వాసన పట్టే గట్టి జీవులం!

ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకతుంటుంది... కొన్ని ప్రాణులు భలేగా వాసన పట్టేస్తాయి... ఆ మాకు తెలుసులే... ఇప్పుడు చెప్పేది కుక్కల గురించే అనుకుంటారేమో! కాదు... ఇంకా చాలా జీవులకూ ఈ శక్తి ఉంది... వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా!

Published : 26 Feb 2020 01:44 IST

ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకతుంటుంది... కొన్ని ప్రాణులు భలేగా వాసన పట్టేస్తాయి... ఆ మాకు తెలుసులే... ఇప్పుడు చెప్పేది కుక్కల గురించే అనుకుంటారేమో! కాదు... ఇంకా చాలా జీవులకూ ఈ శక్తి ఉంది... వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా!

నాలుకే ముక్కు

పాములూ అద్భుతంగా వాసన పసిగడతాయి. కానీ.. అవి మిగతా జీవుల్లా ముక్కుతో ఈ పని చేయవు. వాటి నాలుక సాయంతో ఈ పని చేస్తాయి. పాములు ఎక్కువగా నాలుకను లోపలకు, బయటకు ఆడించేది ఇందుకే! ఇవి నాలుకకున్న సెన్సర్ల (గ్రాహకాలు) సాయంతో గాలిలోని రుచిని తెలుసుకుంటాయి.  దీనికోసం వాటి నోటిలో ప్రత్యేక నిర్మాణాలుంటాయి. వాటితో అవి కేవలం ఆహారాన్నే కాదు..  ఎదురుకాబోయే ప్రమాదాలనూపసిగడతాయ్‌.


రక్తపు చుక్క చిందినా..

సొర చేపలు (షార్క్‌లు)  నీటిలోనే వాసన పట్టగలవు. మరే జలచరానికి ఇంతటి శక్తి లేదు. సముద్రం నీటిలో చిన్న రక్తపు చుక్క పడ్డా.. షార్క్‌లు మైలు దూరం నుంచే వాసన పసిగట్టగలవు. అందుకే సముద్ర డైవర్లు నీటిలో ఉన్నపుడు గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు.


ఎంత దూరంలో ఉన్నా...

భూమి మీద ఉన్న జీవులన్నింటి కన్నా.. ఎలుగుబంట్లకే ఎక్కువగా వాసన పసిగట్టగలిగే శక్తి ఉంది. ఇవి మన కన్నా.. ఏకంగా 2,100రెట్లు ఎక్కువగా వాసనను గుర్తించగలవు. దాదాపు 20 మైళ్ల దూరం నుంచే అవి ఆహారాన్ని, ఇతర జీవులు, మిగతా ఎలుగుబంట్ల వాసననూ గుర్తిస్తాయి. అనుకోకుండా వీటి పిల్లలు తప్పిపోతే 20 మైళ్ల పరిధిలో అవి ఎక్కడున్నా.. వాసనబట్టే గుర్తిస్తాయి. ధ్రువపు ఎలుగుబంట్లైతే ఏకంగా 100మైళ్ల దూరం నుంచే వాసనను పట్టేస్తాయట. ధ్రువాల్లో గాలి చాలా స్వచ్ఛంగా ఉండటంవల్లే ఇది సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


టక్కున నీటి జాడ!

కొండంత ఆకారం. పెద్ద తొండం. చాటంత చెవులతో ఉండే ఏనుగు వాసన పట్టడంలోనూ మేటి.ఇవి ఏకంగా 19.2 కిలోమీటర్ల (12మైళ్లు) దూరంలో ఉన్న నీటి జాడనూ పసిగట్టగలవంట. అంతే కాదు... ఒక మైలు దూరం నుంచే గడ్డి వాసన్నూ గుర్తించగలవంట. వాటి తొండాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే గ్రాహకాలే దీనికి కారణం.


 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని