బెకబెక.. నేను విచిత్ర కప్పను!

నేనో కలప కప్పను. నా పేరులోనే ఉంది నా విశేషం! మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ! అవును నేను ఎక్కువగా దట్టమైన అడవుల్లో పచ్చనిచెట్ల మధ్య బతికేస్తా. అందుకే నన్ను ‘వుడ్‌ ఫ్రాగ్‌’ అని పిలుస్తారు. నాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే నేను శీతాకాలంలో గడ్డకట్టుకుపోతాను. అయినా బతికే ఉంటాను. చిత్రంగా ఉంది కదా! అయితే ఇంకేం చదివేయండి మరి!

Updated : 21 Sep 2020 06:18 IST

నేనో కలప కప్పను. నా పేరులోనే ఉంది నా విశేషం! మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ! అవును నేను ఎక్కువగా దట్టమైన అడవుల్లో పచ్చనిచెట్ల మధ్య బతికేస్తా. అందుకే నన్ను ‘వుడ్‌ ఫ్రాగ్‌’ అని పిలుస్తారు. నాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే నేను శీతాకాలంలో గడ్డకట్టుకుపోతాను. అయినా బతికే ఉంటాను. చిత్రంగా ఉంది కదా! అయితే ఇంకేం చదివేయండి మరి!

నేను ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంటాను. మాలో ఆడవి మగవాటికన్నా కాస్త పెద్దగా ఉంటాయి. మేం గోధుమ, తుప్పు రంగులో ఉంటాం.

గడ్డకట్టుకుపోతా..

శీతాకాలంలో ఎముకలు కొరికే చలి ఉన్నా.. నేను తట్టుకుని బతకగలను. కాకపోతే నా శరీరం దాదాపు 65 శాతం మేర మంచు ముక్కలా గడ్డకట్టుకుపోతుంది. అప్పుడు నన్ను చూసిన వారు ఎవరైనా నేను చచ్చిపోయిన కప్ప అనుకుంటారు. కానీ నేను బతికే ఉంటాను.

రక్తసరఫరా ఆగిపోతుంది

మంచు కురిసే వేళలో నా శరీరానికి రక్తసరఫరా దాదాపు ఆగిపోతుంది. గుండె స్పందనలూ తగ్గిపోతాయి. కానీ వీటితో సంబంధం లేకుండా నాడీ వ్యవస్థ మాత్రం తన పనితాను చేసుకుపోతుంది. ఇలా దాదాపు నేను 6 నెలలు సుప్తావస్థ (నిద్రలాంటి స్థితి)లోనే ఉండిపోతా. తిరిగి వేసవి కాలం రాగానే క్రమంగా మంచు కరుగుతుంది. నా శరీరమూ మాములుగా మారుతుంది. నేను హాయిగా తిరిగేస్తా. నా శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని ప్రత్యేక పదార్థాలు నేను గడ్డకట్టుకుపోయినా.. చనిపోకుండా కాపాడతాయి. మా జీవితకాలం మూడు సంవత్సరాలు మాత్రమే. కానీనీ సంవత్సరంలో ఆరునెలలు గడ్డకట్టుకుపోయే ఉంటాం.

నాచుతో గూడు కట్టి.. గుడ్లు పెట్టి

మాలో ఆడకప్పలు గుడ్లుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మగవి నీటికుంటల్లో నాచుతో తెట్టులాంటి గూడు కడతాయి. ఇందులో ఆడవి గుడ్లు పెడతాయి. వీటిని చేపలు, ఇతర జలచరాలు తినకుండా ఉండేందుకే ఈ గూడు ఏర్పాటు. గుడ్లు టాడ్‌పోల్‌ లార్వాలుగా మారి కొన్ని రోజులు ఆ నాచునే ఆహారంగా తీసుకుని తర్వాత చిన్న కప్పలుగా మారతాయి. ఇంతకీ మా ఆహార అలవాట్లు చెప్పనేలేదు కదూ..! నిజానికి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. మిగతా కప్పల్లానే చిన్నచిన్న పురుగులు, కీటకాలను తిని బతికేస్తాం.

బెకబెక.. బెకబెక.. ఏంటి అలా చూస్తున్నారు. మా భాషలో మీకు బై..బై చెబుతున్నా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు