Story: నక్క పిల్లల సమయస్ఫూర్తి...!

ఒక అడవిలో జంబుకం అనే నక్క ఓ గుహలో తన నలుగురు పిల్లలతో కలిసి నివసించేది. తాను ఆహార సేకరణకు వెళ్లేటప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు చెప్పి వెళ్లేది. పిల్లలు తల్లి మాట జవదాటకుండా గుహలోనే ఉండేవి. ఒకరోజు జంబుకం ఆహారం కోసం అడవిలోకి వెళ్లింది. చీకటి పడినా రాలేదు. పిల్లలు తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి.  ఒక పులి వేట నిమిత్తం అడవిలో తిరుగుతూ జంబుకం నివాసం ఉంటున్న గుహ వైపు వచ్చింది.

Updated : 17 Jun 2024 00:22 IST

క అడవిలో జంబుకం అనే నక్క ఓ గుహలో తన నలుగురు పిల్లలతో కలిసి నివసించేది. తాను ఆహార సేకరణకు వెళ్లేటప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు చెప్పి వెళ్లేది. పిల్లలు తల్లి మాట జవదాటకుండా గుహలోనే ఉండేవి. ఒకరోజు జంబుకం ఆహారం కోసం అడవిలోకి వెళ్లింది. చీకటి పడినా రాలేదు. పిల్లలు తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి. 
 ఒక పులి వేట నిమిత్తం అడవిలో తిరుగుతూ జంబుకం నివాసం ఉంటున్న గుహ వైపు వచ్చింది. లోపల జంతువులు ఉన్నట్లు గ్రహించింది. ఈ రోజు ఆహారం బయట దొరక్కపోయినా ఈ గుహలో దొరికిందని సంతోషపడింది. తల్లి రాక కోసం ఎదురు చూస్తున్న నక్క పిల్లలు, గుహ లోపలికి పులి రావడం చూసి భయపడ్డాయి. 

 ‘ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి’ అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాయి. లోపలకు వస్తున్న పులిని చూసి, అందులో ఒక నక్కపిల్ల.. ‘ఈ రోజు అమ్మ మనకు పులిని ఆహారంగా తీసుకు వస్తానంది. అమ్మ చెప్పిన మాట నిజమే. అదిగో పులి మన మాయగుహలోకి ఇప్పుడే ప్రవేశించింది’ అని అంటున్న మాటలు విని పులి ఆగింది. 
 ఇంకో నక్కపిల్ల.. ‘అవును... ఈ మాయగుహలోకి వచ్చిన ఏ జంతువు అయినా మనకు ఆహారం కావాల్సిందే. నేను పులి తలను తింటాను’ అని అంది. మరో నక్కపిల్ల.. ‘లేదు లేదు... నిన్న నువ్వు మన మాయగుహలోకి వచ్చి మరణించిన సింహం తల తిన్నావు. ఈ రోజు నువ్వు పులి శరీరం మాత్రమే తిను. ఈ సారి నాకు పులి తల ఇవ్వు’ అని అంది. 

ఆ మాటలు పులి విని అడుగు ముందుకు వేయకుండా కాసేపు ఆగింది. దానిలో కాస్త భయం ఏర్పడింది. ‘నిన్న వీరికి సింహం ఆహారం అయ్యిందా?’ అని ఆలోచనలో పడింది. ఇంతలో ఇంకో నక్క పిల్ల మిగిలిన వాటితో... ‘అమ్మ నాకు ఈ రోజు పులి తల తినమని చెప్పింది. మీరెవరు పులి తల జోలికి వెళ్లకండి. అది నాకు వదిలేయండి. మిగతా శరీరం మీరు తీసుకోండి’ అని గట్టిగా అరిచింది. 

వీటి మాటలు వింటున్న పులికి తాను మాయగుహలోకి వచ్చి చిక్కుకున్నాననే భయం ఆవహించింది. ఇక్కడ ఇంకాసేపు ఉంటే తాను కూడా మరణిస్తానని వణికిపోయింది. ‘ఇక్కడి నుంచి నేను వెంటనే పారిపోవాలి. ఈ మాయగుహలో చిక్కుకోకుండా, వీటికి ఆహారం కాకుండా నన్ను నేను రక్షించుకోవాలి’ అని తనలో తాను అనుకొని భయంతో వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగు అందుకుంది. 

పులి బయటకు వెళ్లిపోవడంతో నక్క పిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం చాలా పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కాం, లేకపోతే ఈరోజు పులికి ఆహారం అయిపోయేవాళ్లమే’ అని తమలో తాము అనుకున్నాయి. కాసేపు అయిన తర్వాత జంబుకం వచ్చింది. పిల్లలు పులి గుహలోకి వచ్చిన సంగతి చెప్పడంతో చాలా కంగారు పడింది. కానీ అవి సమయస్ఫూర్తితో ఆపదను దాటిన విషయం తెలిసి సంతోషించింది. పిల్లలను అక్కున చేర్చుకుని, అభినందించింది.         

మొర్రి గోపి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని