ఇది ఏనుగుల ‘స్పా’ట్‌!

గురువాయూర్‌.. ఇది కేరళలోని ఓ ప్రాంతం. కేవలం అంతేనా అంటే.. ఊహూఁ కాదు. ఈ ప్రదేశానికో ప్రత్యేకతా ఉంది. ఇక్కడ ఏనుగుల ‘స్పా’ నడుస్తోంది. దీని పేరు ‘పున్నథర్‌ కొట్టా ఎలిఫెంట్‌ యార్డు’. ఇక్కడ ఏనుగులకు ఎంచక్కా మసాజ్‌లు, స్నానాలు, పోషకాలతో కూడిన ఆహారం, వాకింగ్‌లు, జాకింగ్‌లు.. ఇలా సకల సౌకర్యాలూ ఉన్నాయి. ఈ గజరాజులు, గజరాణులు! గురువాయూర్‌

Published : 27 Jun 2020 00:36 IST

గురువాయూర్‌.. ఇది కేరళలోని ఓ ప్రాంతం. కేవలం అంతేనా అంటే.. ఊహూఁ కాదు. ఈ ప్రదేశానికో ప్రత్యేకతా ఉంది. ఇక్కడ ఏనుగుల ‘స్పా’ నడుస్తోంది. దీని పేరు ‘పున్నథర్‌ కొట్టా ఎలిఫెంట్‌ యార్డు’. ఇక్కడ ఏనుగులకు ఎంచక్కా మసాజ్‌లు, స్నానాలు, పోషకాలతో కూడిన ఆహారం, వాకింగ్‌లు, జాకింగ్‌లు.. ఇలా సకల సౌకర్యాలూ ఉన్నాయి. ఈ గజరాజులు, గజరాణులు! గురువాయూర్‌ దేవస్థానానికి చెందినవి. ఈ స్పా కూడా దేవస్థానానికి అనుబంధంగా పనిచేస్తోంది. దీన్ని అనకొట్టా అనీ పిలుస్తారు. అంటే ఏనుగుల కోట అని అర్థం.
రౌడీలకు ప్రవేశం లేదు
ఈ ఏనుగులకు ఆధ్యాత్మికంగా ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవాలయ నిర్మాణాల దగ్గర నుంచి దేవుళ్ల ఊరేగింపుల వరకు వీటిదే ప్రధాన పాత్ర. ఈ స్పాలో సుమారు 60 వరకు ఏనుగులకు సేవలు అందిస్తున్నారు. అలా అని చెప్పి అన్ని ఏనుగులకు ఇక్కడ ప్రవేశం ఉండదు. ముఖ్యంగా రౌడీ ఏనుగులను ఈ దరిదాపుల్లోకి అనుమతించరు. అవి చాలా మొరటుగా ఉండి.. ఇతర ఏనుగుల మీద దాడి చేస్తాయని వాటిని దూరం పెడతారు.
జులై వస్తే పండగే!
ఇక్కడ ప్రతీ ఏనుగుకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు స్నానం చేయిస్తారు. ఒక్కో ఏనుగుకు ఇద్దరు మావటీలు ఉంటారు. ప్రత్యేకమైన రాయి, కొబ్బరి పీచుతో మసాజ్‌ చేస్తారు. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందంటారు. ఒక్కోదానికి రోజుకు 300 కేజీల పచ్చని గ్రాసం, 50కేజీల బెల్లం కలిపిన అన్నం, ఇతర ఆయుర్వేదిక్‌ టానిక్‌లు అందిస్తారు. వీటికి తోడు కండరాల పటుత్వం కోసం ఏనుగులకు రోజూ నడక ఉంటుంది. అయితే ఈ స్పా సంవత్సరం పొడవునా ఉండదు. కేవలం జులైలోనే ఈ సేవలు అందిస్తోంది. అంటే జులై వస్తే ఇక్కడి ఏనుగులకు పండగే అన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని