అవాక్కయేలా ...ఔరా ! అనేలా !

కొన్ని జంతువుల్ని చూడగానే.. కొంచెం భయంకరంగా కనిపించినా.. అరె భలే చిత్రంగా ఉన్నాయే.. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదే అనిపిస్తుంది. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందామా!

Published : 18 Mar 2020 00:08 IST

కొన్ని జంతువుల్ని చూడగానే.. కొంచెం భయంకరంగా కనిపించినా.. అరె భలే చిత్రంగా ఉన్నాయే.. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదే అనిపిస్తుంది. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందామా!


ముళ్లపాము.. ఒళ్లు ఝల్లు

అథెరిస్‌ హిస్‌పిడా దీని పేరు. దీన్ని రఫ్‌ స్కేల్డ్‌ బుష్‌ వైపర్‌, స్పైనీ వైపర్‌, హెయిరీ బుష్‌ వైపర్‌ అనీ పిలుస్తారు. ఇందులో రంగులను బట్టి రెండు మూడు రకాలున్నాయి. ఇది విషపూరిత పాము. ఇది ఎక్కువగా మధ్య ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇందులో ఆడవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కంటాయి. ఒక్కో పాము 12 వరకు పిల్లలకు జన్మనిస్తుంది.


అబ్భో. ఇదేం కప్పబ్బా!

వింతగా ఉన్న ఈ జీవి కప్పే! మరో విచిత్రం ఏంటంటే.. ఇది మన దేశంలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని పర్పుల్‌ ఫ్రాగ్‌, ఇండియన్‌ పర్పుల్‌ ఫ్రాగ్‌, పంది ముక్కు కప్ప (ఫిగ్‌ నోస్‌ ఫ్రాగ్‌) అనీ పిలుస్తారు. ఈ కప్ప తన జీవితకాలంలో ఎక్కువ సమయం భూమి లోపలే గడుపుతుంది. కేవలం వర్ష రుతువు(మాన్‌సూన్‌)లోనే బయటకు వస్తుంది.


సూపర్‌ ‘టాపిర్‌’!

చూడటానికి పందిలా.. రంగేమో పాండాలా.. మూతేమో కాస్త ఏనుగు తొండంలా చూడటానికి విచిత్రంగా ఉన్న దీని పేరు టాపిర్‌. ఇవి ఎక్కువగా దక్షిణ, మధ్య అమెరికా, ఆగ్నేయ ఆసియా అడవుల్లో కనిపిస్తుంటాయి. ఇవి శాకాహారులు. ఇవి ఒక్క రోజులోనే 40 కిలోల ఆహారాన్ని జీర్ణం చేసుకోగలవు. వీటి జీవిత కాలం 25 నుంచి 30 సంవత్సరాలు. మరో విషయం ఏంటంటే ఇవి నీటి ఏనుగుల్లా నీటిలోనూ గడపగలవు. వేడి నుంచి రక్షణ పొందడానికే ఇవి ఇలా చేస్తాయి.


కోరల జింక

కోరలతో కనిపిస్తున్న ఈ జింకను వాటర్‌ డీర్‌ అంటారు. ఇవి ఎక్కువగా చైనా, కొరియాలో కనిపిస్తుంటాయి. ఫ్రాన్సు, అమెరికాలోనూ కొద్ది సంఖ్యలో ఇవి ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు, లంకలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంటాయి. ఇవి చక్కగా ఈదగలవు. ఏకబిగి మైళ్లకు మైళ్లు ఎంచక్కా ఈదేస్తాయి. అందుకే వీటిని వాటర్‌ డీర్స్‌ అని పిలుస్తారు. ఇవి మామూలు జింకలతో పోల్చుకుంటే కాస్త చిన్నగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని