ఈ రోజు వారిని సన్మానించబోతున్నాను’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రజలు.. ‘రాజుకు ఏమైనా మతి పోయిందా? ఆ రోజు వాళ్లను మెచ్చుకోవడమే తప్పు అనుకుంటుంటే.. ఇప్పుడు మళ్లీ సన్మానం అంటారేంటి?’ అని మాట్లాడుకోసాగారు. 

అప్పుడే.. ‘ఈ నిర్ణయం మీద మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి’ అని మంత్రి గట్టిగా చెప్పాడు. వెంటనే ఒక వ్యక్తి లేచి.. ‘మహారాజా! గతంలో దొరికిన దొంగల్లో.. ఒకరిని వదిలిపెట్టారు. సరేలే అనుకున్నాం. కానీ.. దొంగకు సత్కారం ఏమిటి? మీ నిర్ణయం మాకు అర్థం కావడంలేదు’ అన్నాడు. అప్పుడు మహారాజు నవ్వి.. ‘నేను సత్కరించే వ్యక్తి.. నిజమైన దొంగ కాదు. అతడు మన మంత్రి కుమారుడు. కావాలనే దొంగల ముఠాలో చేరి, వాళ్లను నమ్మించి.. పట్టుబడేలా చేశాడు. ఎప్పటికప్పుడు మన వేగులకు వారి కదలికల గురించి సమాచారం అందించాడు. అందుకే అతన్ని సత్కరించాలని నిర్ణయించాను’ అన్నాడు. 

తర్వాత మరో వ్యక్తి నిలబడి.. ‘మహారాజా! అందరి కోసం వండిన ఆహారాన్ని కింద పడేసిన భటున్ని శిక్షించకుండా.. అతనికి సన్మానం చేయడంలో మీ అంతర్యం ఏమిటి?’ అని అడిగాడు. ‘ఆ భటుడు మా అందరి కోసం వండిన ఆహారాన్ని నేలపైన పడేసిన మాట నిజమే. కానీ.. దానికి వాడిన వస్తువుల్లో కల్తీ ఉందని ఆలస్యంగా తెలిసింది. అవి తింటే.. అందరి ప్రాణాలకు ముప్పే కదా! అందుకనే అతను అప్పటికప్పుడు అలా చేశాడు’ అని జవాబిచ్చాడు మహారాజు. అప్పుడు ప్రజలంతా.. ‘మమ్మల్ని క్షమించండి మహారాజా! మీ ఆలోచనలు మేము తెలుసుకోలేకపోయాము. మీ నిర్ణయంలో తప్పు లేదు.. అనుకున్నట్లుగానే వారిద్దరినీ సన్మానించడం మనందరి బాధ్యత అన్నారు. దాంతో ప్రజలందరి సమక్షంలో.. దొంగలను పట్టించి రాజ్యంలోని ప్రజలకు మేలు చేసిన మంత్రి కుమారుడిని, కల్తీ ఆహారాన్ని తినకుండా రక్షించిన భటుడిని రాజు సన్మానించి, అభినందించాడు.  

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని