తెలివైన పావురం..

ఒక గద్ద ఆహారం కోసం ప్రయాణిస్తూ.. అది ఉంటున్న అడవి నుంచి మరో అడవిలోకి ప్రవేశించింది. అక్కడికి వెళ్లడం అదే మొదటిసారి. దారిలో దానికి ఓ చెట్టు కింద పావురం కనిపించింది. ఆ గద్దకి.. ఎప్పటి నుంచో పావురాలను తినాలనే కోరిక ఉండేది. అది నివసించే అడవిలో పావురాలు లేవు.

Published : 01 Jun 2024 00:04 IST

క గద్ద ఆహారం కోసం ప్రయాణిస్తూ.. అది ఉంటున్న అడవి నుంచి మరో అడవిలోకి ప్రవేశించింది. అక్కడికి వెళ్లడం అదే మొదటిసారి. దారిలో దానికి ఓ చెట్టు కింద పావురం కనిపించింది. ఆ గద్దకి.. ఎప్పటి నుంచో పావురాలను తినాలనే కోరిక ఉండేది. అది నివసించే అడవిలో పావురాలు లేవు. దాంతో మెల్లగా వెళ్లి.. ఆ పావురాన్ని కాళ్లతో పట్టుకొని, దాని అడవికి తీసుకుపోయింది. ఆ గద్ద బారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించిన పావురం వెంటనే.. ‘నన్ను చంపి తినడం వల్ల నీ ఆకలి ఒక్క పూట మాత్రమే తీరుతుంది. నన్ను వదిలేస్తే మా అడవి నుంచి, రోజూ ఒక పావురాన్ని మాయ మాటలు చెప్పి నీ వద్దకు తీసుకొస్తాను. మా అడవిలో ఢమరుకం అనే పెద్ద పక్షి ఉంది. దానికి గద్దలంటే కోపం. నువ్వు దాని కంట పడకుండా పావురాలను వేటాడడం జరగని పని. దాని కంట పడితే నీకు మరణం తప్పదు. కాబట్టి.. నీకు ఎలాంటి శ్రమా లేకుండా నేనే పావురాలను తీసుకొస్తాను’ అంది. ఆ మాటలు విన్న గద్ద.. ‘సరే నిన్ను వదిలేస్తాను. ఈ చెట్టు నా నివాసం. ఇక్కడికి రోజూ ఒక పావురాన్ని తీసుకొని రా!’ అని చెప్పి దాన్ని వదిలిపెట్టింది. దాంతో ‘హమ్మయ్యా! బతికిపోయాను’ అనుకుంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది పావురం.

అలా నాలుగు రోజులు గడిచిపోయాయి. అయినా కూడా పావురం జాడ లేదు. అది ఎందుకు పావురాలను తీసుకురావడం లేదో తెలుసుకుందామని, బయలుదేరింది గద్ద. చెట్టు కింద ఉన్న పావురం దూరంగా వస్తున్న గద్దను గమనించింది. ‘ఈ అడవిలో గద్దలు లేవు. ఇది ఆ రోజు నన్ను ఎత్తుకెళ్లిందే. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎగిరి చెట్టు మీదకు చేరే ప్రయత్నం చేస్తే దాని కంట పడతాను. ఏం చేయాలి?’ అని ఆలోచిస్తూ.. చెట్టు కిందనే ముడుచుకుని పడుకుంది. ఇంతలోనే పావురాన్ని చూసిన గద్ద.. దాని దగ్గరకు వచ్చి, కాలితో పట్టుకోవడానికి ప్రయత్నించింది. ‘నాకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తావా?’ అంది. అప్పుడు పావురం.. ‘నేను నిన్ను మోసం చేయలేదు. గత నాలుగు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు. అసలు ఎగరలేకపోతున్నా. అందుకే రాలేక పోయాను. ఆరోగ్యం కుదుటపడగానే.. రోజూ ఒక పావురాన్ని నువ్వు ఉంటున్న చెట్టు దగ్గరకు తీసుకొని వస్తాను. ఇప్పుడు నన్ను తింటే.. నా జబ్బు నీకు సోకుతుంది’ అంది. దాంతో పావురాన్ని వదిలేసి వెళ్లిపోయిందది.

‘ఇప్పటికైతే తప్పించుకున్నాను. కానీ ఇది నన్ను వదిలేలా లేదు’ అనుకుంది పావురం. వెంటనే గజరాజు దగ్గరకు వెళ్లి.. ‘మీ పాలనలో అంతా ఆనందంగా ఉన్నాం. కానీ ఈ మధ్య పొరుగునున్న అడవి నుంచి ఒక గద్ద మన అడవికి పావురాలను వేటాడటానికి వస్తోంది. దాని బారి నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి’ అంది. ‘తప్పకుండా రక్షిస్తాను.. దానికి ఏం చేయాలో చెప్పు?’ అడిగింది గజరాజు. ‘రాజా! మీ సైన్యంలోని రెండు ఏనుగులను నా వెంట పంపండి చాలు’ అంది. గజరాజు ఆజ్ఞతో.. ఏనుగులు, పావురంతో పాటుగా గద్ద ఉన్న అడవికి బయలుదేరాయి. వాటిని చూసిన గద్ద.. తనను బెదిరించడానికే ఏనుగులను తీసుకొని వస్తోందని అర్థం చేసుకుంది. వెంటనే వాటి ముందు వాలి.. ‘ఎంత మోసం చేశావు. ఆహారంగా పావురాలను తీసుకొస్తానని మాటిచ్చి.. వీటిని తీసుకొచ్చావు. నిన్ను అస్సలు వదిలిపెట్టను’ అని కోపంతో పావురం మీద దాడి చేయబోయింది గద్ద. దాంతో ఏనుగులు ఒక్కసారిగా ఘీంకరించి.. దాన్ని భయపెట్టాయి. ‘ఇంకోసారి మా అడవి పక్షులను తినడానికి ప్రయత్నించకు. మొదటిసారి కాబట్టి.. ఏమీ అనకుండా వదిలిపెడుతున్నాం. నీ బుద్ధి మార్చుకోకపోతే.. మా ఢమరుకం పక్షి వచ్చి నీ అంతు చూస్తుంది’ అని బెదిరించాయి. అప్పుడు గద్ద.. ‘అమ్మో! ఇవే ఇంత పెద్దగా ఉన్నాయంటే.. ఆ పక్షి ఇంకెలా ఉంటుందో? ఇక్కడ ఉండే కంటే.. వేరే అడవికి వెళ్లడం మేలు!’ అనుకొని అక్కడి నుంచి పారిపోయింది. దాంతో.. ఇక నుంచి గద్ద బాధ తప్పిందని.. ఆనందంగా గెంతులు వేసింది పావురం.

డి.కె.చదువులబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని