ఆ ఊళ్లో.. ఇంటికో గుర్రం!

మనం ఏదైనా పని మీద పక్క వీధికో, దగ్గరలోని స్నేహితుడి ఇంటికో నడిచి గానీ లేకపోతే సైకిల్‌పైనో వెళ్తాం. అదే దూరమైతే.. పెద్దవాళ్లతో కలిసి బండి మీదో, బస్సులోనో, ఆటోలోనో వెళ్లిపోతాం. కానీ, ఓ గ్రామంలోని ప్రజలకు గుర్రాలే వాహనాలు.. ఎందుకంటే అక్కడ బైక్‌లు, ఇతర వాహనాలు ఏమీ ఉండవు కాబట్టి.. ఇంతకీ ఆ ఊరెక్కడో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

Published : 04 Feb 2021 00:55 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..
మనం ఏదైనా పని మీద పక్క వీధికో, దగ్గరలోని స్నేహితుడి ఇంటికో నడిచి గానీ లేకపోతే సైకిల్‌పైనో వెళ్తాం. అదే దూరమైతే.. పెద్దవాళ్లతో కలిసి బండి మీదో, బస్సులోనో, ఆటోలోనో వెళ్లిపోతాం. కానీ, ఓ గ్రామంలోని ప్రజలకు గుర్రాలే వాహనాలు.. ఎందుకంటే అక్కడ బైక్‌లు, ఇతర వాహనాలు ఏమీ ఉండవు కాబట్టి.. ఇంతకీ ఆ ఊరెక్కడో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో దాయర్తి అనే ఓ మారుమూల గ్రామం ఉంది. ఆ ఊరిలో మనుషులతో సమానంగా గుర్రాలు కనిపిస్తాయి. అంటే.. దాదాపు ఇంటికో గుర్రం ఉంటుంది. అందుకే ఆ ఊరిని ‘గుర్రాల గ్రామం’ అని పిలుస్తుంటారు.

రాళ్లబాటలో నడిచి వెళ్తేనే..
దాయర్తి గ్రామం దూరంగా అడవుల్లో విసిరేసినట్టు ఉంటుంది. రోడ్డు, విద్యుత్తు సదుపాయాలు ఏమీ లేవు. ఈ ఊరికి చేరుకోవాలంటే కొండ దిగువ నుంచి రాళ్ల బాటలో దాదాపు ఏడు కిలోమీటర్లు నడవాల్సిందే. అలాంటి ప్రాంతానికి రవాణా సౌకర్యాలు ఉండవు కాబట్టి అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాల కోసం గుర్రాలనే వినియోగిస్తుంటారు. అటవీ ఉత్పత్తులు, పంటలు అమ్ముకోవాలన్నా, ఏమైనా కొనాలన్నా.. కొండ ఎక్కాలన్నా, దిగాలన్నా వారికి ఆ మూగజీవాలే ఆధారం.

గుర్రాలే ఆస్తి  
ఈ గిరిజన గ్రామానికి వందేళ్ల చరిత్ర ఉందట. ఊరు ఏర్పడ్డ కొత్తలో పది నివాసాలుంటే.. మూడు, నాలుగు గుర్రాలుండేవి. ఇప్పుడు ఇళ్ల సంఖ్య ఎనభైకి పెరగ్గా, గుర్రాలు 60కి పైగా ఉన్నాయట. తరతరాలుగా వారికి వచ్చే ఆస్తి ఈ గుర్రాలే. అంతేకాదండోయ్‌.. ఈ ఊరిలో జరిగే పెళ్లిళ్లకు గుర్రాలను కానుకగా ఇచ్చే ఆచారం కూడా ఉందట. చుట్టుపక్కల దాదాపు పది వరకు చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఆ ఊళ్లలోని వారికి ఏ అవసరమొచ్చినా.. అనారోగ్యమైనా దాయర్తి అశ్వాలే ఆధారం. ఇక్కడ గుర్రాల సంతలు కూడా జరుగుతాయంట.
కంటికి రెప్పలా..
గుర్రాల పెంపకం, పోషణ ఖర్చుతో కూడుకున్నది. దాయర్తి ప్రజలు పేదవాళ్లు కావడంతో ప్రయాణం చేయాల్సిన సమయంలోనే గుర్రాలకు దాణా పెడతారట. మిగతా రోజుల్లో అవి అడవుల్లోని పచ్చగడ్డి, కాయలు తింటుంటాయి. అశ్వాలను పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయ ఆస్తిగా భావించే ప్రజలు.. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇక్కడ చిన్న పిల్లలు ఏడిస్తే.. గుర్రం ఎక్కించి తిప్పుతారట. మనల్ని బైక్‌ మీద తిప్పినట్లు అన్నమాట. ‘గుర్రాల గ్రామం’ భలే ఉంది కదూ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు