మొక్కనా? జీవా?

హాయ్‌ ఫ్రెండ్స్‌... నా పేరు సీ పెన్‌. అదేంటీ పేరే చిత్రంగా ఉంది అనుకుంటున్నారా? నా రూపమూ వింతే. కావాలంటే ఈ ఫొటో చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఏదో ఈకల కుచ్చులా ఉందే అన్నట్టు కనిపిస్తుంది నా ఆకారం. కానీ నేనో సముద్ర జీవిని. మేమంతా కలిసి ఒక దగ్గర కనిపిస్తే ‘ఇవేమైనా ప్రత్యేకమైన మొక్కలా?’ అన్నట్టు ఉంటాం. నేను చెప్పేవరకూ నేను జీవినన్న విషయం మీకూ తెలియలేదు కదూ!

Published : 29 Jun 2020 00:32 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... నా పేరు సీ పెన్‌. అదేంటీ పేరే చిత్రంగా ఉంది అనుకుంటున్నారా? నా రూపమూ వింతే. కావాలంటే ఈ ఫొటో చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఏదో ఈకల కుచ్చులా ఉందే అన్నట్టు కనిపిస్తుంది నా ఆకారం. కానీ నేనో సముద్ర జీవిని. మేమంతా కలిసి ఒక దగ్గర కనిపిస్తే ‘ఇవేమైనా ప్రత్యేకమైన మొక్కలా?’ అన్నట్టు ఉంటాం. నేను చెప్పేవరకూ నేను జీవినన్న విషయం మీకూ తెలియలేదు కదూ! ●

* నేను సముద్రపు లోతుల్లో జీవిస్తుంటా. అంటే నీటి ఉపరితలం నుంచి వేల అడుగుల లోతులో.

* అప్పట్లో మీ తాతల కాలంలో ఈకలతో ఉన్న ప్రత్యేకమైన పెన్నులుండేవి. చూడ్డానికి నా రూపం అలాగే ఉందని నాకీ పేరు పెట్టారన్నమాట. నా శాస్త్రీయ నామం పెనెటులసియా.

* కోరల్‌ రీఫ్స్‌ పేరు వినే ఉంటారుగా. అదేనండీ పగడపు దిబ్బలు. సముద్రాల్లో పరుచుకుని ఉంటాయి. నేను కూడా వాటిల్లానే ఇసుక, మట్టిపై ఉంటానన్నమాట.

* రెండు అంగుళాల నుంచి దాదాపు ఏడు అడుగుల ఎత్తు వరకు పెరిగేస్తుంటాం. మాకూ ఆక్టోపస్‌ జీవుల్లా ఎనిమిది టెంటకిల్స్‌ ఉంటాయి. పసుపు, ఆరెంజ్‌, తెలుపు రంగుల్లో భలేగా ఉంటాం. మాలో కొన్ని రాత్రుల్లో ధగధగ మెరిసిపోతుంటాయి కూడా. కొన్నైతే నెమలి ఈకల్లా అందంగా ఉంటాయి.

* ఇసుక లేదా మట్టిలో చొచ్చుకుని పోయి గుంపులు గుంపులుగా బతికేస్తుంటాం. మా చుట్టూ తిరిగే నాచు, చిన్న చిన్న జీవుల్ని పట్టుకుని తినేస్తుంటాం. కొంతమంది అక్వేరియాల్లో పెంచుతుంటారు. కానీ మా పెంపకం అంత సులువేం కాదండోయ్‌. ఎందుకంటే మాకు ప్రత్యేకమైన వాతావరణం, ఆహారం ఉంటేనే మేం హాయిగా బతికేది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని