‘లక్ష’ణమైన చేప!

అమ్మతోనో, నాన్నతోనో మార్కెట్‌కు వెళ్తుంటారా? అప్పుడప్పుడు చేపలు కొంటుంటారా? సాధారణంగా ఎంత పెద్ద చేప అయినా రేటు రూ.వందల్లో చెబుతారు కదా.. మరీ అరుదైనది

Updated : 25 Sep 2020 00:56 IST

అమ్మతోనో, నాన్నతోనో మార్కెట్‌కు వెళ్తుంటారా? అప్పుడప్పుడు చేపలు కొంటుంటారా? సాధారణంగా ఎంత పెద్ద చేప అయినా రేటు రూ.వందల్లో చెబుతారు కదా.. మరీ అరుదైనది అయితే వేలల్లో ఉంటుంది. ఆ ధరకే వామ్మో అనుకుంటాం.. కానీ, ఓ రకం చేప మాత్రం లక్షలు పలుకుతోంది.. ఆ జలచరం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా..!!

గత మంగళవారం ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులోని బంగాళాఖాతం తీరం వద్ద ఓ మత్స్యకారుడికి 28 కిలోల కచిడి చేప దొరికింది. ఇక అంతే.. దాన్ని కొనుగోలు చేసేందుకు స్థానికులు, వ్యాపారులు పోటీపడ్డారు. గోదావరిలో పులస చేపల మాదిరి వీటికీ విపరీతమైన ధర పలుకుతుంది. వలలో పడింది మగ చేప కావడంతో ఓ వ్యాపారి రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశాడు. అంతకుముందు 2015లో తూర్పుగోదావరి జిల్లాలో వలకు చిక్కిన కచిడి చేప లక్ష రూపాయలు పలికింది. గతేడాది సెప్టెంబరులో కాకినాడలో 30 కేజీల బరువున్న చేపను ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొన్నాడు. ఈ చేపలు పది ఇరవై కాదు.. ఏకంగా 200 కేజీల వరకు బరువు పెరుగుతాయట.

ఔషధాల తయారీలో..

మార్కెట్‌లో సూపర్‌ ధర పలుకుతున్న ఈ చేప సాంకేతిక నామం.. ప్రొటోనిబియా డయాకాన్తస్‌. వీటి రెక్కలు గరుకుగా, చిన్నగా ఉంటాయి. పొట్ట భాగం మాత్రం గట్టిగా ఉంటుంది. ఒకచోట స్థిరంగా ఉండని.. గుంతల్లో పెరిగే ఈ జీవుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. శస్త్రచికిత్స(ఆపరేషన్‌) తర్వాత కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారంట. ఈ దారం కాలక్రమంలో శరీరంలో కలిసిపోతుంది. సౌందర్య సాధనాలు, పలు రకాల మందుల తయారీలోనూ వినియోగిస్తారు. అంతేకాదండోయ్‌.. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడంలో ఈ చేప రెక్కలను వాడతారంట. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈ సీ గోల్డ్‌ ఫిష్‌.. అంత ధర పలుకుతోంది. ఎప్పుడు, ఎక్కడ దొరికినా సంచలనం అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని