అడవికి మేలు చేసే కానుక!

మండు వేసవిలో మృగరాజు పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. జంతువులు ఒక్కొక్కటిగా వచ్చి సింహానికి శుభాకాంక్షలు చెప్పి, తమకు తోచిన కానుకలు ఇస్తున్నాయి.

Updated : 04 Jun 2024 06:10 IST

మండు వేసవిలో మృగరాజు పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. జంతువులు ఒక్కొక్కటిగా వచ్చి సింహానికి శుభాకాంక్షలు చెప్పి, తమకు తోచిన కానుకలు ఇస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. వచ్చిన బహుమతుల్లో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేయడం మృగరాజుకు అలవాటు. ఉత్తమ కానుక తెచ్చిన వారిని, మరో మంచి బహుమతితో ప్రతి సంవత్సరం సత్కరించడం.. మృగరాజు ఆనవాయితీగా పెట్టుకుంది. 
ఈ సంవత్సరం కోతి తెచ్చిన కానుకకు మృగరాజు ముగ్ధురాలైంది. ‘కోతి బావా! సమయానికి తగ్గట్టుగా కానుక అందించి నా మనసు గెలుచుకున్నావు’ అని ప్రశంసించింది మృగరాజు. సింహానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోతి ఉబ్బితబ్బిబైంది. తర్వాత కాసేపటికి విందు ప్రారంభమైంది. అక్కడ కోతిబావ కానుకను ఉత్తమ బహుమతిగా ప్రకటించింది మృగరాజు. 

 ‘ఇంతకీ.. కోతి తెచ్చిన కానుక ఏంటబ్బా?!’ అంటూ కొన్ని జంతువులు ఆరా తీయసాగాయి. నక్క కుతూహలాన్ని ఆపుకోలేక.. ‘మృగరాజా! మీ మనసును గెలుచుకున్న ఆ కానుకేమిటో తెలుసుకోవాలని ఉంది’ అని వినయంగా అడిగింది. ‘మండు వేసవిలో మనల్ని వేధించే సమస్య ఒకటి ఉంది. దాని నుంచి ఉపశమనం కలిగించే కానుక అది’ అని గొప్పగా చెప్పింది మృగరాజు. ‘అంటే...’ అని అడిగింది నక్క. 

 ‘దాహం తీర్చే దివ్యఔషధం... పుచ్చకాయ’ అని నవ్వుకుంటూ చెప్పింది మృగరాజు. ‘మరి.. కోతి బావకు మీరిచ్చే కానుకేమిటో?’ అని అసూయ పడుతూ అడిగింది ఎలుగుబంటి. ‘ఈ మధ్య వేటగాడు జారవిడుచుకున్న ఓ కత్తి నాకు దొరికింది. అది భలే ముద్దొస్తోంది. దాన్నే ఇస్తాను’ అని చెప్పి, మృగరాజు గుహ లోపలకు వెళ్లింది. కాసేపటి తర్వాత అది, ధగధగా మెరుస్తున్న కత్తిని నోటకరుచుకొని తెచ్చి.. అందరి సమక్షంలో కోతికి అందజేసింది. 

 రోజులు గడుస్తున్నాయి. ఏడాది కాలం గిర్రున తిరిగింది. మళ్లీ మృగరాజు పుట్టినరోజు వచ్చింది. ఎప్పటిలానే అన్ని జంతువులూ కానుకలు తెచ్చాయి. ఇంతలో కోతి, గతంలో మృగరాజు ఇచ్చిన కత్తితో వచ్చిందక్కడికి. ‘కోతి బావా! ఈ కత్తితో నీ రాజసం భలేగుంది. ఈసారి మృగరాజు మనసు దోచేందుకు ఏ కానుకతో వచ్చావు?’ అని మిగిలిన జంతువులు అడిగాయి. కత్తిని చూపిస్తూ.. ‘ఇంతకన్నా గొప్ప కానుక ఉందా?..’ అంటూ మృగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. బహుమతిగా దాన్ని అందజేసింది. మృగరాజు కూడా సంతోషంగా ఆ కత్తిని అందుకుంది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ‘ఈసారి కూడా నీదే అత్యుత్తమ కానుక’ అంటూ కోతిని పొగిడింది సింహం. కోతి గర్వంగా జంతువుల వైపు చూస్తూ విందు భోజనాలు వడ్డిస్తున్న చోటుకు వెళ్లింది. 

 ఈసారి జంతువులన్నీ అవాక్కయ్యాయి. ‘మీరు ఇచ్చిన కానుకను మీకు తిరిగి అందించడంలో గొప్పతనమేముంది? అది మిమ్మల్ని అవమానించడమే’ అన్నాయి ఆ జంతువులు. ‘ఇది అవమానం కాదు, ప్రస్తుత అవసరం’ అంది మృగరాజు. ‘అవసరమా?’ అని ఆసక్తిగా అడిగాయి అక్కడున్న జంతువులు. 

 ‘ఈ వేసవిలో వేడి మరింత పెరగకుండా ఉండేందుకు..’ అని చెప్పింది సింహం. ‘వేసవి వేడికి, కోతి చేతిలో కత్తికీ సంబంధమేమిటి?’ అని అర్థంగాక అడిగాయి జంతువులు. ‘ఒక్కసారిగా అడవిలో వేడి పెరగడంతో.. విషయం ఏంటని, ఆరా తీశాను. పెరగాల్సిన మొక్కలు నేలకొరిగి ఉండడం, కోతి పనేనని విచారణలో తేలింది. చెట్లు, మొక్కల సంఖ్య తగ్గే చోట వేడి పెరుగుతుంది. ఇది పర్యావరణ పాఠం. గతంలో కోతి నాకు ఇచ్చిన పుచ్చకాయ తినగా విసిరేసిన విత్తనాలు, మొక్కలుగా మారి ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా కాయలు కాశాయి. ఈ వేసవిలో నా దాహం తీర్చడానికి చాలా ఉపయోగపడ్డాయి. కానుకలు ఇచ్చినప్పుడు ఉపయోగపడేదిగా ఉండటం సముచితమని నాకు అర్థమైంది. విధ్వంసానికి కారణమయ్యే కానుక ఇవ్వడం ఎంత చేటు తెస్తుందో.. కత్తితో కోతి చేష్టలు నాకు పాఠంగా నిరూపించాయి’ అని వివరంగా చెప్పింది మృగరాజు. 

 ‘అయితే ఈసారి కోతికి ఏ కానుక ఇస్తున్నారు?’ అని అడిగాయి జంతువులు. ‘గంపెడు నేరేడు పండ్లు ఇస్తాను’ అంది మృగరాజు. ‘అంతేనా...’ అని తేలికగా అన్నాయి జంతువులు. ‘కోతి ద్వారా ప్రకృతికి జరిగిన నష్టం అవి తిన్నాక వచ్చిన విత్తనాలతో భర్తీ అవుతుంది’ అని నవ్వుతూ చెప్పింది మృగరాజు. ‘మీ కానుక నిజంగా అడవికి మేలు చేస్తుంది’ అంటూ మృగరాజును కొనియాడాయి ఆ జంతువులు.

బి.వి.పట్నాయక్‌   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని