నేను ఎంచక్కా చెట్లెక్కేస్తా!

మీకు కంగారూ తెలుసు కదా.. నేనూ కంగారూనే! కాకపోతే నేను ట్రీ కంగారూను! మామూలివి చెట్లు ఎక్కలేవు. నేను మాత్రం చక్కగా ఎక్కేస్తా. నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉందా.. చదివేయండి మరి! నేను ఆస్ట్రేలియా, చుట్టుపక్కల దీవులు, న్యూగినియాలో జీవిస్తాను. అడవులు దట్టంగా ఉన్న చోట నేను నిశ్చింతగా ఉంటా. నేను చెట్ల ఆకులు, పండ్లను ఎంతో ఇష్టంగా తింటా. మళ్లీ మాలోనూ చాలా రకాలున్నాయి. కొన్నింటికైతే తోక వాటి శరీరాన్ని మించి పొడవుగా ఉంటుంది తెలుసా?

Published : 23 Jun 2020 00:09 IST

మీకు కంగారూ తెలుసు కదా.. నేనూ కంగారూనే! కాకపోతే నేను ట్రీ కంగారూను! మామూలివి చెట్లు ఎక్కలేవు. నేను మాత్రం చక్కగా ఎక్కేస్తా. నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉందా.. చదివేయండి మరి!

నేను ఆస్ట్రేలియా, చుట్టుపక్కల దీవులు, న్యూగినియాలో జీవిస్తాను. అడవులు దట్టంగా ఉన్న చోట నేను నిశ్చింతగా ఉంటా. నేను చెట్ల ఆకులు, పండ్లను ఎంతో ఇష్టంగా తింటా. మళ్లీ మాలోనూ చాలా రకాలున్నాయి. కొన్నింటికైతే తోక వాటి శరీరాన్ని మించి పొడవుగా ఉంటుంది తెలుసా? అయ్యో! అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. న్యూగినియాలోని కొన్ని ట్రీ కంగారూలైతే ఆకులు, పండ్లతోపాటు ఏకంగా చిన్న చిన్న పాములు, పక్షుల గుడ్లు, పురుగుల్నీ తినేస్తాయి.

పర్వత ప్రాంతాల్లో ఉంటా..

మాలో చాలా రకాలు పర్వత ప్రాంతాల్లోనే ఉంటాయి. మరి కొన్ని లోయల్లోనూ బతికేస్తాయి. నేను కూడా కోతిలానే ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకేస్తా. మామూలు కంగారూలకు గెంతేటప్పుడు ఎలా అయితే తోక బ్యాలెన్స్‌ కోసం ఉపయోగపడుతుందో.. నాకు కూడా నా తోక చెట్లపై నుంచి దూకేటప్పుడు సాయపడుతుంది.

కొండచిలువలంటే గుండె హ‘డల్‌’!

నేను సంవత్సరానికి కేవలం ఒక పిల్లకే జన్మనిస్తాను. నాకూ పొట్ట కింద సంచి ఉంటుంది. దానిలోనే ఆ పిల్లను సంరక్షిస్తా. నాకు కొండచిలువలంటే చచ్చేంత భయం. ఎందుకంటే అవే నాకు ప్రధాన శత్రువులు. అందుకే మేం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. అప్పుడప్పుడు వాటి చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోతాం.

మేం చిరుజీవులం

మాలో మగవి సగటున 7 కిలోలుంటే.. ఆడవి 5 కిలోల వరకు పెరుగుతాయి. కొన్ని రకాల్లో 15 కేజీల వరకూ పెరిగేవీ ఉన్నాయి. మాకు కాస్త మెలి తిరిగి ఉన్న గోర్లుంటాయి. ఇవి చెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పట్టుకోసం చక్కగా ఉపయోగపడతాయన్నమాట. మరో విషయం.. మాకు చెమట పట్టదు. అందుకే బయట వాతావరణం కాస్త వేడిగా ఉన్నప్పుడు నాలుకతో మా శరీరాన్ని నాకుతాం. అప్పుడు లాలాజలం ఆవిరై మాకు కావాల్సిన చల్లదనం దొరుకుతుంది.

నేల మీదా గెంతుతా..

నేను ట్రీ కంగారూనే అయినప్పటికీ నాకు నేల మీద గెంతడమూ వచ్ఛు కానీ మామూలు కంగారూల్లా అంతంత దూరం మాత్రం గెంతలేను. కానీ వాటికన్నా.. ముద్దుగా బొద్దుగా నేనే చూడముచ్చటగా ఉంటా. వాటికన్నా నా చెవులే చిన్నగా అందంగా కనిపిస్తాయి. ప్చ్‌!.. కానీ నేను వేటగాళ్లకు చాలా తేలిగ్గా చిక్కుతా. అందుకే మమ్మల్ని పెద్దసంఖ్యలో వేటాడేస్తున్నారు.

సరే ఫ్రెండ్స్‌ ఉంటామరి.. బైబై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని